రాష్ట్రపతి ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా ద్రౌపతి ముర్మును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముర్ము తన ప్రచారంలో బిజీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా మద్దతు సంపాదించే పనిలో ఉన్నారు.
ఇదిలా ఉంటే సోమవారం విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ లో నామినేషన్ దాఖలు చేశారు. యశ్వంత్ సిన్హా వెంట ప్రతిపక్షాల ప్రధాన నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, టీఆర్ఎస్ పార్టీ నుంచి మంత్రి కేటీఆర్, ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూఖ్ అబ్దుల్లా, డీఎంకే పార్టీ తరుపున ఏ. రాజా తదితరులు హజరయ్యారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తమ మద్దతును యశ్వంత్ సిన్హాకు ఇస్తున్నట్లు మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో ప్రకటించారు.
అయితే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ముందుగా ఎన్సీపీ నేత శరద్ పవార్ ను అనుకున్నప్పటికీ ఆయన విముఖత చూపారు. ఆ తరువాత నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, వెస్ట్ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీలను అభ్యర్థులుగా అనుకున్నప్పటికీ వీరంతా పోటీకి సముఖంగా లేకపోవడంతో బీజేపీ మాజీ నేత, ప్రస్తుతం టీఎంసీలో ఉన్న యశ్వంత్ సిన్హా పార్టీకి రాజీనామా చేసి రాష్ట్రపతి ఎన్నికల పోటీలో నిలబడ్డారు. ఎన్డీయేతర విపక్షాలు యశ్వంత్ సిన్హా అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నాయి. ఇదిలా ఉంటే నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్, వైసీపీలు ద్రౌపతి ముర్ముకు సపోర్టు చేస్తున్నాయి. జూలై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ముగుస్తోంది. 25న కొత్త రాష్ట్రపతి కొలువదీరనున్నారు. ఇందుకోసం జూలై 18న ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి. జూలై 21న ఫలితాలు వెలువడనున్నాయి.
