NTV Telugu Site icon

Babar Azam: బాబర్‌ను తప్పించలేదు.. రెస్ట్ ఇచ్చాం: అజార్

Babar Azam Test

Babar Azam Test

ముల్తాన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్‌ తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్‌ అజామ్‌ 30, 5 పరుగులే చేశాడు. పేలవ ఫామ్ కారణంగా ఇంగ్లండ్‌తో మిగతా రెండు టెస్టుల కోసం ప్రకటించిన పాకిస్థాన్‌ జట్టులో బాబర్‌కు చోటు దక్కలేదు. బాబర్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)పై విమర్శలు వస్తున్నాయి. వీటిపై పాక్‌ అసిస్టెంట్ కోచ్ అజార్ మహముద్‌ స్పందించాడు. బాబర్‌ను జట్టు నుంచి తప్పించలేదని, భవిష్యత్‌ సిరీస్‌ల నేపథ్యంలో విశ్రాంతి ఇచ్చామని తెలిపాడు.

అజార్ మహముద్‌ మాట్లాడుతూ… ‘బాబర్ అజామ్‌ మా నంబర్‌ వన్‌ ప్లేయర్. ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. టెక్నిక్, సామర్థ్య పరంగా అతడు నాణ్యమైన ఆటగాడు. పాకిస్తాన్ వచ్చే రోజ్జుల్లో చాలా సిరీస్‌లు ఆడాల్సి ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకునే బాబర్‌కు విశ్రాంతిని ఇచ్చాం. రెస్ట్ ఇవ్వడానికి ఇది ఉత్తమమైన సమయమని సెలక్షన్ కమిటీ భావించింది. త్వరలో ఆస్ట్రేలియా టూర్‌ ఉంది. ఆ తర్వాత జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాలి. అవి మాకు ముఖ్యమైన సిరీస్‌లు’ అని చెప్పాడు.

Also Read: Team India: ఒక్కరోజే 400 పరుగులు చేయగల టీమ్ కావాలి: గంభీర్

‘బాబర్‌ అజామ్‌ను మేం తప్పించలేదు. విశ్రాంతిని ఇచ్చాం. గత కొన్ని నెలలుగా జరుగుతున్న పరిణామాలను టీమ్ మేనేజ్‌మెంట్ అర్థం చేసుకుంటోంది. బాబర్‌ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడు కానీ.. అతనికి విశ్రాంతి ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంది’ అని అజార్ మహముద్‌ పేర్కొన్నాడు. పాకిస్థాన్‌, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్టు అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాధించి సిరీస్ సమం చేయాలని చూస్తోంది. ఇటీవల బంగ్లా చేతిలో పాక్ ఓడిన సంగతి తెలిసిందే.