NTV Telugu Site icon

Pakistan: దేశ ప్రథమ మహిళగా అధ్యక్షుడి కుమార్తె..! కారణమిదే!

First Lady

First Lady

పాకిస్థాన్‌ కొత్త ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ ప్రథమ మహిళగా కొత్త అధ్యక్షుడు జర్దారీ కుమార్తెను అధికారికంగా గుర్తించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇటీవలే పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ) ఛైర్మన్‌ ఆసిఫ్‌ అలీ జర్దారీ రెండోసారి దేశాధినేత పగ్గాలు చేపట్టారు. 14వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. ఈ క్రమంలోనే దేశ ప్రథమ మహిళగా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పాక్‌ మీడియాలో కథనాలు ప్రచారం అవుతున్నాయి.

వాస్తవానికి దేశాధ్యక్షుడి సతీమణికి మాత్రమే ప్రథమ మహిళ హోదా ఉంటుంది. కానీ జర్దారీ సతీమణి, మాజీ ప్రధాని బెనజీర్‌ భుట్టో 2007లో హత్యకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన మరో వివాహం చేసుకోలేదు. 2008-13 మధ్య తొలిసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సయమంలో ప్రథమ మహిళ హోదాను ఖాళీగా ఉంచారు. కానీ ఈసారి మాత్రం ఆ హోదాలో చిన్న కుమార్తె ఆసిఫాకు ఇవ్వాలని జర్దారీ నిర్ణయించినట్లు సదరు కథనాలు చెప్పుకొచ్చాయి.

ఈ విషయంపై అధ్యక్షుడి పెద్ద కుమార్తె భక్తావర్‌ భుట్టో సోషల్ మీడియాలో పోస్టు చేసిన ట్వీట్ బలం చేకూరుస్తున్నాయి. కోర్టు విచారణలు, న్యాయపోరాటం దగ్గర నుంచి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసే వరకు జర్దారీకి అన్ని వేళలా మా పాక్‌ ప్రథమ మహిళ ఆసిఫా వెన్నంటే నిలిచిందని ఆమె పోస్ట్‌ చేశారు. దీంతో పాక్‌ ప్రథమ మహిళగా ఆసిఫా భుట్టో ప్రకటన ఖాయమనే తెలుస్తోంది.

ఇదిలా ఉంటే 2020లో ఆసిఫా తొలిసారిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి పీపీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. జర్దారీ ప్రమాణస్వీకార కార్యక్రమానికీ కూడా ఆమె హాజరయ్యారు.

ఈ సంస్కృతి ఆయా దేశాల్లో కొనసాగుతోంది. అధ్యక్షుడి జీవిత భాగస్వామి చనిపోతే.. ఆ స్థానంలో కుమార్తెలు, సోదరీమణులు, లేదా మేనకోడళ్లను పెట్టుకునే విధానం కొన్ని దేశాల్లో అమల్లో ఉంది. అమెరికాలో ఈ పద్ధతి ఎప్పుట్నుంచో కొనసాగుతోంది. ఇప్పుడు తాజాగా పాక్ అధ్యక్షుడు జర్దారీ ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.