NTV Telugu Site icon

Paralympic 2024: పారాలింపిక్స్‌ విజేతలకు భారీ నజరానా.. పసిడికి రూ.75 లక్షలు!

Paralympics 2024 India Winners

Paralympics 2024 India Winners

Indian Para Gold Medallists Get 75 Lakh Cash Reward: పారిస్ పారాలింపిక్స్‌ 2024లో భారత అథ్లెట్లు అంచనాలను మించి రాణించారు. రికార్డు స్థాయిలో 84 మంది అథ్లెట్లు పారిస్‌ క్రీడల్లో పాల్గొనగా.. 29 పతకాలు సాధించారు. పారాలింపిక్స్‌ చరిత్రలో భారత అథ్లెట్లు అత్యధిక పతకాలు సాధించడం ఇదే మొదటిసారి. 2020 టోక్యో పారాలింపిక్స్‌లో 19 పతకాలు సాధించిన భారత్.. ఈసారి 29 పతకాలు గెలిచింది. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలు ఉన్నాయి. పారిస్‌లో చరిత్రాత్మక ప్రదర్శన చేసిన పారా అథ్లెట్లు మంగళవారం స్వదేశానికి చేరుకున్నారు.

పారా యోధులకు దేశరాజధాని ఢిల్లీలో ఘనస్వాగతం దక్కింది. ఇందిరా గాంధీ విమానాశ్రయం వద్ద వేచి ఉన్న వందల మంది అభిమానులు.. ఎయిర్ పోర్ట్ నుంచి పారా అథ్లెట్లు బయటికి రాగానే వారికి ‘జై భారత్’ అంటూ నినాదాలు చేశారు. అథ్లెట్ల కుటుంబ సభ్యులు, బంధువులు, అధికారులు పెద్ద సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకుని స్వాగతం పలికారు. పతకాలు గెలిచిన పారా అథ్లెట్లను క్రీడల మంత్రి మన్సుక్‌ మాండవీయ సన్మానించారు. ఈ సందర్భంగా పతకాలు గెలిచిన భారత క్రీడాకారులకు ఆయన నజరానాలు ప్రకటించారు.

Also Read: iPhone Prices Drop: భారీగా తగ్గిన ‘ఐఫోన్‌’ ధరలు.. లేటెస్ట్‌ రేట్స్ ఇవే!

పారిస్ పారాలింపిక్స్‌ 2024లో స్వర్ణం గెలిచిన క్రీడాకారులకు కేంద్ర ప్రభుత్వం తరఫున రూ.75 లక్షలు ఇస్తున్నట్లు క్రీడల మంత్రి మన్సుక్‌ మాండవీయ ప్రకటించారు. రజతం గెలిచిన అథ్లెట్లకు రూ.50 లక్షలు, కాంస్య పతక విజేతలకు రూ.30 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 2028 లాస్‌ ఏంజెలెస్‌ పారాలింపిక్స్‌లో భారత్‌ మరిన్ని ఎక్కువ పతకాలు సాధించేలా ప్రోత్సాహాన్ని అందిస్తామని మన్సుక్‌ చెప్పారు.

Show comments