పాకిస్తాన్ పెషావర్‌లోని ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగింది. మసీదులో మధ్యాహ్నం నమాజ్ సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో అంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. కాగా ఇది ఆత్మాహుతి దాడి అని అధికారులు స్పష్టం చేశారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి నమాజ్ చేస్తున్న ముందు వరుసలో కూర్చుని ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిపారు. ఈ పేలుడు కారణంగా 28 మంది వరకు మరణించగా..150 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. దీంతో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పాక్ అధికారులు పేర్కొన్నారు. పూర్తి స్థాయి విచారణ జరిపిస్తామని వెల్లడించారు.
ఈ బాంబు దాడికి బాధ్యత వహిస్తూ ఏ ఉగ్రవాద సంస్థ ఇప్పటి వరకు ప్రకటన చేయలేదు. సుమారు 150 మంది ప్రజలు మసీదులో ప్రార్థనలు చేస్తుండగా.. పేలుడు పదార్థాలతో వచ్చి ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని అక్కడి స్థానిక పోలీస్ అధికారి జాఫర్ ఖాన్ వెల్లడించినట్టు న్యూస్ ఏజెన్సీ ఏపీ రిపోర్ట్ వెల్లడించింది. ఈ బాంబు పేలుడుతో పెషావర్‌లోని ఆ మసీదు చాలా భాగం కూలిపోయిందని, శిథిలాల కింద ఉన్న వారిని బయటికి తీసేందుకు సహాయక చర్యలు చేపడుతున్నట్టు అక్కడి పోలీసులు తెలిపారు.
