NTV Telugu Site icon

Paritala Ravi: పరిటాల రవి హత్య కేసు.. బెయిల్‌పై విడుదలైన ఐదుగురు ముద్దాయిలు!

Paritala Ravi Murder

Paritala Ravi Murder

మాజీ మంత్రి, దివంగత నేత పరిటాల రవి హత్య కేసులో ఐదుగురు నిందితులు నేడు బెయిల్‌పై విడుదలయ్యారు. కడప జైలు నుంచి నలుగురు, విశాఖ జైలు నుంచి ఒకరు విడుదల అయ్యారు. కడప జైలు నుంచి పండుగ నారాయణ రెడ్డి, ఓబి రెడ్డి, వడ్డే కొండ, బజన రంగనాయకులు విడుదల కాగా.. విశాఖ జైలు నుంచి రేఖమయ్య రిలీజ్ అయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చి వెంటనే.. నిందితులు తమ వాహనాల్లో బయల్దేరి వెళ్లారు.

అనంతపురం జిల్లా పెనుకొండలో 2005 జనవరి 24న టీడీపీ నేత పరిటాల రవి హత్య జరిగిన విషయం తెలిసిందే. కార్యకర్తల సమావేశానికి హాజరైన రవిపై మొద్దు శీను, రేఖమయ్య, నారాయణ రెడ్డి కాల్పులు జరిపారు. ఓబి రెడ్డి, రంగనాయకులు, వడ్డే కొండ తదితరులు.. టీడీపీ పార్టీ కార్యాలయం బయట బాంబులు వేసి కార్యకర్తలను భయభ్రాంతులను చేశారు. రవి హత్య కేసులో 16 మందిని నిందితులుగా చేర్చగా.. అందులో నలుగురిని కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 12 మందిలో రామ్మోహన్‌ రెడ్డి అప్రూవర్‌గా మారారు. ఏ1 మొద్దు శీను, ఏ2 మద్దెలచెరువు సూరి సహా ముద్దాయి తగరకుంట కొండా రెడ్డి విచారణ సమయంలోనే హత్యకు గురయ్యారు. జీవిత ఖైదు శిక్ష పడినవారికి 18 ఏళ్ల తర్వాత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.