Site icon NTV Telugu

Telangana Bandh: ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం.. నేడు తెలంగాణ బంద్!

Telangana Bandh Today

Telangana Bandh Today

OU JAC Calls Telangana Bandh Today Due To Go Back Marwadi Protest: నేడు (ఆగస్టు 22) తెలంగాణ బంద్‌కు ఉస్మానియా యూనివర్శిటీ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణలోని స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీలు దౌర్జన్యం చేస్తున్నారంటూ ఓయూ జేఏసీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు ఇప్పటికే కొన్ని వర్తక సంఘాలు, ప్రజాసంఘాలు మద్దతు ప్రకటించాయి. అలానే తెలంగాణలోని కొన్ని జిల్లాలు బంద్ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తెలంగాణలో గత కొన్ని రోజులుగా ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం కొనసాగుతోన్న విషయం తెలిసిందే.

తెలంగాణ బంద్‌కు ప్రధాన కారణం మోండా మార్కెట్‌ ఘటనే. తాజాగా మోండా మార్కెట్‌లో మార్వాడీ వ్యాపారులు ఓ దళితుడిపై దాడి చేశారు. ఈ ఘటనను ఓయూ జేఏసీ ఛైర్మన్ కొత్తపల్లి తిరుపతి తీవ్రంగా ఖండించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే.. ఇప్పుడు మార్వాడీలు స్థానిక ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. మార్వాడీలు వ్యాపారాలు చేసుకోవడమే కాకుండా.. స్థానికులపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోండా మార్కెట్‌ ఘటనను ఖండిస్తూ.. ఓయూ జేఏసీ నేడు బందుకు పిలుపునిచ్చింది. ప్రజలందరూ దీనికి మద్దతిచ్చి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.

Also Read: Horoscope Today: శుక్రవారం దినఫలాలు.. ఆ రాశి వారికి ఉద్యోగం పక్కా!

మార్వాడీలు నాసిరకం సామగ్రిని తక్కువ ధరకు అమ్ముతూ.. కస్టమర్లను, లోకల్ వ్యాపారస్థులను నష్టపరుస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో స్థానిక వ్యాపారాలకు మాత్రమే కాకూండా.. ఉపాధికి కూడా మార్వాడీల నుంచి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ‘మార్వాడీ గో బ్యాక్’ ఉద్యమం రాజకీయంగా కూడా ఉద్రిక్తంగా మారింది. కొందరు ఈ ఉద్యమంకు మద్దతిస్తుండగా, మరి కొందరు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రమంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్‌లు మార్వాడీలకు మద్దతుగా నిలుస్తున్నారు. మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మద్దతిస్తున్నారు.

Exit mobile version