Pakistan Captain: లాస్ట్ ఓవర్ వరకు గెలుపు మాదే అనుకున్నాం.. ఏం జరిగిందో అర్థం కాలేదు.. విజయం చేజారింది..

Captain

Captain

అండర్-19 ఆసియా కప్ 2026 ఫైనల్‌లో భారత్ చేతిలో ఒక వికెట్ తేడాతో ఓటమి పాలైన అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ ఫర్హాన్ యూసఫ్ మ్యాచ్ ఫలితంపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన తమ జట్టు బోర్డుపై మంచి స్కోరే ఉంచిందని, అయితే భారత జట్టు అద్భుతమైన క్రికెట్ ఆడి విజయాన్ని అందుకుందని అతడు ప్రశంసించాడు. తాము నిర్దేశించిన 337 పరుగుల లక్ష్యం గెలవడానికి సరిపోయే స్కోరేనని భావించామని.. లాస్ట్ ఓవర్ వరకు విజయం మాదే అనుకున్నాం.. కానీ భారత బ్యాటర్ల అసాధారణ పోరాటం ముందు అది సరిపోలేదని కెప్టెన్ అంగీకరించాడు.

మ్యాచ్‌లో ఎక్కడ పొరపాటు జరిగిందన్న ప్రశ్నకు ఫర్హాన్ యూసఫ్ బదులిస్తూ, జట్టులోని కుర్రాళ్లందరూ తమ వంతు ప్రయత్నం బాగానే చేశారని, కానీ దురదృష్టవశాత్తూ బౌలింగ్‌లో సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయలేకపోయామని తెలిపాడు. బౌలింగ్‌లో దారి తప్పడమే తమ ఓటమికి ప్రధాన కారణమని అతడు స్పష్టం చేశాడు. కీలక సమయాల్లో బౌలర్లు పట్టు కోల్పోవడంతో భారత్ మ్యాచ్‌ను లాగేసుకుందని అభిప్రాయపడ్డాడు.

స్లో ఓవర్-రేట్ సమస్యపై స్పందిస్తూ, తాము ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగామని, సహజంగానే ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారని వివరించాడు. అలాగే మ్యాచ్ చివరి దశలో పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలు రచించడం, ఫీల్డింగ్ మార్పులు చేయడం వల్ల సమయం మరింత ఆలస్యమైందని, అందుకే ఓవర్-రేట్ విషయంలో వెనుకబడిపోయామని తెలిపాడు. చివరగా పాకిస్థాన్ అభిమానులకు సందేశమిస్తూ, టోర్నీ ఆసాంతం తమకు అండగా నిలిచి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశాడు. భవిష్యత్తులోనూ పాకిస్థాన్ జట్టుకు ఇలాగే మద్దతు కొనసాగించాలని అభిమానులను కోరాడు.