NTV Telugu Site icon

Off The Record : రమణారెడ్డి వ్యాఖ్యల మర్మమేంటి.? పార్టీ పరంగా ప్రాధాన్యం దక్కడం లేదా.?

Bjp

Bjp

ఫస్ట్‌ టైం ఎమ్మెల్యే…. రెండు ప్రధాన పార్టీల ముఖ్య నేతల్ని ఓడించిన జైంట్‌ కిల్లర్‌ ఇమేజ్‌… ఆ ఊహల్లో ఉండగానే… ఆయనకు సడన్‌గా పొలిటికల్‌ వైరాగ్యం పుట్టుకొచ్చిందట. అసలు ఒక్కసారైనా ఎమ్మెల్యేగా గెలవడం అన్నది… రాజకీయ నేతల జీవిత కాలపు లక్ష్యం అయితే… ఆయన మాత్రం ఎందుకు ఎమ్మెల్యేని అయ్యాను దేవుడా… అంటూ తలపట్టుకుంటున్నారట. ఎవరా శాసనసభ్యుడు? ఆయన వైరాగ్యానికి కారణాలేంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గెలుపు సంచలనం. కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ను ఓడించి జైంట్‌ కిల్లర్‌గా నిలిచారు బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి. అప్పట్లో ఆయన పొలిటికల్‌ స్ట్రాటజీ, మాట తీరుపై విస్తృ చర్చే జరిగింది. ఇద్దరు పెద్దల్ని ఓడించి కామారెడ్డి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టడం వరకు ఓకేగానీ… ఆ తర్వాత అసలు సమస్య వచ్చిందట. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం పెద్దగా రావడం లేదంటూ ఆయన అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే తాజా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరు, సభ్యుల వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేశారు కాటిపల్లి. అసెంబ్లీ అంటే ప్రజల కోసం చర్చించాల్సింది కదా …? ఇక్కడ విమర్శలు ప్రతి విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మండిపడ్డారు. కొందరు ఎమ్మెల్యేలు జీతాలు తీసుకొని అసెంబ్లీకి కూడా రారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సభలో ఇద్దరు మాట్లాడితే మిగతా వాళ్లంతా భజన చేసుకుంటూ కూర్చుంటారంటూ ఇంకో వివాదం రేపారాయన. అసెంబ్లీ లో సమస్యల గురించి మాట్లాడాలన్న మినిమం కామన్ సెన్స్ లేదు…. అనవసరంగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వచ్చానని, నాకే బాధేస్తోందంటూ ఓ కొత్త వివాదానికి బీజం వేశారు బీజేపీ ఎమ్మెల్యే. ఇప్పుడు దీని చుట్టూనే రాజకీయ వర్గాల్లో హాట్‌ హాట్‌ డిబేట్‌ జరుగుతోంది.

కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఆయనకు సభలో మాట్లాడే అవకాశం రాలేదన్న ఆవేదనతో అలా అన్నారా? పార్టీ పరంగా తనకు సరైన ప్రాధాన్యత దక్కడం లేదన్న కోపంలో ఉన్నారా? అదీ.. ఇదీ కాకుండా… తన అస్తిత్వం కోసం అలాంటి వివాదాస్పద కామెంట్స్‌ చేశారా? అని చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రజల సమస్యలపై సభలో సరిగా చర్చించడం లేదన్న ఆవేదనలోనుంచి…. ఎందుకు గెలిచానా అన్న వైరాగ్యాం పుట్టుకు వచ్చిందా అన్న ప్రశ్నలు సైతం వస్తున్నాయట. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు లేవు. ఢిల్లీ సర్కార్‌ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందంటూ… అందుకు నిరసనగా తీర్మానం చేసింది అసెంబ్లీ. ఆ తీర్మానంపై చర్చ సందర్భంగా… బీజేపీ ఎమ్మెల్యేలు సభలో ఆందోళన చేస్తుంటే అదే పార్టీకి చెందిన వెంకట రమణారెడ్డి మాత్రం కామ్‌గా ఉన్నారట. తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ కమలం సభ్యులు సభ నుండి వాకౌట్‌ చేసి వెళ్ళిపోయినా… ఆయన మాత్రం అలాగే కూర్చుండిపోయారు. బీజేపీ వాళ్ళంతా వెళ్ళిపోతే… కేవీఆర్‌ మాత్రం ఎందుకు లోపలే ఉన్నారంటూ అప్పట్లోనే చెవులు కొరుక్కున్నారట మిగతా సభ్యులు. ఈ పరిస్థితుల్లో కాటిపల్లి వైఖరిపై బీజేపీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోందట. ఆయనది నిజంగానే ఆవేదనా? లేక అస్తిత్వ పోరాటమా అన్నది చూడాలంటున్నాయి రాజకీయ వర్గాలు. మొత్తానికి ఈ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభలోను ,బయట కామారెడ్డి ఎమ్మెల్యే వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది.