భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు వింటే హిందూ యువతకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. మెఘలుల దాడుల నుంచి హిందూమతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. తల్లి సంరక్షణలో బైరంఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజపుర, గోల్కొండ సుల్తానులు, మొఘలులకు ముచ్చెమటలు పట్టించాడు. తన గురువు సమర్ధ రామదాసు, తల్లి జిజియాబాయి బోధనలతో హిందూ మత సంరక్షణకు కంకణం కట్టుకున్నాడు శివాజీ. స్వశక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ గురించి చరిత్రకు తెలియని నమ్మశక్యంగాని నిజాలు ఎన్నో ఉన్నాయి. రేపు ఈ మహానుభావుడి జయంతి.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం..
సైన్యంలోని మూడో వంతు మంది ముస్లింలే..
ప్రతాప్‌ఘడ్‌లోని అఫ్జల్‌ఖాన్ సమాధిని కూలగొట్టేందుకు హిందూ కార్యకర్తలు గతంలో ప్రయత్నించారు. అయితే, శివాజీనే స్వయంగా దాన్ని నిర్మించాడన్న విషయం వెలుగులోకి రావడంతో వారు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అన్ని మతాలను గౌరవించిన రాజుల్లో శివాజీ ఒకరు. తన హయాంలోని సైన్యం, పరిపాలన, వివిధ శాఖల్లోని ఉద్యోగుల కూర్పు చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. మతం ప్రతిపాదికన కాకుండా మానవీయ విధానాలతో శివాజీ పరిపాలన సాగించాడు. సైన్యం, అధికారుల నియామకాల్లో మతాన్ని ప్రతిపాదికగా తీసుకోలేదు. అతని సైన్యంలోని మూడో వంతు మంది ముస్లింలే. శివాజీ నావికా దళ అధిపతి సిద్ధీ సంబాల్. అందులో ఎక్కువ మంది సైనికులు కూడా ముస్లింలే.
ఇతర మతాలపై గౌరవం…
ఇతర మతాల పెద్దలను శివాజీ గౌరవించేవాడు. హజ్రత్ బాబా యాకుత్ బహుత్ తొర్వాలే పట్ల శివాజీకి చాలా గౌరవభావం ఉండేది. ఆయనకు జీవితాంతం పింఛను అందేలా ఏర్పాటు చేశాడు. అలాగే ఫాదర్ అంబోస్ పట్ల కూడా ఆయనకు అదే విధమైన గౌరవం ఉండేది. గుజరాత్ దాడిలో ధ్వంసమైన చర్చి పునర్ నిర్మాణానికి శివాజీ సాయం అందించాడు. తన రాజధాని రాయగఢ్‌లో ముస్లింలు నమాజ్ చేసుకునేందుకు ప్రత్యేకంగా మసీదు నిర్మించాడు. యుద్ధ సమయంలో చేతికి చిక్కే ముస్లిం మహిళలు, పిల్లల పట్ల దురుసుగా ప్రవర్తించవద్దని తన సైన్యానికి శివాజీ ఆదేశాలిచ్చాడు. అలాగే, తన రాజ్యంలోని మసీదులు, దర్గాలకు రక్షణ కల్పించాడు. ఎవరికైనా ఖురాన్ దొరికితే దాన్ని చాలా గౌరవంగా తీసుకొని ముస్లింలకు అప్పగించాలని సైనికులను కోరారు. బసేన్ నవాబ్ కోడలి పట్ల శివాజీ చూపిన గౌరవం అందరికి తెలిసిందే. దోపిడీలో భాగంగా ఆమెను సైనికులు శివాజీకి అర్పించేందుకు ప్రయత్నించారు. అప్పుడు శివాజీ ఆమెను ఎంతో గౌరవంగా చూసి క్షమించాలని కోరాడు. అలాగే ఆమెను ఇంటి వరకూ సురక్షితంగా దిగబెట్టిరావాలని తన సైనికులను ఆదేశించాడు.
అఫ్జల్ ఖాన్‌ను చంపిన శివాజీ..
అఫ్జల్ ఖాన్‌ను శివాజీ హత్య చేయడాన్ని చరిత్ర వక్రీకరించి చూపింది. అదిల్షా రాజులకు, శివాజీకి ఏళ్ల తరబడి యుద్ధం కొనసాగుతోంది. అఫ్జల్ ఖాన్ అదిల్షా రాజ్యానికి ప్రతినిధిగా శివాజీతో పోరాడాడు. చర్చల పేరుతో శివాజీని తన గుడారానికి ఆహ్వానించి చంపడానికి అఫ్జల్ ఖాన్ కుట్ర పన్నాడు. అయితే, ఈ విషయం కూడా ఒక ముస్లిం ద్వారానే శివాజీకి తెలిసింది. రస్తీం జమాన్ సూచన మేరకే శివాజీ ఇనుప పంజాలు ధరించి అఫ్జల్ ఖాన్‌ను వధించాడు. శివాజీని కుట్రతో చంపాలని అఫ్జల్ ఖాన్‌కు సూచించింది హిందూ అయిన కృష్ణాజీ భాస్కర్ కులకర్ణి. కానీ, ఈ విషయం పెద్దగా వెలుగు చూడలేదు.