Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!

Pandu Mirapakaya Pachadi

Pandu Mirapakaya Pachadi

Pandu Mirapakaya Pachadi: ఎన్నో రకాల పచ్చళ్లలో పండు మిరపకాయ పచ్చడి రుచి ప్రత్యేకంగా ఉంటుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి, ఈ పచ్చడి వేసుకుని తింటే ఆ రుచి మరచిపోలేరు. ముఖ్యంగా సరైన కొలతలతో, తడి లేకుండా తయారు చేస్తే ఈ పచ్చడి సంవత్సరం పాటు తాజాగా నిల్వ ఉంటుంది. మరి పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

* పండు మిరపకాయలు – ½ కేజీ
* చింతపండు (గింజలు, పీచు లేనిది) – 125 గ్రాములు
* ఉప్పు – 125 గ్రాములు
* పసుపు – 1 టీస్పూన్
* వెల్లుల్లి రెబ్బలు – ¼ కప్పు
* నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె – 150 మి.లీ.
* మెంతుల పొడి – 1 టీస్పూన్
* ఆవాల పొడి – 1 టీస్పూన్

తాలింపు కోసం:

* వెల్లుల్లి రెబ్బలు – 10
* ఎండుమిర్చి – 5
* ఆవాలు – 2 టీస్పూన్లు
* జీలకర్ర – 2 టీస్పూన్లు
* కరివేపాకు – తగినంత
* ఇంగువ – ¼ టీస్పూన్

తయారీ విధానం:

ముందుగా పండు మిరపకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. ఒక్క చుక్క నీరు కూడా లేకుండా చూసుకోవాలి. తర్వాత వాటి తొడిమలు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో చింతపండు, ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో మిరపకాయ ముక్కలు వేసి పూర్తిగా మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్ చేయాలి. తరువాత పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి ఒకసారి మాత్రమే పల్స్ చేయాలి. వెల్లుల్లి పూర్తిగా మెత్తగా కాకుండా ఉండేలా చూసుకోవాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రమైన గాజు జాడీలో వేసి మూతపెట్టి 24 గంటల పాటు ఊరనివ్వాలి. ఇలా ఉంచడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుంది.

మరుసటి రోజు పాన్‌లో నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె వేడి చేసి.. వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు చేయాలి. ఆ తర్వాత ఊరబెట్టిన పచ్చడిని వేసి సిమ్ మంటపై సుమారు ఐదు నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. చివరగా మెంతుల పొడి, ఆవాల పొడి వేసి బాగా కలిపి నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత జాడీలో నిల్వ చేసుకోవాలి.

పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే..

పచ్చడి తయారీలో ఉపయోగించే గిన్నెలు, మిక్సీ జార్, చెంచాలు, జాడీ పూర్తిగా పొడిగా ఉండాలి. ½ కేజీ మిరపకాయలకు 125 గ్రాముల చింతపండు, 125 గ్రాముల ఉప్పు సరైన కొలత ఉండేలా చూసుకోండి. నిల్వ పచ్చళ్లకు నువ్వుల నూనె లేదా వేరుశనగ నూనె మాత్రమే ఉపయోగిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ముఖ్యంగా పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాజు జాడీలో నిల్వ చేయాలి. ఇలా చేస్తే సంవత్సరం పాటు రంగు, రుచి మారకుండా ఉంటుంది.