Bengaluru: బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉగ్రవాది, సీరియల్ కిల్లర్‌లకు వీఐపీ సౌకర్యాలు కల్పించారు! జైలు లోపల ఉన్న అపఖ్యాతి పాలైన ఖైదీలు మొబైల్ ఫోన్లు ఉపయోగిస్తూ, టెలివిజన్ చూస్తున్నట్లు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలు సామాన్య జనాల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి. వీటిపై స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు.
వైరల్ వీడియోలో ఐసిస్ రిక్రూటర్ జుహాద్ హమీద్ షకీల్ మన్నా, సీరియల్ రేపిస్ట్, హంతకుడు ఉమేష్ రెడ్డి ఉన్నారు. వీడియోలో ఉమేష్ రెడ్డి తన సెల్‌లో హాయిగా వీడియోలు చూస్తున్నట్లు, షకీల్ మన్నా మొబైల్ ఫోన్‌లో మాట్లాడుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. జైలులో ఉన్నప్పుడు సైతం ఉగ్రవాది మన్నా తన సహచరులతో సంప్రదింపులు జరిపాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వీడియోలు ఎప్పుడు రికార్డు చేశారో తెలియడం లేదు. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో జైల్లో భద్రతా లోపంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో నిజమైందా..? లేదా ఫేక్ వీడియోనా? తెలుసుకునేందుకు ఉన్నతాధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఓ అధికారి జాతీయ మీడియా సంస్థ పీటీఐకి వెల్లడించారు.
READ MORE: Movie PressMeet : టంగ్ స్లిప్ అవుతున్న జర్నలిస్టులు.. ప్రెస్ మీట్ లో హీరోయిన్ కు చేదు అనుభవం
పరప్పన అగ్రహార జైలులో భద్రతపై ప్రశ్నలు తలెత్తడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది అక్టోబర్‌లో గుంబాచి సేన అనే నేరస్థుడు జైలు లోపల తన పుట్టినరోజు జరుపుకుంటున్నట్లు వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో అతడు ఆపిల్ దండ ధరించి కేక్ కట్ చేస్తూ కనిపించాడు. చుట్టూ ఉన్న ఇతర ఖైదీలు సంబరాలు చేసుకుంటున్నట్లు కనిపించింది. గతేడాది సైతం ఇదే జైలు నుంచి మరొక వివాదాస్పద ఫోటో వెలువడింది. రేణుకస్వామి హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న కన్నడ నటుడు దర్శన్ తూగుదీప “VIP ట్రీట్మెంట్” పొందుతున్నట్లు కనిపించింది. ఆ ఫోటోలో అతను కుర్చీపై కూర్చుని, సిగరెట్, కాఫీ మగ్ పట్టుకుని, ఇతర ఖైదీలతో మాట్లాడుతున్నట్లు కనిపించింది.
