NTV Telugu Site icon

Nadipelli Diwakar Rao : మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్ధిగా మళ్లీ దివాకర్ రావు.!

Nadipelli Divarakar Rao

Nadipelli Divarakar Rao

నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నడిపెల్లి దివాకర్ రావు, మరోమారు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. దివాకర్ రావు గతంలో 1999, 2004 ఎన్నికల్లో మంచిర్యాల నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వరసగా రెండు సార్లు గెలిచారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. తరువాత, 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన టీఆర్‌ఎస్‌ కొత్త పేరు.. బీఆర్‌ఎస్‌ తరపున మరోమారు రంగంలో దిగేందుకు సర్వం సిద్ధమైంది. ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలన్నదే ఆయన లక్ష్యం. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. కానీ దివాకర్ రావు తనదైన మార్కు రాజకీయాలతో నిత్యం ప్రజల్లో ఉంటూ ఆశావాహులను నిరాశపరుస్తున్నారు. జిల్లాలో ఏకైక జనరల్ సీటు కావటం వల్ల మంచిర్యాల బీఆర్‌ఎస్‌ టికెట్‌ కోసం పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. అందుకే ఇక్కడ టికెట్ ఆశావాహుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. ప్రస్తుతం అరడజను మంది ఈ నియోజకవర్గం వైపు చూస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం సిట్టింగ్‌ ఎమ్మెల్యే దివాకర్‌ రావు వైపే మొగ్గుచూపుతుందని సమాచారం.

దివాకర్‌ రావు ఎమ్మెల్యేగా ఉన్న గత పదేళ్లలో నియోజకవర్గ అభివృద్ధికి చెప్పుకోదగిన విధంగా కృషిచేశారనే విషయాన్ని స్థానిక ప్రజలు కూడా అంగీకరిస్తారు. ముఖ్యంగా ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడి మంచిర్యాలకు మెడికల్ కాలేజీ సాధించిపెట్టాడు. రాకుండా అడ్డుపడాలని ఎన్ని డ్రామా రాజకీయాలు నడిచినా చివరకు మంచిర్యాలకు మెడికల్ కాలేజీ వచ్చింది. ఈ కాలేజీ కోసం ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు కాళ్ళకి చక్రాలు కట్టుకుని తిరిగారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీల్లో మెడికల్ కాలేజీ ఒకటి. అది నెరవేరడంతో ఈసారి టికెట్ కూడా ఆయనకు ఇస్తేనే బాగుంటుందని పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్న నేపథ్యంలో.. అధిష్టానం కూడా అటువైపే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

బీఆర్‌ఎస్‌ పార్టీకి సేవలు చేయటమే గాక.. మంచిర్యాల జిల్లా సాధన కోసం దివాకర్ రావు కృషి చేసి విజయం సాధించారు. మంచిర్యాల జిల్లాగా ఏర్పడటంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.. దీన్ని ప్రజలు సైతం ఒప్పుకుంటారు.. నేడు మంచిర్యాల రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, కలక్టరేట్, మెడికల్ కాలేజీ వంటివి చాలా వచ్చాయంటే ..అది దివాకర్ రావు కృష్టి వల్లే సాధ్యమైందనటంలో ఎటువంటి సందేహం లేదు.

నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన దివాకర్‌ రావులో రాజకీయంగా అనేక ప్లస్‌ పాయింట్లు కనిపిస్తాయి. ముఖ్యంగా ఆయన హయాంలో మంచిర్యా ప్రశాంతంగా ఉంది. ఎటువంటి అల్లర్లు జరగకూడదు అన్న ఉద్దేశంతోనే రాజకీయాలు చేస్తున్నానంటారాయన. ప్రజల్లో ..ఆయన మంచివాడన్న పేరుంది. ఇప్పుడిది ఆయనకు పెద్ద ప్లస్‌ అవుతుంది. ఇన్నేళ్ల లో ఒక్క ల్యాండ్ సెటిల్మెంట్‌ కానీ.. కబ్జా ఆరోపణలు లేని రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. ఇక పార్టీ క్యాడర్‌లో ఆయనకు మంచి పట్టుంది. ఆయన రంగంలో దించిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు ఇలా …ఏ అభ్యర్థికైనా మాటఇస్తే గెలిపించుకునే వరకు నిద్రాహారాలు మాని కృషి చేస్తారనే పేరు స్థానిక నాయకుల్లో ఉన్నది. ఇక మంచిర్యాల లో ఓట్లను ప్రభావితం చేసే శక్తి గల వ్యాపారస్తులలో కూడా …దివాకర్ రావు అవినీతి మచ్చ లేని నేతగా పేరు సంపాదించుకున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలకు అధిక సాగు భూమి కలిగిన నియోజకవర్గంగా పేరుంది . ప్రత్యేక రాష్ట్రం రావటానికి ముందు.. ఆ తరువాత వచ్చిన తేడా ఈ నియోజకవర్గంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎల్లంపల్లి, గూడెం, చల్లంపేట, కడెంలో 1 నుంచి 42 మినీ ప్రాజెక్టులు, వీటి ద్వారా పొలాలకు పుష్కలంగా నీటి లభ్యత ఉంది. నియోజకవర్గంలో ఎవరిని అడిగినా ఈ మాట చెబుతారు.

