Site icon NTV Telugu

Supreme Court: రామ్‌దేవ్‌బాబాకు సుప్రీంకోర్టు సమన్లు.. దేనికోసమంటే..!

Suprem

Suprem

యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఆయనకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రామ్‌దేవ్‌ బాబాతో పాటు మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆచార్య బాలకృష్ణ కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వకపోవడంతో ఈ మేరకు ధర్మాసనం సమన్లు ఇచ్చింది.

ప్రస్తుత వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని సూచించింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.

అయితే ఆ హామీని ఉల్లంఘించడంపై గత నెల ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్‌దేవ్‌ బాబాకు, ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది. ప్రకటనల విషయంలోనూ కొన్ని సూచనలు చేసింది.

ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్‌ లేదా ఎలక్ట్రానిక్‌ మాధ్యమాల్లో ఎలాంటి ప్రచారం చేయొద్దని మరోసారి కోర్టు సూచించింది. అయితే ఆ నోటీసులకు పతంజలి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదు అని జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ అమనుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరు కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.

Exit mobile version