Site icon NTV Telugu

Off The Record : ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒక్కసారిగా దూకుడు పెంచారా.?

Otr Congress

Otr Congress

అక్కడ కాంగ్రెస్‌ రాజకీయం కాక రేపుతోంది. మాంఛి వర్షాకాలంలో కూడా సెగలు పుడుతున్నాయి. చూద్దాం… వెయిట్‌ చేద్దామన్నట్టుగా ఇన్నాళ్ళు ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారిగా దూకుడు పెంచడంతో నియోజకవర్గంలోని మరో వర్గం ఉక్కిరి బిక్కిర అవుతోందట. పెద్దలు సెట్‌ చేయడానికి ప్రయత్నించినా… అది అతుకే తప్ప శాశ్వత పరిష్కారం కాదంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎవరా నాయకులు. లోక్‌సభ ఎన్నికల తర్వాత…. తన నియోజకవర్గంలో దూకుడు పెంచారట మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి. వరుస టూర్స్‌ వేస్తూ… ప్రజలతో మమేకం అయ్యేందుకే ఎక్కవ ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అలాగే నియోజకవర్గ కేంద్రం మిర్యాలగూడ మున్సిపాలిటీలో ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నారాయన. అక్కడే అసలు సమస్య వస్తోందట. మున్సిపల్ చైర్మన్ ప్రమేయం లేకుండానే ప్రోగ్రామ్స్‌ జరగడంపై కాంగ్రెస్‌ వర్గాల్లోనే ప్రత్యేక చర్చ జరుగుతోంది. మున్సిపల్‌ ఛైర్మన్‌ సొంత పార్టీ నేత అయినా… ఎమ్మెల్యే అలా ఎందుకు చేస్తున్నారంటే… చెక్‌ పెట్టేందుకేనన్నది ఎక్కువ మంది చెబుతున్న ఆన్సర్‌. మొదట కాంగ్రెస్‌ పార్టీకే చెందిన మున్సిపల్ చైర్మన్ తిరునగరు బార్గవ్….బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఓడి కాంగ్రెస్‌ గెలవడంతో… తిరిగి హస్తం గూటికి చేరుకున్నారు. ఇక అప్పటి నుంచి మిర్యాలగూడ కాంగ్రెస్‌లో మరో కొత్త వర్గం పురుడు పోసుకుందన్న వాదన బలపడుతోంది పార్టీలో. అప్పట్లో కొందరు సీనియర్ నేతల మద్దతుతో ఎమ్మెల్యే శిబిరంపై గట్టి నిఘాపెట్టిన మున్సిపల్ చైర్మన్…. అక్కడ చీమ చిట్టుక్కుమన్నా… ప్రత్యర్దులకు లీకేజీలు ఇచ్చి సోషల్ మీడియాలో రచ్చకు కారణమయ్యారన్న టాక్‌ ఉంది.

చైర్మన్ తీరుపై గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే వర్గీయలు ఇప్పుడు ఆయనకు చెక్ పెట్టేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కొద్ది నెలలుగా మున్సిపల్ చైర్మన్ వ్యవహారశైలితో రెండు వర్గాలుగా మారిపోయిందట మిర్యాలగూడ కాంగ్రెస్‌. భార్గవ్‌ రాకను గట్టిగా వ్యతిరేకిస్తున్నవారిలో కొందరు ఎమ్మెల్యేతో కలవడం, మరికొందరు సైలెంట్‌ అవడంతో రాజకీయం ఆసక్తికరంగా మారుతోందంటున్నారు. గ్రూపులు కడుతున్న మున్సిపల్‌ చైర్మన్ కు చెక్ పెట్టేందుకు ఇదే సరైన సమయంగా భావించిన ఎమ్మెల్యే వ్యూహాత్మకంగా అడుగులేస్తున్నారట. దీంతో ఇరకాటంలో పడిన భార్గవ్‌… సీనియర్ నేతల సహకారం ఆశించినా… అందకపోవడంతో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నది ఆయన సన్నిహితుల మాట. సీనియర్ నేతకు సన్నిహితుడి ముద్ర ఉన్న మున్సిపల్ చైర్మన్ కు చెక్ పెట్టేందుకు ఇన్నాళ్లు వెనకడుగు వేసిన ఎమ్మెల్యే…. ఇప్పుడిక తగ్గేదే లే అంటున్నారట. మున్సిపాలిటీలో విస్తృత పర్యటనలతో … అటుప్రజలు, ఇటు పార్టీ క్యాడర్, కౌన్సిలర్స్‌కు దగ్గరయ్యేందుకు గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సీనియర్ నేత జానారెడ్డి మద్దతు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కే లభించడంతో… మిర్యాలగూడ కాంగ్రెస్ రాజకీయం రంజుగా మారిందంటున్నారు. ఎత్తులకు పై ఎత్తులతో రెండు వర్గాలు కయ్యానికి సిద్ధం అవుతుండం మిర్యాలగూడ కాంగ్రెస్‌లో హీట్‌ పెంచుతోంది. పెద్దాయ జోక్యంతో విభేదాలకు చెక్ పడ్డట్టు కనిపిస్తున్నా… అది నివురుగప్పిన నిప్పేనన్నది లోకల్‌ టాక్‌. జానా జోక్యంతో గ్రూపులకు చెక్ పడుతుందా? లేక కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు మిర్యాలగూడ వేదిక అవుతుందా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.

Exit mobile version