Site icon NTV Telugu

Old City Metro : ఓల్డ్‌ సిటీలో మెట్రో కారిడార్‌లో జోరు.. స్థల సేకరణ పనులు ముమ్మరం

Old City Metro

Old City Metro

Old City Metro : మెట్రో రైల్ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్ నుండి చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మార్గంలో విస్తరణ పనులు ఇప్పుడు జోరుగా సాగుతున్నాయని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రభావిత ఆస్తులను స్వాధీనం చేసుకుని, కూల్చి వేసే కార్యక్రమం స్థానికుల పూర్తి సహాయ సహకారాలతో ముమ్మరంగా సాగుతోందని ఆయన చెప్పారు. మొత్తం ఈ మార్గంలో 1100 ప్రభావిత ఆస్తుల ఉండగా ఇప్పటి వరకు ఈ మార్గంలో 205 ఆస్తులకు చెక్కుల పంపిణీ జరిగిందని, ఆయా ఆస్తులకు సంబంధించిన రు. 212 కోట్ల నష్టపరిహారం ఇప్పటికే చెల్లించడం జరిగిందని ఆయన వెల్లడించారు.

ఈ మార్గంలో ఇరువైపులా చిక్కు ముడులుగా ఉన్న కొన్ని క్లిష్టమైన విద్యుత్, టెలిఫోన్ కేబుళ్లను అత్యంత అప్రమత్తంగా తొలగించి తమ ఇంజినీరింగ్ సిబ్బంది మార్గాన్ని సుగమం చేసారని మెట్రో ఎండీ వెల్లడించారు. మెట్రో అధికారులతో పాటు, రెవిన్యూ, పోలీస్ పర్యవేక్షణలో మెట్రో మార్గం విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయి. ప్రభావిత ఆస్తుల యజమానులు స్వచ్ఛందంగా స్పందించి ప్రభుత్వం నిర్ణయించిన నష్టపరిహారాన్ని ఆమోదించి ముందుకు వచ్చి తమ ఆస్తులను మెట్రో మార్గం కోసం ఇచ్చారని ఆయన తెలిపారు. ఇప్పటికే రోడ్డు విస్తరణ కోసం పలు భవనాలు, కట్టడాలను కూల్చివేసి, అవశేషాలను తొలగించడం జరిగిందని చెప్పారు.

సున్నితమైన కట్టడాలకు ఎటువంటి ముప్పు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. రంజాన్ సందర్బంగా విస్తరణ పనుల వేగం కొంత తగ్గినప్పటికీ, ఇప్పుడు అవి మళ్ళీ పుంజుకుని సజావుగా సాగుతున్నాయని మెట్రో ఎండీ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరిత గతిన పాతనగరం విస్తరణ పనులు పూర్తి చేసి, కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే మెట్రో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.

Paddington in Peru : అందరికీ ఇష్టమైన ఎలుగుబంటి తిరిగి వచ్చింది !

Exit mobile version