Site icon NTV Telugu

Pakistan: ఎన్నికల రిగ్గింగ్‌ ఎఫెక్ట్.. ఓ అధికారి రాజీనామా

Pak Ele

Pak Ele

పాకిస్థాన్‌ సార్వత్రిక ఎన్నికల (Pakistan Election) ఫలితాల సందర్భంగా జరిగిన అక్రమాలు తాజాగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఫలితాలు సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్-నవాజ్ షరీఫ్ పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నాయి. రిగ్గింగ్ జరుగుతుందంటూ ఆరోపించుకున్నాయి.

తాజాగా ఓ ఎన్నికల అధికారి రిగ్గింగ్‌పై నిజాన్ని ఒప్పుకుని పదవికి రాజీనామా చేశాడు. ఇటీవల జరిగిన పాకిస్థాన్‌(Pakistan) ఎన్నికల్లో రిగ్గింగ్(Poll Rigging) జరిగిందని పోలింగ్‌ ఆఫీసర్ ఒకరు ఒప్పుకున్నారు. ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘం ప్రధాన అధికారి, చీఫ్ జస్టిస్ పాత్ర కూడా ఉందని ఆరోపించారు. అలాగే ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ అతను రాజీనామా సమర్పించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది.

ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ (PTI) దేశవ్యాప్త నిరసనలు ప్రారంభించింది.

రావల్పిండి మాజీ ఎన్నికల కమిషనర్‌ లియాఖత్‌ అలీ మీడియాతో మాట్లాడుతూ నేరాన్ని అంగీకరించారు. ‘ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులను గెలిచేలా చేశారు. ఈ అవకతవకలకు నేను కూడా బాధ్యత తీసుకుంటున్నాను. ఇందులో ప్రధాన న్యాయమూర్తి, ఎన్నికల సంఘం ప్రధాన అధికారుల ప్రమేయం ఉంది. దేశానికి వెన్నుపోటు పొడిచాను. అది నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. మేం చేసిన అన్యాయానికి మాకు శిక్ష పడాలి. ఆత్మహత్య చేసుకునేంతగా నాపై ఒత్తిడి వచ్చింది. చివరకు ఈ విషయాలన్నీ ప్రజల ముందు ఉంచాలనుకున్నాను. ఈ నాయకుల కోసం ఎలాంటి తప్పులు చేయొద్దని అధికారులను అభ్యర్థిస్తున్నాను’ అంటూ తన పదవికి రాజీనామా చేశారు.

అయితే ఈ ఆరోపణలను పాక్ ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. కాగా.. పోలింగ్‌ అనంతరం సుదీర్ఘంగా సాగిన ఓట్ల లెక్కింపు పలు సందేహాలను రేకెత్తించింది. ఈ క్రమంలోనే లియాఖత్ ఆరోపణలు వచ్చాయని తెలిపింది.

ఇదిలాఉంటే ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు అనువైన వాతావరణం లేకపోవడంతో పార్లమెంటులో ప్రతిపక్ష స్థానంలో కూర్చోవాలని పీటీఐ(PTI) నిర్ణయించింది. పాక్‌ జాతీయ అసెంబ్లీలోని 265 స్థానాలకు పీటీఐ మద్దతు ఇచ్చిన స్వతంత్ర అభ్యర్థులు 92 సీట్లు గెల్చుకున్నారు. కానీ పీఎంఎల్‌-ఎన్‌, పీపీపీ కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చాయి.

Exit mobile version