NTV Telugu Site icon

OnePlus Nord 4 Price: ‘వన్‌ప్లస్‌ నార్డ్‌ 4’ వచ్చేసింది.. 28 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్‌!

Oneplus Nord 4

Oneplus Nord 4

OnePlus Nord 4 Launch Date and Price in India: ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ ‘వన్‌ప్లస్‌’.. నార్డ్‌ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ‘వన్‌ప్లస్‌ నార్డ్‌ 4’ను మంగళవారం రిలీజ్ చేసింది. గతేడాది వచ్చిన వన్‌ప్లస్‌ నార్డ్‌ 3కి కొనసాగింపుగా ఈ ఫోన్‌ వస్తోంది. వన్‌ప్లస్‌ సమ్మర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఫోన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ వన్‌ప్లస్‌ నార్డ్‌ 4లో 5,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 28 నిమిషాల్లోనే పూర్తి ఛార్జింగ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది. 50 ఎంపీ సోనీ సెన్సర్‌తో ఈ ఫోన్‌ వస్తోంది. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలను చూద్దాం.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. బేస్‌ వేరియంట్ 8జీబీ+128జీబీ ధర రూ.29,999గా ఉండగా.. 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.32,999గా ఉంది. ఇక హై ఎండ్ వేరియంట్ 12జీబీ+256 జీబీ ధర రూ.35,999గా కంపెనీ నిర్ణయించింది. సిల్వర్‌, గ్రీన్‌, మిడ్‌నైట్‌ షేడ్స్ రంగుల్లో ఈ ఫోన్ లభిస్తుంది. ఆగస్టు 2 నుంచి విక్రయాలు ఆరంభం అవుతాయి. జులై 20 నుంచి 30 మధ్య వన్‌ప్లస్‌, అమెజాన్‌లో ప్రీ ఆర్డర్‌ చేసుకోవచ్చు. బ్యాంక్‌ ఆఫర్లతో కలిపి బేస్‌ వేరియంట్‌ రూ.27,999కి మీకు లభిస్తుంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ 4 స్మార్ట్‌ఫోన్‌లో 6.74 ఇంచెస్ డిస్‌ప్లే ఇచ్చారు. 1.5K అమోలెడ్‌, 120 Hz రిఫ్రెష్‌ రేటుతో వస్తోంది. స్నాప్‌డ్రాగన్‌ 7+ జనరేషన్‌ 3 ప్రాసెసర్‌ ఉండగా.. ఆండ్రాయిడ్‌ 14తో కూడిన ఆక్సిజన్‌ ఓఎస్‌ 14.1తో వస్తోంది. వెనుకవైపు 50 ఎంపీ ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన సోనీ LYTIA సెన్సర్‌ను ఇచ్చారు. ఎలక్ట్రానిక్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో కూడిన 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా ఉంటుంది. ముందువైపు 16 ఎంపీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో 4K వీడియోను రికార్డు చేసుకోవచ్చు. ఇందులో 5500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండగా.. 100W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 1 నుంచి 100 శాతం ఛార్జింగ్‌ కేవలం 28 నిమిషాల్లోనే అవుతుంది.