దివాకర్‌ రావు హయాంలో మంచిర్యాల..జిల్లాలోనే ఆదర్శ నియోజకవర్గంగా పేరు తెచ్చుకుంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, మౌలిక సదుపాయాలు కల్పన..ఇలా అన్ని రంగాల్లో మంచిర్యాల అభివృద్ధయింది. మెడికల్ కాలేజీ, రోడ్లు, సాగు, త్రాగు నీరు, కలెక్టరేట్ భవనం, మాతా శిశు ఆసుపత్రి ..ఇలా ప్రతి అంశంలోనూ మంచిర్యాలను అభివృద్ధి పథంలో నడిపించారు దివాకర్ రావు. ఎన్నికల ముందు ప్రత్యర్థి పార్టీల నేతలు ఎన్ని చెప్పినా ప్రజలు చివరకు దివాకర్ రావుకే ఓటు వేస్తారనే విషయం ఇప్పటికే రుజువైంది. ఇలా అన్ని విధాలా అభివృద్ధి చెంది పక్క నియోజకవర్గాలకు ఒక రోల్ మాడల్ గా నిలిచింది మంచిర్యాల.

దివాకర్ రావు కుమారుడు విజిత్ కుమార్, తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని , 6 నెలలుగా ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమంతో ప్రజా క్షేత్రంలో ఉన్నారు. విజిత్ ఉన్నత విద్యావంతులు,తండ్రి కోరిక మేరకు ఇప్పుడు పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఐతే, ఏ పదవి కూడా ఆశించకుండా తండ్రికి అండగా.. పార్టీ కోసం పని చేస్తున్నారు. 20 సంవత్సరాలుగా అన్ని సందర్భాలలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నారు. గడిచిన 9 సంవత్సరాలలో మంచిర్యాల బీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో అన్ని తానై పార్టీని బలోపేతం చేశారు… పార్టీ శ్రేణులని కలుపుకుపోతూ ముందుకు సాగుతున్నారు. విజిత్‌ కుమార్‌ చేస్తున్న కార్యక్రమాలతో ప్రజాక్షేత్రంలో ఉన్న కొద్దిపాటి వ్యతిరేకత కూడా మాయమై.. ఎన్నికల ముందే క్లియర్ మెజారిటీ కనిపిస్తోంది.బీఆర్‌ఎస్‌ టికెట్ విజిత్‌ కుమార్‌కు కూడా ఇచ్చే అవకాశాలను కొట్టిపారేయలేము. తండ్రి దివాకర్ రావు పాలనా పరమైన అంశాలు చూస్తుండగా.. విజిత్ కుమార్ పార్టీ బలోపేతం పై దృష్టి సారించారు.

ఇటు సొంత పార్టీ బీఆర్ఎస్ నేతలు కానీ, అటు ప్రతిపక్ష నాయకులు కానీ.. ఎదో రాజకీయ లబ్ది కోసం ఎన్నికలప్పుడు వచ్చిపోయే పొలిటికల్ టూరిస్టులని, వారికి మంచిర్యాలకు ఎలాంటి సంబంధం లేదనే టాక్ నియోజవర్గంలో ఉంది. అయితే వీరిని కాంగ్రెస్ నేత ఒకరు రెచ్చగొడుతున్నారన్న ఆరోపణ ఉంది. దివాకర్ రావు తనకు ఉన్న స్థానిక పలుకుబడిని ప్రజల్లోకి తీసుకువెళ్లి మరోమారు పార్టీ టికెట్ దక్కించుకుంటున్నారు. ఇక ఇతర పార్టీల నేతలు సైతం.. నడిపెల్లి కుటుంబంలో ఎవరికి టికెట్ వచ్చినా తమ గెలుపు అసాధ్యమని భావించి… వారికి టికెట్ దక్కట్లేదనే ప్రచారం చేస్తున్నారు. ..గత ఆరునెలలుగా వారు తమ ప్రచారాన్ని ముమ్మరం చేసినా.. దివాకర్ రావు మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారుజ

ఇక, కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్న ప్రధాన నేత ఒకరు తన పట్ల అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారు. సదరు కాంగ్రెస్‌ నేతపై గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు రుణ ఎగవేత అభియోగాలు, పలు కేసులు, భూ కబ్జా ఆరోపణలు, సొంత పార్టీ నేతలపై దాడులు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తో విభేదాలు ..ఇవన్నీ కలిసి మంచిర్యాల పై ఆ కాంగ్రెస్‌ నేత మార్క్ చూపకుండా అడ్డుపడుతున్నాయి. ప్రస్తుతం స్థానికేతర నేతలకు అండగా నిలుస్తూ.. అసత్య ప్రచారాలతో రాజకీయాలు చేస్తూ జనాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క సారి టికెట్ నిఖరమైతే ఈ అబద్ధ ప్రచారాలన్నిటికి చెక్ పెట్టవచ్చని మంచిర్యాల బీఆర్ఎస్ నాయకులు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆరు నెలలు ..అరడజను ఆశావహులతో ఉత్కంఠగా మారిన మంచిర్యాల బీఆర్‌ఎస్‌ టికెట్ పోరు తుది దశకి చేరి.. చివరకు నడిపెల్లి వారికే టికెట్‌ అనే క్లారిటీ ..విశ్వసనీయ వర్గాల ద్వార వచ్చింది.

Show comments