Site icon NTV Telugu

Asaduddin Owaisi : మోడీపై విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఒవైసీ.. “వక్ఫ్ బిల్లు విషం లాంటిదే”

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ చేస్తున్న చర్యలను తీవ్రంగా విమర్శించారు. సభలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఒవైసీ మాట్లాడుతూ, “అందరూ మీ ఫోన్‌లలో లైట్లు ఆన్ చేయండి. మీరు వెలిగించినది ఫోన్ లైట్ కాదు… బీజేపీ నాయకుల మెదళ్లలో వెలిగించిన తెలివి,” అన్నారు. ప్రధాని మోడీ గత 11 ఏళ్లుగా మజీదులను ధ్వంసం చేయాలని చూస్తున్నారని, ముస్లింల ఇళ్లను కూల్చుతున్నారని ఆయన ఆరోపించారు.

వక్ఫ్ బిల్లును విమర్శిస్తూ, “మోడీ వక్ఫ్ బిల్లు వల్ల ముస్లింలకు మేలు జరుగుతుందని చెబుతున్నాడు. ఇది నిజం కాదు. ఇది బట్టతలకు జుట్టు వచ్చే మందు అని చెప్పినట్టే. మోడీ రాస్తున్నది మందు కాదు… విషం,” అంటూ ఎద్దేవా చేశారు. ఓల్డ్ సిటీలో ఓ వ్యక్తి బట్టతలకు మందు పెట్టిస్తే జుట్టు వస్తుందని చెప్పడంతో జనాలు నమ్మి క్యూ కట్టారని ఉదాహరణగా చెప్పిన ఆయన, మోడీ మాటలు కూడా అలాంటివేనని వ్యాఖ్యానించారు.

వక్ఫ్ బిల్లును తిప్పిపంపే వరకూ పోరాటం ఆగదని స్పష్టం చేసిన ఒవైసీ, పార్లమెంట్ సెషన్‌లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెడతానన్నారు. ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు దేశవ్యాప్తంగా శాంతియుత ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. “ఈ దేశం అందరిదీ, ఎవరి అబ్బ జాగీరు కాదు. మోడీ అంబేద్కర్ కాలి గోటి స్థాయికి కూడా రావడని, బీజేపీ మత విద్వేష రాజకీయాలు చేస్తోందని” మండిపడ్డారు.

బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని ఒవైసీ పేర్కొన్నారు. “మత ఘర్షణలు వస్తాయని భయపెట్టినా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మేము రాజ్యాంగాన్ని నమ్ముతాం. మోడీ నాటకాలకు మేము భయపడం,” అన్నారు. ఇప్పుడు దేశంలో ముస్లింల హక్కుల కోసం, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం శాంతియుతంగా, చట్టబద్ధంగా పోరాటం కొనసాగిస్తామని అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.

Bandi Sanjay : కాంగ్రెస్ పార్టీ సూచన మేరకే ఎంఐఎం సభ

Exit mobile version