NTV Telugu Site icon

Kishan Reddy: తెలుగు రాష్ట్రాల నుంచి పలువురికి పద్మ అవార్డులు.. కేంద్రమంత్రి అభినందనలు

Kishan Reddy

Kishan Reddy

తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికీ కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయా రంగాల్లో వారు చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. వైద్యరంగంలో విశిష్ట సేవలకు గానూ భారతదేశపు రెండో అత్యుత్తమ పౌరపురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుకు ఎంపికైన డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వినూత్న పద్ధతులతో వైద్య రంగంలో తనకంటూ ప్రత్యేకత గుర్తింపును సంపాదించుకున్న వారి సేవలకు కేంద్ర ప్రభుత్వం సరైన గుర్తింపుతో గౌరవించిందన్నారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ వైద్య రంగంలో ఓ హబ్ గా గుర్తింపు తీసుకురావడంలో డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి పోషించిన పాత్రకు, గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చేసిన విశేషకృషికి తగిన గుర్తింపు లభించడం హర్షణీయమన్నారు. 2002లో పద్మశ్రీ అవార్డును, 2016లో పద్మభూషణ్ అవార్డును అందుకుని.. ఇప్పుడు పద్మ విభూషణ్ అవార్డుకు ఎంపికవ్వడం పట్ల కిషన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

30 ఏళ్లకు పైగా మాదిగ సమాజానికి గుర్తింపు కోసం అహోరాత్రులు శ్రమించి ఉద్యమం ద్వారా లక్ష్యాన్ని సాధించి సామాజిక సేవల విభాగంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు కిషన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. మందకృష్ణ మాదిగ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే క్రమంలో పోరాట పటిమ, రాజీపడని తత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక సేవలో.. దివ్యాంగులకు సాధికారత కల్పించడంలో.. గుండె జబ్బులున్న చిన్న పిల్లలకు వైద్యం అందించే విషయంలో కీలకంగా వ్యవహరించి, ఎందరో మంది చిన్న పిల్లల ప్రాణాలు కాపాడిన వారిసేవలకు సరైన గుర్తింపు లభించిందన్నారు.

Read Also: Lady Aghori: కరీంనగర్ బైపాస్ రోడ్డులో అఘోరీ హల్‌చల్..

సినీ, రాజకీయ, సామాజిక సేవ రంగాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుని ఎన్టీఆర్ నటవారసత్వాన్ని కొనసాగిస్తున్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ అవార్డుకు ఎంపికైన సందర్భంగా వారికి అభినందనలు తెలియజేశారు. సినీ రంగంలో హీరోగా రాణిస్తూనే.. రాజకీయ రంగంలో ప్రజాసేవ, బసవతారకం ఆసుపత్రి ద్వారా సామాజిక సేవ చేస్తున్న బాలకృష్ణ కృషికి సరైన గుర్తింపు లభించినందుకు కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అవధాన సరస్వతిగా భాషా, సాహితీ, ఆధ్యాత్మిక ప్రవచన రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా వారికి కిషన్ రెడ్డి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

ప్రముఖ ఆర్థికవేత్త, ఆర్థిక విధానాల బోధన, పరిశోధనల రంగంలో ప్రత్యేకతను చాటుకున్న కేఎల్ కృష్ణ పద్మశ్రీ అవార్డుకు ఎంపికవడం పట్ల వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లోని ఎకనమిక్స్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వ్యవసాయం, పారిశ్రామిక రంగాల ప్రగతిని వివరిస్తూ విమర్శనాత్మకంగా వారు రాసిన పుస్తకాలు ఈ రంగంలో పరిశోధనలు చేసే వారికి మార్గదర్శనం చేస్తాయన్నారు. తెలుగు సంప్రదాయ కళ అయిన బుర్రకథకు జీవం పోస్తూ.. ఈ కళను బతికించేందుకు కృషి చేసిన మిర్యాల అప్పారావుకు పద్మశ్రీ (మరణానంతరం) అవార్డును ప్రకటించడం పట్ల కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. విద్యా, సాహితీ రంగంలో చేసిన విశేష కృషికి గానూ 2025 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ అవార్డును విద్యా రంగానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.