మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మరోసారి నిరూపితమయ్యాయి. గుంట భూమి కోసం కన్న కొడుకుని పొట్టనబెట్టుకున్నారు ఓ తల్లిదండ్రులు. రక్తం పంచినోళ్లే రక్తపాతం సృష్టించారు. మానవ సంబంధాలను మంటగలిపేశారు. అతని స్వంత తల్లిదండ్రులు, తోబుట్టువులే కర్రలతో కొట్టి హత్య చేశారు. ఈ హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బందాలో చోటుచేసుకుంది. మృతుడు తన పూర్వీకుల ఆస్తిలో నిర్మాణ పనులు చేస్తుండగా, అతని తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి అక్కడికి చేరుకున్నారని సమాచారం. వారు నిర్మాణానికి అభ్యంతరం చెప్పినప్పుడు, వాగ్వాదం జరిగింది. మాటామాటా పెరిగి చివరికి వారు అతనిపై కర్రలతో దాడి చేశారు. మృతుడి భార్య తొమ్మిది నెలల గర్భవతి. గుంట భూమి కోసం తన భర్తను చంపారని ఆమె ఆరోపిస్తోంది.
Also Read:Bengaluru: “సొంత దేశంలో రక్షణ లేదు”.. కన్నడలో తిడుతూ ఈశాన్య మహిళకు వేధింపులు..
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన బాబేరు కొత్వాలి ప్రాంతంలో జరిగింది. గౌరీ ఖాన్పూర్ నివాసి అయిన 24 ఏళ్ల రామ్ఖేలావన్ తన పూర్వీకుల ఆస్తిలో నిర్మాణ పనులు చేస్తుండగా, అతని తమ్ముడు అభ్యంతరం వ్యక్తం చేశాడు, భూ పంపకాలపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అతని తల్లి, తండ్రి, సోదరి సంఘటన స్థలానికి వచ్చారు. ఈ క్రమంలోనే వివాదం పెరిగి రామ్ఖేలావన్ పై దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడి చనిపోయాడు. మృతుడి భార్య నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.
