NTV Telugu Site icon

Off The Record : ఉమ్మడి విశాఖ భూ లావాదేవీలపై ఫోకస్

Visakha Files Otr

Visakha Files Otr

ఆ ఫైళ్లలో ఏముంది…!?. ఎవరి లెక్కలు తేల్చడానికి ప్రభుత్వం రెడీ చేస్తోంది…!? గతంలో నిజంగానే తప్పులు జరిగాయా? జరిగిఉంటే అవి ఎవరి మెడకు చుట్టుకోబోతున్నాయి? ఏపీ పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఇప్పుడిదో విస్తృమైన చర్చ. ఇంతకీ ఏంటా ఫైల్స్‌? ఎందుకు అధికారులు సైతం అంతలా భయపడుతున్నారు? సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిన ఈ రాజకీయ కథా చిత్రం ఎప్పుడు విడుదలవుతుంది…?. ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఫైల్స్‌ సీరియల్‌ నడుస్తోంది. మదనపల్లె ఎపిసోడ్ కొలిక్కి రాకముందే విశాఖ ఫైల్స్‌ కాక రేపుతున్నాయి. ఐదేళ్ల వైసిపి ప్రభుత్వ హయాంలో ఉమ్మడి విశాఖ జిల్లాలో జరిగిన భూ కేటాయింపులు, లావాదేవీలను సమీక్షించేందుకు మొదలైన ప్రయత్నంలో ఎటువంటి లొసుగులు బయటపడతాయా అన్న చర్చ జరుగుతోంది జిల్లా రాజకీయ వర్గాల్లో. సమగ్ర విచారణ జరుగుతుందని, బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా క్షేత్రస్థాయి పర్యటనకు రంగంలోకి దిగడంతో అలజడి పెరుగుతోంది. ఇప్పటికే సేకరించిన ఆధారాలను నిర్ధారించుకునేందుకే ప్రభుత్వం సీనియర్ ఐఎఎస్‌ని రంగంలోకి దింపినట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. వైజాగ్ ఫైల్స్‌లో ఉన్న ఏ ఒక్కరికి మినహాయింపులు ఉండవన్న రాజకీయ హెచ్చరికలు కూడా వాతావరణాన్ని వేడికిస్తున్నాయి. రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని టీడీపీ ఆరోపిస్తూ వచ్చింది. అధికారం చేతులు మారడంతో విశాఖ భూములపై ఫోకస్‌ చేసింది ప్రభుత్వం. ఈ దిశగా కీలక ఆధారాలతో ప్రతిపక్షానికి చెందిన ముఖ్య నేతల బండారం బయటపెట్టాలనేది ఆలోచనగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కు మరింత పదునుపెట్టి…. గుజరాత్ తరహాలో అమలు చేస్తామని స్వయంగా ప్రకటించారు మంత్రి. అది కూడా విశాఖ గడ్డ నుంచి కావడంతో ప్రభుత్వ కదలికలపై విస్తృత చర్చ జరుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరించిన పార్టీ సీనియర్‌ నేతలతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఇప్పటికే కొన్ని ఆధారాలను సేకరించినట్టు ప్రచారం ఉంది.

ఉమ్మడి విశాఖ జిల్లాలో వివాదాస్పద భూములు చేతులు మారినట్టుగా అనుమానిస్తుండగా గ్రౌండ్ లెవెల్లో బాధ్యులైన వారిపై వేటు మొదలైంది. భోగాపురం ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల ఉన్న అసైన్డ్‌ భూములతోపాటు విశాఖ నగరంలోని ఖరీదైన ప్రాంతంలోని దసపల్లా, ఎన్‌సీసీ, హయగ్రీవ ప్రాజెక్టు భూముల లావాదేవీల వెనుక అప్పటి ముఖ్యులు ప్రమేయం ఉందని టిడిపి ఆరోపిస్తోంది. వీటి విలువ వందల కోట్లు కాగా వ్యూహాత్మకంగా కొట్టేశారనేది అధికార పక్షం ఆరోపణ. వీటిలో నిషిద్ధ జాబితా నుంచి తొలగించిన అసైన్డ్, ఇతర భూములను కలిపితే వేల కోట్ల అక్రమాలు జరిగాయన్నది టీడీపీ వెర్షన్‌. ప్రధానంగా మధురవాడ, కొమ్మాది, కాపులుప్పాడ, భీమిలి, ఆనందపురం, గంభీరం, పెందుర్తి, పద్మనాభం, మాధవధార, సబ్బవరం, పరవాడ ప్రాంతాల్లో 22ఏ నుంచి తొలగించిన భూములు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని చోట్ల భూ సమీకరణకు రైతులు భూములు ఇవ్వగా… కొందరు నేతలు చక్రం తిప్పినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందట. ఈ వ్యవహారాల్లో బడా వ్యక్తులకు సహకరించిన ఉద్యోగుల మెడకు ఉచ్చు బిగుసుకుంటోందట. ఇనాం భూముల అక్రమ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి భీమిలి సబ్ రిజిస్ట్రార్‌పై వేటు పడింది. వైజాగ్ ఫైల్స్ లో ఇది ఫస్ట్ వికెట్ కాగా…. సూత్రధారులు అనేకమంది ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తోందట. ఈ క్రమంలో రెండు రోజులు పాటు రెవెన్యూ యంత్రాంగంతో సీనియర్ అధికారులు సమీక్ష చేయబోతున్నారు. ఒత్తిళ్ళ కారణంగా ఏవైనా వ్యవహారాలు జరిగి ఉంటే వాటిని బహిర్గతం చేయటం, అందుకు స్క్రీన్ ప్లే నడిపించిన వారి వివరాలను బయటపెట్టడం ప్రధానంగా అధికార పార్టీ భావిస్తోందట. దీంతో వైజాగ్ ఫైల్స్ ఎవరి మెడకు చుట్టుకుంటాయి…?. ఎవరి మీద చర్యలు ఉంటాయన్న ఉత్కంఠ పెరుగుతోంది.