ప్రస్తుతం కాంగ్రెస్ నేతలు వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారసత్వ పన్ను, భారతీయులపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శామ్ పిట్రోడా తర్వాత ఇప్పుడు మరో కాంగ్రెస్ నేత ప్రకటన వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌పై ఆ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం పాకిస్థాన్‌ను గౌరవించాలి, వారి వద్ద అణుబాంబులు ఉన్నాయి.’ అని వ్యాఖ్యానించారు. మనం వారిని గౌరవించకపోతే భారత్‌పై అణుదాడి చేయొచ్చన్నారు. ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ… పాకిస్థాన్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయన్న విషయాన్ని భారత్ మర్చిపోకూడదన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి చర్చ చాలా ముఖ్యమన్నారు. భారత్ దురహంకారంతో చిన్నచూపు చూస్తుందని పాకిస్థాన్ భావిస్తే… పాకిస్థాన్‌లోని ఏ పిచ్చివాడైనా భారత్ పై బాంబులతో దాడి చేసే అవకాశం ఉందంటూ.. వ్యాఖ్యానించారు. అయితే ఈ బాంబును లాహోర్‌లో వేయాలని కొందరు పిచ్చివాళ్ళు నిర్ణయించుకుంటే ఎలా ఉంటుంది. ఈ రేడియేషన్ అమృత్ సర్ చేరుకోవడానికి ఎనిమిది సెకన్లు కూడా పట్టదన్నారు. మనం వారిని గౌరవిస్తే వారు ప్రశాంతంగా ఉంటారు.. చిన్న చూపు చూస్తే పిచ్చి పనులు చేయొచ్చు అన్నారు.
READ MORE: Madhyapradesh : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బయటపడ్డ నోట్ల కట్టలు.. రంగంలోకి ఐటీ శాఖ
పాకిస్థాన్ కూడా సార్వభౌమ దేశమని, దానికి కూడా గౌరవం ఉంటుందన్నారు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. భారత్, పాక్ మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు తాము చాలా కష్టపడ్డామని అయ్యర్ అన్నారు. అయితే గత పదేళ్లుగా చర్చలన్నీ ఆగిపోయాయని తెలిపారు. పాకిస్థాన్‌తో యుద్ధభయంతో రాజీవ్ గాంధీ శాంతికి మార్గాన్ని కనుగొన్నారన్నారు. కానీ నేటి కాలంలో, పాకిస్థాన్‌తో శాంతి అవకాశాలు ఉన్నా.. మోడీ యుద్ధానికి మార్గాన్ని కనుగొంటున్నారన్నారు. కాగా.. గతంలో ఓవర్సీస్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి సమర్థించారు. ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లుగా ఉంటారం’టూ కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను మరిచిపోకముందే.. రంజన్ చౌదరి ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. దేశంలో నీగ్రోలు ఉన్నారంటూ ఆయన పేర్కొన్నారు.