NTV Telugu Site icon

Off The Record : ఆగస్టులో వైసీపీ నుంచి జనసేనలోకి కీలక చేరికలు.?

Otr Over Ycp

Otr Over Ycp

అక్కడ జంపైపోవాలన్న నాయకులకు వ్రతం చెడ్డా ఫలితం దక్కడం అనుమానంగానే వుందా…?. షార్ట్ కట్ వ్యూహానికి అనూహ్యంగా బ్రేకులు పడ్డాయా…?. ఎగిరిపోతే ఎంత బాగుంటుంటీ… అని వాళ్ళు సాంగేసుకున్నా… మీరొస్తామంటే మేం వద్దంటామంటూ కొందరు నేతలు మోకాలడ్డుతున్నారా? పక్క పార్టీని ఖాళీని ఖాళీ చేసి సంస్థాగతంగా బలపడదామనుకుంటే సీన్‌ రివర్స్‌ అవుతోందా? ఇంతకీ ఎక్కడిదా జంపింగ్‌ గోల? త్రిశంకు స్వర్గంలో ఉన్న ఆ నాయకులు ఎవరు? తెలుగుదేశం పార్టీతో పవర్ షేరింగ్‌లో వున్న జనసేన సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టింది. ఇందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా జాయినింగ్స్‌ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది. నియోజకవర్గాల వారీగా కేడర్ స్ట్రెంత్ పెంచుకోవడమే లక్ష్యం. అదే సమయంలో వలసల్ని ప్రోత్సహించి నాయకత్వ లోటును భర్తీ చేసుకోవడంపై కూడా దృష్టి పెట్టింది అధిష్టానం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీతో సమన్వయంలో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలో ఆగస్ట్‌లో వైసీపీ నుంచి జనసేనలోకి కీలకమైన చేరికలు వుండబోతున్నాయని పార్టీ వర్గాల సమాచారం. అయితే… అంత కంటే ముందు జరిగిన ఓ కీలకమైన ప్రయత్నం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. గ్రేటర్ విశాఖ పీఠం కైవసం చేసుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కూటమి. విశాఖ మేయర్ సీటు నుంచి వైసిపిని తప్పించాలంటే… చట్ట సవరణ అవసరం. అంతకంటే ముందుగా ఇక్కడ ప్రతిపక్షాన్ని బలహీన పరిచే చర్యలు మొదలయ్యాయి. గ్రేటర్‌ విశాఖలో టీడీపీ గేట్లెత్తడంతో… దూకేందుకు 20మంది కార్పొరేటర్లు రెడీ అయ్యారు. వీరిలోకొందరి విషయంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో ఓ 8మంది కార్పొరేటర్లు వయా జనసేన… అధికార కూటమికి దగ్గరవడానికి రెడీ అయ్యారు. దీంతో జంపింగ్‌ జపాంగ్స్‌ ఎవరో తేలిపోయినా… జనసేనలో కూడా తాత్కాలికంగా బ్రేకులు పడ్డట్టు తెలుస్తోంది. కార్పొరేటర్ల గతానికి సంబంధించి జనసేన అధిష్టానానికి కూడా ఫిర్యాదులు వెళ్ళాయట. ఎన్నికల ముందు వరకు జనసేనకు ముఖ్య నాయకత్వ కొరత ఉండేది విశాఖ జిల్లాలో.

పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు మాత్రమే రోడ్డు మీదకు వచ్చి హడావిడి చేసే కేడర్… ఆ తర్వాత మళ్ళీ స్లీప్ మోడ్ లోకి వెళ్ళిపోయేది. జీవీఎంసీ ఎన్నికల్లో ముగ్గురు కార్పొరేటర్లు ను గెలుచు కోగా ఆ తర్వాత మరో ఇద్దరు ఇండిపెండెంట్ కార్పొరేటర్లు చేరడంతో JSP బలం ఐదుకు పెరిగింది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీతో పాటు ఇతర పార్టీల నుంచి మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకుల చేరికలతో సందడి పెరిగింది. పోటీ చేసిన నాలుగు స్థానాల్లో విజయం సాధించగా… ఒక్క సుందరపు విజయ్ కుమార్ మినహా మిగిలిన వాళ్లు అందరూ ఎన్నికల ముందు పార్టీలో చేరిన వాళ్ళే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేసి టికెట్లు ఆశించిన చాలా మంది సర్దుబాట్ల కారణంగా ఇబ్బంది పడుతున్నామన్న ఆవేదనలో వున్నారు. అటు జనసేన ఎమ్మెల్యేలుగా గెలిచిన స్థానాల్లోనూ TDP ద్వితీయ శ్రేణి నాయకత్వంతో సమన్వయం ఛాలెంజ్ గా మారిందంటున్నారు. ఇటువంటి సమయంలో గ్రేటర్ విశాఖ పీఠం కోసం వైసీపీ కార్పొరేటర్లు ను తీసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నట్టు తెలిసింది. ఇక్కడ అధికారం చేతులు మారితే డిప్యూటీ మేయర్ పదవి జనసేనకు లభిస్తుంది. కానీ, గత పదేళ్లుగా వైసీపీ నాయకత్వం వల్ల ఇబ్బందులు పడ్డ జనసేన సీనియర్స్‌ మాత్రం కొత్త నీటి విషయంలో జాగ్రత్తలు పాటించాలని హైకమాండ్ పై ఒత్తిడి తెస్తున్నారట. చేరికలతో సమస్యలు ఎదురైతే తప్పుడు సంకేతాలు వెళతాయని ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిదని సూచనలు వెళ్లినట్టు తెలిసింది. అదే సమయంలో అసలు తెలుగుదేశం నాయకత్వం తిరస్కరించిన కార్పొరేటర్స్‌ని మనం జాయిన్‌ చేసుకోవడం ఏంటన్న ప్రశ్న కూడా వస్తోందట. దానివల్ల ఇబ్బందులు తప్పవంటూ ఆధారాలతో సహా ఫిర్యాదులు చేసినట్టు సమాచారం. దీంతో చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరించాలని హైకమాండ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ క్రమంలోనే జనసేనలో చేరేందుకు వెళ్లిన కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు వెనక్కి తిరిగి వచ్చేసినట్టు తెలిసింది. మళ్ళీ పిలుపు వస్తుందని వాళ్ళు ఎదురు చూస్తుండగా త్వరలో జరగనున్న జీవీఎంసీ స్థాయీ సంఘం ఎన్నికలలోపు జనసేన చేరికల ప్రక్రియ పూర్తి అవుతుందా లేదా అని TDP టెన్షన్ పడుతున్నట్టు వినికిడి. బలం సరిపోక స్థాయీ సంఘం ఎన్నికల్లో ఓడిపోతే అది అధికార పార్టీకి అవమానం. దీంతో జనసేన అధిష్ఠానం గీటురాయి పరీక్షలో గెలిచేది ఎవరు…!?. పార్టీలో చేరేది ఎవరు అనే డిస్కషన్ ఇప్పుడు విస్తృతంగా జరుగుతోంది.