Site icon NTV Telugu

Pahalgam Terror Attack : పహల్గాం దాడి వెనక పాక్ కేంద్రంగా నడిచే ఉగ్రవాద సంస్థ..

Pahalgam

Pahalgam

Pahalgam Terror Attack : జమ్మూ కశ్మీర్ లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాం సమీపంలో ఉండే బైసరన్‌ లోయలో పర్యటిస్తున్న పర్యాటకులపై టెర్రరిస్టులు అత్యంత ఘాతుకానికి ఒడిగట్టారు. టూరిస్టులను దగ్గరి నుంచి కాల్చి చంపి పైశాచిక ఆనందం పొందారు. ఇప్పటి వరకు ఈ దాడిలో 28 మంది చనిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. దేశ వ్యాప్తంగా ఈ దాడిపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలిపెట్టొద్దు అంటూ డిమాండ్లు వస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న ‘లష్కరే తయ్యిబా’ అనుబంధ సంస్థ ‘ద రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’ ఈ ఉగ్రదాడికి పాల్పడింది తామే అని ప్రకటించుకుంది. అందమైన పచ్చని లోయలో పర్యటిస్తున్న వారిపై టెర్రరిస్టులు సైనికుల డ్రెస్సుల్లో వచ్చి దాడికి పాల్పడ్డారు.
Read Also: Donald Trump : భారత్ కు అండగా ఉంటాం.. ఉగ్రదాడిపై ట్రంప్

దాడి అనంతరం సమీపంలోని అడవుల్లోకి పారిపోయారు. కాల్పుల సౌండ్ విన్న సైనికులు వెంటనే దాడి జరిగిన ప్రదేశానికి వచ్చారు. కానీ అప్పటికే జరగాల్సింది అంతా జరిగిపోయింది. భద్రతా సిబ్బంది టెర్రరిస్టుల కోసం గాలిస్తున్నారు. చనిపోయిన వారిలో హైదరాబాద్ కు చెందిన నిఘా విభాగం అధికారి మనీష్ రంజన్ తో పాటు కర్ణాటకకు చెందిన ఓ వ్యాపారి కూడా ఉన్నారు. ఇప్పటి వరకు 28 మంది చనిపోయారు. ఈ దాడిని ఇప్పటికే ప్రపంచ అధినేతలు ఖండిస్తున్నారు. భారత్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇదే అతిపెద్ద ఉగ్ర దాడిగా అధికారులు చెబుతున్నారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున సాయుధ బలగాలు రంగంలోకి దిగాయి. పహల్గాం మొత్తం రెడ్ అలెర్ట్ ప్రకటించారు.

Exit mobile version