Site icon NTV Telugu

ISRO: ఇస్రోలో కొత్త జోష్‌.. కొత్త ప్రయోగాలు ఇవే..

Isro Chief Somanath

Isro Chief Somanath

ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) చరిత్ర సృష్టించింది. నరాలు తెగే ఉత్కంఠతో ప్రపంచమొత్తం ఎదురుచూస్తుండగా.. యావత్‌ భారతం ఆకాంక్షలను నెరవేరుస్తూ.. విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై విజయవంతంగా అడుగు మోపింది.. చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోడీ.. ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్‌కి ఫోన్ చేసి అభినందించారు. మొదట ప్రధాని మోడీ.. ఇస్రో శాస్త్రవేత్తలను, జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగించగా.. ఆ తర్వాత ఇస్రో చీఫ్‌ సోమనాథ్ మాట్లాడుతూ.. కీలక ప్రకటనలు చేశారు.. చంద్రయాన్‌ 3 విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంది.. ఇది సులువైన పని కాదు.. దీని వెనుక ఎంతో కష్టపడ్డాం.. ల్యాండర్ స్థితిగతులు పరిశీలించాక రోవర్ ను బయటకు తెస్తాం. దీనికి కొన్ని గంటలు లేదా ఒక రోజు సమయం పట్టవచ్చు అని తెలిపారు.. ఇక, 14 రోజులు చంద్రుడిపై రోవర్ పరిశోధన కొనసాగుతోంది అని వెల్లడించారు.

ఇక, చంద్రయాన్‌ 3 విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్న ఇస్రో చైర్మన్‌ సోమనాథ్.. పనిలోపనిగా కొత్త ప్రయోగాలను కూడా ప్రకటించారు.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోగాలు ఉంటాయన్నారు.. ఆదిత్య ఎల్ 1 సెప్టెంబర్ మొదటి వారంలో ప్రయోగిస్తామన్న ఆయన.. ఆదిత్య.. సూర్యుడి గురించి తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు.. గగన్‌ యాన్‌ అబర్ట్‌ మిషన్‌ కూడా అక్టోబర్‌ మొదటి వారంలోపు చేస్తాం అని ప్రకటించారు.. మరోవైపు.. విజ్ఞాన్‌ రోవర్‌ వచ్చే 24గంటల్లోపు చంద్రుడిపై దిగనుంది. చంద్రయాన్‌-2లో పనిచేసిన అనేక మంది చంద్రయాన్‌-3కి పనిచేశారు. చంద్రయాన్‌-2కి పనిచేసిన వారు గత కొన్నేళ్లుగా సరిగా నిద్రకూడా పోయి ఉండరన్నారు.. ఇస్రో చాలా బలంగా ఉంది అని పేర్కొన్నారు సోమనాథ్‌.

మరోవైపు.. చంద్రయాన్‌ -3 విజయవంతం అయిన తర్వాత జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.. ‘మన కళ్ల ముందు చరిత్ర సృష్టించడం చూస్తే జీవితం ధన్యమవుతుంది. ఈ క్షణాలు మరిచిపోలేనివి. ఈ క్షణాలు అసాధారణమైనవి. ఈ క్షణం అభివృద్ధి చెందిన భారతదేశం యొక్క ధ్వని. నవ భారతం కోసం నినాదాలు చేయాల్సిన తరుణం ఇది. కష్టాల సాగరాన్ని దాటాల్సిన తరుణం ఇది. విజయపథంలో నడవాల్సిన తరుణం ఇది. ఈ క్షణం 140 కోట్ల మంది కలలతో కూడుకున్నది. ఇది భారతదేశంలో కొత్త శక్తి, కొత్త విశ్వాసం, కొత్త చైతన్యం యొక్క క్షణం. మేం భూమిపై ప్రతిజ్ఞ తీసుకున్నాం మరియు దానిని చంద్రునిపై నిజం చేశాం.. మా శాస్త్రీయ సహచరులు కూడా చెప్పారు – భారతదేశం ఈ రోజు చంద్రునిపైకి చేరుకుంది అని తెలిపారు. ‘కొత్త చరిత్ర సృష్టిస్తున్నందున, ప్రతి భారతీయుడు వేడుకలలో మునిగిపోయాడు. ప్రతి ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. నా హృదయం నుండి, నేను ఈ ఉత్సాహం మరియు ఆనందంలో నా దేశస్థులతో మరియు నా కుటుంబ సభ్యులతో కూడా కనెక్ట్ అయ్యాను. దీనికోసం సంవత్సరాలుగా కృషి చేసిన చంద్రయాన్ బృందాన్ని, ఇస్రో మరియు దేశంలోని శాస్త్రవేత్తలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని పేర్కొన్నారు ప్రధాని మోడీ. దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోడీ అభినందించారు. ఇస్రోకు మద్దతుగా నిలిచిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు.

Exit mobile version