NTV Telugu Site icon

MS Dhoni: 19 ఏళ్ల రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.. ఒకే ఒక్కడు ఎంఎస్ ధోనీ!

Ms Dhoni Long Hairstyle

Ms Dhoni Long Hairstyle

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెరీర్ ఆరంభంలో ఆడిన రెండు ఇన్నింగ్స్‌లను ఎవరూ మర్చిపోరు. పాకిస్తాన్‌పై 148 రన్స్, శ్రీలంకపై 183 రన్స్ బాదాడు. ముఖ్యంగా రాజస్థాన్‌లోని జైపుర్‌ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ ఆడిన 183 భారీ ఇన్నింగ్స్‌ అందరికీ గుర్తుంటుంది. సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన వికెట్‌ కీపర్‌-బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 145 బంతుల్లో 183 పరుగులతో మహీ నెలకొల్పిన రికార్డును గత 19 ఏళ్లుగా ఎవరూ బద్దలుకొట్టలేకపోయారు.

ఎంఎస్ ధోనీ శ్రీలంకపై 10 సిక్స్‌లు, 15 ఫోర్లతో మైదానంలో పరుగుల వరద పారించాడు. అంతకుముందు 2004లో ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ పేరిట ఉన్న 172 పరుగుల రికార్డు బద్దలైంది. ఇప్పటికీ వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌గా ధోనీ కొనసాగుతున్నాడు. సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజున (అక్టోబరు 31) మహీ ఈ రికార్డును నెలకొల్పాడు. ఆ రికార్డును బ్రేక్‌ చేయడానికి ఎంతో మంది ఆటగాళ్లు ప్రయత్నించినా కుదరలేదు.

దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్‌ డి కాక్‌ అనేక సందర్భాల్లో ఎంఎస్ ధోనీ రికార్డుకు దగ్గరగా చేరుకున్నాడు. డికాక్‌ బంగ్లాదేశ్‌పై (2023) 174 పరుగులు చేశాడు. 2016లో ఆస్ట్రేలియాపై 178 స్కోర్‌ బాదాడు. 2017లో బంగ్లాదేశ్‌పై 168 పరుగులు చేశాడు. ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించినా.. ధోనీ రికార్డును మాత్రం ఎవరూ దాటలేకపోయారు. మహీ 538 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 44.96 సగటుతో 17266 పరుగులు చేశాడు. ఇందులో 16 శతకాలు, 108 అర్ధ సెంచరీలతో ఉన్నాయి.