NTV Telugu Site icon

Off The Record : ఏపీలో మరోక రాజకీయ సంచలనానికి తెరలేవాబోతుందా..?

Ysrcp Otr

Ysrcp Otr

ఏపీలో మరో రాజకీయ సంచలనానికి తెరలేవబోతోందా…? ప్రతిపక్షానికి ఊహించని షాక్ తప్పదా…? ఓ ఎంపీ అధికార కూటమికి అందులోకి వెళ్ళారా? అంతా రెడీ… ఇక గేటు తోసుకుని లోపలికి వెళ్ళడమే మిగిలిందా? అపోజిషన్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు అధికారపక్షం అట్నుంచి నరుక్కొస్తోందా? ఆ ఎంపీ సైతం స్వామి భక్తికంటే సెల్ఫ్‌ రెస్పెక్టే ముఖ్యమని భావిస్తున్నారా? ఎవరాయన? ఏంటా కథ? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉందా? అంటే…. సంకేతాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఇప్పుడు పెద్దల సభల మీద ఫోకస్‌ పెట్టినట్టు తెలుస్తోంది. అటు రాజ్యసభ, ఇటు శాసన మండలిలో ఖాళీ అయిన ప్రతీ సీటును దక్కించుకోవడం ద్వారా ఎగువ సభల్లో బలం పెంచుకోవాలనేది కూటమి ప్లాన్‌గా తెలిసింది. ఈ క్రమంలో ఫస్ట్ చాన్స్ విశాఖ జిల్లా నుంచే వచ్చింది. త్వరలో జరగనున్న స్ధానిక సంస్ధల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది టీడీపీ. లోకల్ బాడీస్‌లో వైసీపీకి కావాల్సినంత బలం వుంది. అదే సమయంలో పార్టీ నాయకత్వంపై వ్యతిరేకత కొండత పెరిగింది. మారిన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గేటు దాటేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు చాలామందే రెడీ అయ్యారట. అదే సమయంలో జంపింగ్స్‌ కేవలం జిల్లాలకే పరిమితం కాలేదని, ఢిల్లీదాకా విస్తరించాయన్న ప్రచారం జరుగుతోంది. కోస్తాంధ్రకు చెందిన ఓ రాజ్య సభ ఎంపీ త్వరలోనే వైసీపీకి షాక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారన్నది అంతర్గత సమాచారం. అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆ నేత టీడీపీ ముఖ్యనాయకులతో టచ్‌లో ఉన్నట్టు వినికిడి. ప్రస్తుతం వైసీపీకి 11మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. అదే సమయంలో తెలుగుదేశం చరిత్రలో తొలిసారి…రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాన్ని బట్టి చూస్తే… ఖాళీ అయ్యే ప్రతి రాజ్యసభ సీటు ఎన్డీఏ ఖాతాలో పడిపోతుంది. కానీ.. అందుకోసం ఇంకో రెండేళ్ళు ఆగాల్సిందే. అందుకే ఈలోపు ఆపరేషన్‌ ఆకర్ష్‌కు తెరలేపాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఆ దిశగా తొలి అడుగు పడిందని, అందులో భాగంగానే కోస్తాకు చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి స్వరం మారిందని, వైసీపీ అధిష్టానం కూడా ఆ మార్పును గుర్తించినట్టు చెప్పుకుంటున్నారు.

దశాబ్దకాలానికి పైగా జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయానికి మద్దతుగా నిలిచిన ఆ ఎంపీ… మాజీ సీఎంకు వీరవిధేయుడనే ముద్ర వేసుకున్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేసి వైసీపీ బీ ఫామ్‌ మీద ఉప ఎన్నికల్లో గెలవడంతో ఆయన గుర్తింపు మరింత పెరిగింది. 2014లో సిట్టింగ్ సీటును ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు పార్టీ లైన్ దాట లేదు. 2019లో ఎమ్మెల్యే అయినా… నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వచ్చింది ఆయన. ఎమ్మెల్యేగా వున్నప్పుడు మంత్రులు, ఉత్తరాంధ్ర రీజనల్ కో ఆర్డినేటర్లు సైతం తన గోడు వినలేదని ఆయన ఆవేదన పడేవారట. ఈ విషయాలన్నిటినీ అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళినా… పెద్దగా పట్టించుకోకపోవడంతో… ఓ దశలో బరస్ట్ అయిపోయారు. రాజకీయాల కోసం సామంతుల దగ్గర సాగిలపడాల్సిన అవసరం లేదని, తాను యోధుడునని ప్రకటించి సంచలనం రేపారు. ఆ ధిక్కార స్వరం కారణంగా ఈసారి ఆయనకు ఎమ్మెల్యే టిక్కెట్‌ రాలేదని అనుకునే లోపే…అధినాయకత్వం అనూహ్యంగా రాజ్యసభకు పంపింది. అయితే ఈసారి కూడా పదవి దక్కినా పార్టీలో గౌరవ మర్యాదల విషయంలో మార్పు లేకపోవడంతో… ఎంపీలో అసహనం రెట్టించినట్టు సమాచారం. రాజ్యసభ ఎంపీని అయినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదన్న బాధతో ఆయన త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోబోతున్నారన్న గుసగుసలు వైసీపీలోనే మొదలయ్యాయట. పరిస్థితిని గమనించి అధిష్టానం బుజ్జగిస్తే… వేరే సంగతి. లేదంటే మాత్రం 2030 దాకా పదవీకాలం ఉన్న ఆ రాజ్యసభ సభ్యుడు టీడీపీకి దగ్గరవడం ఖాయమంటున్నారు. ఆయన సమీప బంధువు గతంలో టీడీపీ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ యాంగిల్‌ కూడా వర్కౌట్‌ కావచ్చంటున్నారు. అదే నిజమైతే…రాజకీయంగా ఇదో కీలక పరిణామం అనేది పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. నిప్పు లేకుండా పొగరాదంటారు. మరి ఇది నిప్పు రాజుకుని వచ్చిన పొగో లేక ఉత్తుత్తి గాసిప్పో త్వరలోనే తేలిపోతుంది.