NTV Telugu Site icon

ఒమిక్రాన్‌ వేరియంట్‌..ఆ వయస్సు వారిపైనే ఎఫెక్ట్‌ !

రోజుకో రూపం మార్చుతూ పెను సవాల్‌ విసురుతోంది కరోనా వైరస్‌. ఊహించని రీతిలో వ్యాపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొదట్లో వెలుగు చూసిన కరోనా వేరియంట్లు వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వాళ్లపై ప్రభావం చూపిస్తే… తర్వాత బీటా, డెల్టా వేరియంట్లు యువకులు, మధ్య వయస్కులపై విరుచుకుపడ్డాయి. తాజాగా వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ పిల్లలపై ప్రభావం చూపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.సౌతాఫ్రికాలో ఐదేళ్ల లోపు చిన్నారులు పెద్ద సంఖ్యలో కరోనా బారినపడుతున్నారు. ప్రస్తుతం తమ ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా బాధితుల్లో ఐదేళ్ల లోపు చిన్నారులే అధికంగా ఉంటున్నారని సౌతాఫ్రికాకు చెందిన డాక్టర్లు చెబుతున్నారు.

జహన్నెస్‌ బర్గ్‌ నగరాన్ని ఆనుకుని ఉన్న గౌటెంగ్‌ ప్రావిన్సులో గల ఆస్పత్రుల్లో చేరుతున్న రోగుల్లో ఐదేళ్ల లోపు చిన్నారుల సంఖ్య వారం-వారానికి పెరుగుతున్నారు. అడ్మిట్‌ అవుతున్న వాళ్లలో అన్ని వయస్సుల వాళ్లు ఉంటున్నా… ఐదేళ్లలోపు చిన్నారుల సంఖ్య అధికంగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో పిల్లలపై కరోనా ప్రభావం స్వల్పంగానే ఉందని డాక్టర్లు చెబుతున్నారు. సౌతాఫ్రికాలో థర్డ్‌ వేవ్‌లో కూడా ఐదేళ్ల లోపు చిన్నారులతో పాటు 15 నుంచి 19 ఏళ్ల వయస్సు గల వాళ్లు కరోనాతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారు.

కానీ… ఇప్పుడు ఆస్పత్రిపాలువుతున్న వాళ్లలో ఐదేళ్లలోపు చిన్నారుల సంఖ్య అధికంగా ఉందంటున్నారు. ప్రస్తుతం సౌతాఫ్రికాలో కరోనా ఫోర్త్‌ వేవ్‌ నడుస్తోంది. ఉదాహరణకు తాష్వాని నగరంలో ఫోర్త్‌ వేవ్‌ మొదటి రెండు వారాలైన నవంబర్‌ 14 నుంచి 27 వరకూ వంద మందికి పైగా పిల్లలు కరోనాతో ఆస్పత్రిలో చేరారు. అంతకు ముందు మేలో వచ్చిన థార్డ్‌ వేవ్‌ సమయంలో ఆస్పత్రి పాలైన చిన్నారుల సంఖ్య 20 కూడా దాటలేదు. అయితే, దీనికి మరో కారణం కూడా లేకపోలేదు. పెద్ద వాళ్లకు వ్యాక్సినేషన్‌ వల్ల రోగనిరోధక శక్తి వస్తోంది. కానీ పిల్లలకు ఇంకా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వకపోవడం వల్ల వాళ్లు వైరస్‌ బారినపడుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా… ఇతర కరోనా వేరియంట్లకు భిన్నంగా ఒమిక్రాన్‌ పసివాళ్లకు వ్యాపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.