NTV Telugu Site icon

Haryana: జిమ్ ట్రైనర్‌తో ఎఫైర్.. ప్లాన్ బీతో భర్తను ఎలా మాయం చేసిందంటే..!

Murder

Murder

భార్య ఆరోగ్యం గురించి ఆలోచించడమే అతడు చేసిన తప్పు. అర్థాంగి ఆరోగ్యంగా ఉండాలని.. జిమ్‌కు తీసుకెళ్తాడు. కానీ అదే అతని కొంపముంచింది. భర్తను సైడ్ చేసి జిమ్ ట్రైనర్‌తో స్నేహం మొదలుపెట్టింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ వ్యవహారం మొత్తానికి భర్త కంటిలో పడేసరికి నిత్యం ఇంట్లో గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇంకేముంది ప్రియుడితో సుఖానికి అడ్డుగా ఉన్నాడని భర్తను అడ్డుతొలగించుకోవాలని ప్లాన్ వేసింది. కానీ మొదటి ప్లాన్-ఏ సక్సెస్ కాలేదు. ఇంకేముంది ప్లాన్ బీ అమలు చేసింది. ఈసారి మాత్రం సక్సెస్ అయింది. కానీ పాపం పండి మూడేళ్ల తర్వాత ప్రియుడితో జల్సా చేస్తుండగా అడ్డంగా బుక్కై కటకటాల పాలైంది. అసలేం జరిగింది.. భర్తను ఎలా చంపింది. క్రైమ్ సినిమాను తలపిస్తున్న ఈ స్టోరీ తెలియాలంటే.. ఈ వార్త చదవండి.

హర్యానాలోని పానిపట్‌కు చెందిన వ్యాపారవేత్త వినోద్ భరారా, నిధి భరారా భార్యాభర్తలు. ఇద్దరు అన్యోన్యంగా సంసారం సాగిస్తున్నారు. అయితే నిధి.. జిమ్ కెళ్లడం ప్రారంభించింది. అంతటితో ఆగకుండా జిమ్ ట్రైనర్‌ సుమిత్‌తో ఎఫైర్ పెట్టుకుంది. అతడితో వివాహేతర సంబంధాన్ని సాగిస్తోంది. ఇది కాస్త భర్త కంటిలో పడేసరికి దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో వినోద్.. సుమిత్‌ను హెచ్చరించాడు. ఇక ప్రేమికులిద్దరూ పగ పెంచుకుని.. వినోద్ పీడ వదిలించుకోవాలని ప్లాన్ వేశారు. ఇందుకోసం ప్లాన్-Aను అమలు చేశారు. సుమిత్‌కు తెలిసిన పంజాబ్‌కు చెందిన ట్రక్కు డ్రైవర్ దేవ్ సునర్‌తో రూ.10 లక్షల మర్డర్ ఒప్పందాన్ని చేసుకున్నారు. అంతే జనవరి 5, 2021న వినోద్ కారును ట్రక్కుతో ఢీకొట్టాడు. బాధితుడికి తీవ్రగాయాలయ్యాయి. అనంతరం ఈ కేసు నడుస్తుండగా.. డిసెంబర్ 15, 2021న వినోద్ ఇంటి దగ్గరే దేవ్ సునర్ తుపాకీతో కాల్చి చంపుతాడు. అక్కడికక్కడే వినోద్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే యాక్సిడెంట్ కేసులో సెటిల్‌మెంట్ చేసుకునేందుకు వెళ్తే.. ఒప్పుకోనందుకు కాల్చి చంపినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇలా ఈ కేసు నడుస్తోంది. అయితే ఇంతలో ఓ పోలీస్ అధికారికి వచ్చిన వాట్సప్ సందేశం.. పోలీసులను తీవ్రంగా కదిలింపజేసింది.

వినోద్ సోదరుడు ప్రమోద్ ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. అతడు జిల్లా పోలీసు చీఫ్, ఐపీఎస్ అధికారి అజిత్ సింగ్ షెకావత్‌కు వాట్సాప్ సందేశం పంపించాడు. మర్డర్ కేసును మరోసారి పరిశీలించాల్సిందిగా పోలీసు అధికారిని అభ్యర్థించాడు. వినోద్‌కు అత్యంత సన్నిహితులు ఎవరో చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేశాడు. అంతే సదరు అధికారి ఫైళ్లను నిశితంగా పరిశీలించగా.. ఎక్కడో ఏదో తేడా కొడుతున్నట్లుగా భావించారు. ఇక అప్పటి నుంచి నిధిపై పోలీసులు నిఘా పెట్టారు. ఆమె జిమ్ ట్రైనర్ సుమిత్‌తో సన్నిహితంగా ఉండడాన్ని గమనించారు. ఇక సుమిత్.. ట్రక్కు డ్రైవర్ దేవ్ సునర్‌తో కలిసి తిరుగుతున్నట్లు గమనించారు. దీంతో వీళ్లను అదుపులోకి తీసుకుని విచారించగా.. బండారం బయటపడింది. వినోద్‌ను భార్య నిధి, ప్రేమికుడు సుమిత్ చంపినట్లుగా నేరాన్ని అంగీకరించారు. దీంతో నిందితుల్ని పోలీసులు కటకటాల వెనక్కి పంపించారు.

ఇదిలా ఉంటే నిధి తన పిల్లల్ని.. విదేశాల్లో ఉన్న తన మామ దగ్గరకు పంపేసి.. ప్రియుడితో ఎంజాయ్ చేస్తోంది. జల్సా కోసం బయటకు వెళ్లినప్పుడు నిందితుల ఇద్దర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ఖర్చుల కోసం భర్త పేరు మీద ఉన్న బీమా డబ్బు విత్‌డ్రా చేసుకుని వాడుకుంది. హంతకుడికి రూ.10లక్షలు కూడా ఈ డబ్బులే ఇచ్చింది. మొత్తానికి మూడేళ్ల తర్వాత పాపం పండి జైలు పాలైంది.