ప్రేమ వ్యవహారాలు జీవితాలను నాశనం చేస్తున్నాయి. సమాజంలో తమ పరువుపోతుందని కొందరు తల్లిదండ్రులు హత్యలకు పాల్పడుతున్నారు. గుజరాత్‌లోని బనాస్‌కాంఠా జిల్లాలో పరువుహత్య కలకలం రేపింది. ఓ యువతిని నీట్ కోచింగ్ కోసం పంపిస్తే.. అక్కడ పెళ్లైన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఆ తర్వాత అతడితో సహజీవనం చేసింది. ఈ విషయం తెలిసిన ఆ యువతి తల్లిదండ్రులు నచ్చజెప్పారు. ఆ యువకుడిని మర్చిపోవాలని వార్నింగ్ ఇచ్చారు. అయినా వినకపోవడంతో విసిగిపోయిన పేరెంట్స్ గొంతునులిపి చంపేశారు.
పరువుహత్యకు గురైనట్లుగా భావిస్తున్న చంద్రిక (18) నీట్ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. నీట్ కోచింగ్ కోసం పాలన్‌పుర్ హాస్టల్ లో ఉన్న సమయంలో వివాహితుడైన హరేశ్ చౌధరితో సహజీవనం చేసింది. చంద్రిక ఇంట్లో విషయం తెలియడంతో జాగ్రత్త పడ్డారు. చంద్రికకు పెళ్లి చేయాలని భావించారు. కొన్ని రోజులుగా ఇంటికే పరిమితం చేశారు. ఈ క్రమంలో హరేశ్ ఆమె ఆచూకీ కోసం గుజరాత్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషను దాఖలు చేశాడు.
Also Read:Andhra Pradesh Heavy Rains: ఏపీలో భారీ వర్షాలు.. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే..!
ఈ పిటిషను జూన్ 27న విచారణకు రానున్న సమయంలో 24వ తేదీ రాత్రి చంద్రిక మృతిచెందింది. పోలీసులకు సమాచారం అందడంతో ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. ఈ యువతిని ఆమె తండ్రి, ఇద్దరు బాబాయిలు హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నట్లు ఏఎస్పీ సుమన్ నాలా తెలిపారు. ఆమెకు పాలలో నిద్రమాత్రలు కలిపి ఇచ్చారు. నిద్రపోయాక గొంతు నులిమి చంపారని ఏఎస్పీ వివరించారు. హరేశ్ ఫిర్యాదుతో కేసు నమోదుచేసి నిందితులు ఇద్దరిని అరెస్టు చేశామని తెలిపారు.
