Site icon NTV Telugu

Off The Record: జూబ్లీహిల్స్‌ ఓటమిపై షాకింగ్‌ రిపోర్ట్స్‌.. సైడ్‌ చేశారని నేతల ఆవేదన!

Off The Record

Off The Record

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ ఎందుకు ఓడిపోయింది? ఎక్కడ తేడా కొట్టినట్టు పార్టీ పోస్ట్‌మార్టంలో తేలింది? వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు లోకల్‌ నాయకులు ఏమని రిపోర్ట్‌ ఇచ్చారు? వాళ్ళు బాగా హర్ట్‌ అయ్యారన్నది నిజమేనా? అసలు స్థానిక నేతల ఆవేదన ఏంటి?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న బీఆర్‌ఎస్‌… సీరియస్‌ పోస్ట్‌మార్టంలో పడిందట. అసలు గెలుస్తామని, లేదంటే గట్టి పోటీ ఇవ్వగలుగుతామని భావించిన భావించిన పార్టీ పెద్దలు… కాంగ్రెస్‌ అభ్యర్థికి అంత మెజార్టీ రావడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎక్కడ తేడా కొట్టిందని రివ్యూ చేసేందుకు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌… జూబ్లీహిల్స్‌ నాయకుల్ని ఆఫీస్‌కు పిలిపిస్తే… వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కో విషయం చెప్పేసరికి విని విస్తుపోవడం కేటీఆర్‌ వంతయిందట. అంతా… మీరే చేశారని డైరెక్ట్‌గా అనకున్నా… అదే టోన్‌లో నియోజకవర్గ నాయకులు అధిష్టానం నిర్ణయాలను కూడా ప్రశ్నించినట్టు తెలిసింది. అభ్యర్థి ప్రకటన నుంచే తమని సైడ్ చేశారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారట జూబ్లీహిల్స్‌ నాయకులు, కార్యకర్తలు. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత ఏర్పాటు చేసిన సంతాప సభ నుంచే అసలు కథ మొదలైందని చెబుతున్నారు. అప్పుడు పెత్తనం మొదలుపెట్టిన బయటివాళ్ళు ఎన్నికలయ్యేదాకా అదే ఊపు కొనసాగించారని, వాళ్ళే సంతాప సభలు ఆర్గనైజ్ చేస్తున్నారు, పెత్తనం చేస్తున్నారు… ఇక మన అవసరం ఉండదని లోకల్ నాయకులు అనుకుని దూరం జరగడం నుంచే ఇబ్బంది మొదలైందని చెప్పుకొచ్చారు.

ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పార్టీ నియమించిన బూత్ ఇన్చార్జ్‌లు, క్లస్టర్, డివిజన్ ఇన్చార్జ్‌లు సైతం తమపై ఆధిపత్యం చేయడం మొదలుపెట్టారని, అలా బయటి నుంచి వచ్చిన వాళ్ళ పెత్తనం పెరిగిపోయిందని అదే దెబ్బకొట్టిందని చెప్పారట. గత్యంతరం లేక తాము కూడా వాళ్ళ వెనకే నడవాల్సి వచ్చిందని, దాంతో… ఏ దశలోనూ తమ వాయిస్‌ వినిపించకుండా పోయిందని జూబ్లీహిల్స్‌ బీఆర్‌ఎస్‌ లీడర్స్‌ కేటీఆర్‌కు సవివరంగా చెప్పినట్టు తెలిసింది. మునుగోడు, నాగార్జునసాగర్ ఫార్ములా అని చెప్పి… మొత్తం ఎమ్మెల్యేలను, మాజీ ఎమ్మెల్యే లని ఇక్కడికి దింపారని…..లోకల్‌ పల్స్‌ తెలియని వాళ్ళ ఆధిపత్యం కొనసాగి మొదటికే మోసం వచ్చిందన్నది జూబ్లీ గులాబీ నేతల ఆవేదన. సాధారణంగా…ఎన్నికలు వస్తే పండగ అనుకునే కార్యకర్తలకు జూబ్లీహిల్స్‌ మాత్రం పనిష్మెంట్‌లా మారిపోయిందని తమ గోడు చెబుతున్నారు. లోకల్‌గా ఏయే సమస్యలు ఉన్నాయో.. ఎవరిని పట్టుకుంటే ఓట్లు పడతాయో తమకు తెలుసని, కానీ రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం మాకే తెలుసన్నట్టుగా వ్యవహరించారని, దాని ఫలితమే ఈ ఓటమి అని వివరించినట్టు చెబుతున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన లీడర్స్‌, కేడర్‌ డామినేషన్ చేయడంతో తాము డమ్మీ అయిపోయామని కేటీఆర్‌కు చెప్పారట జూబ్లీహిల్స్‌ నాయకులు. పార్టీకి కచ్చితంగా లీడ్ వస్తుందనుకున్న వెంగళరావునగర్, బోరబండ డివిజన్స్‌లో కూడా దెబ్బతినడానికి అదే కారణమని రిపోర్ట్‌ ఇచ్చారట.

ఇక్కడ ఇంకో తేడాను కూడా వివరించారు. ఎన్నికల నోటిఫికేషన్ నుంచి ప్రచారం ముగిసే వరకు అంతా చూసిన రాష్ట్ర స్థాయి ఇన్చార్జ్‌లు ప్రచార గడువు ముగియగానే… ఒక్కసారిగా వెళ్ళిపోయేసరికి అసలు కథ బయటపడింది అంటున్నారు లోకల్ కార్యకర్తలు. పోల్ మేనేజ్‌మెంట్‌లో పూర్తిగా విఫలమవడానికి కారణం నాన్‌ లోకల్‌ లీడర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడమేనని రిపోర్టు ఇచ్చారు. తమకు తెలిసిన ఓటర్లను తాము కలవకుండా బయటి నుంచి వచ్చిన వాళ్ళు కలవడం వల్ల ప్రచారం ముగిశాక వాళ్ళ దగ్గరికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని అంటున్నారు. రోజూ గ్రౌండ్ లో తిరిగే తమ మాట వినకుండా ఎవరో చేశారని చెప్పిన సర్వేల మాట విని పట్టించుకోలేదంటూ కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారట. భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటే గెలవడం చాలా కష్టమని హెచ్చరిక స్వరంతో చెప్పినట్టు సమాచారం. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమి ఓ గుణపాఠం లాంటిదని మాట్లాడుకుంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు.

Exit mobile version