NTV Telugu Site icon

Off The Record : బీజేపీతో తేల్చేసుకోవడానికి వైసీపీ సిద్దమైందా? ఏకంగా సుప్రీంకోర్టుకి వెల్లనుందా?

Ycp Otr

Ycp Otr

ఇక బీజేపీతో తేల్చుకోవడానికే వైసీపీ సిద్ధమైందా? ఆ పార్టీ విషయంలో ఇంకా మెతగ్గా ఉంటే… మొదటికే మోసం వస్తుందని భయపడుతోందా? వక్ఫ్‌ బిల్లు విషయంలో సుప్రీం కోర్ట్‌ తలుపు తట్టడానికి ఇంత ఆలస్యం ఎందుకు చేసింది ఫ్యాన్‌ పార్టీ? జరక్కూడనిదేదో జరిగిపోతోందని గుర్తించిందా? ఇంతకీ వైసీపీ భయం ఏంటి? ఆ పార్టీ యాక్షన్‌కి బీజేపీ రియాక్షన్‌ ఎలా ఉండబోతోంది?
ఆవిర్బావం నుంచి జాతీయ రాజకీయాల్లో న్యూట్రల్ స్టాండ్‌తోనే ఉన్న వైసీపీ… ఇంత వరకు ఏ కూటమిలో చేరలేదు. ఏపీలో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. అయితే బీజేపీ విషయంలో మొదట్నుంచి జగన్‌ది మెతక వైఖరేనన్న విమర్శలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఆయన కూడా 2019 ఎన్నికలలో గెలిచాక.. పార్లమెంట్‌లో అవసరమైన ప్రతి సందర్భంలోనూ మోడీ సర్కార్‌కు మద్దతిస్తూ వచ్చారు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి ఏపీలో టీడీపీ, జనసేనతో బీజేపీ కూటమి కట్టి అధికారం చేజిక్కించుకోవటంతో తన స్టాండ్ మార్చుకోవాల్సిన అనివార్య పరిస్థితులు వైసీపీకి కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో….పార్లమెంట్‌లో పాసైపోయి, రాష్ట్రపతి ఆమోదం కూడా తీసుకున్న వక్ఫ్ చట్టాన్ని… వైసీపీ ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో సవాల్ చేయడం చర్చనీయాంశం అయింది. వక్ఫ్ చట్టంలో ముస్లింలకు అభ్యంతరకరంగా ఉన్న పలు క్లాజుల్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలన్న వైసీపీ తాజా పిటిషన్‌ సారాంశం. ముస్లింల ఆందోళనలను పరిష్కరించడంలో వైఫల్యంతో పాటు రాజ్యాంగ ఉల్లంఘనలను తీవ్రంగా పరిగణించి వక్ఫ్ బిల్లును సవాలు చేస్తూ తాము సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని ఎక్స్‌లో మెసేజ్‌ పెట్టింది వైసీపీ. ఇప్పటికే వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఎంఐఎం, ఆప్‌తో పాటు తమిళనాడులో విజయ్, అలాగే పలు ముస్లిం సంస్ధలు సుప్రీం కోర్ట్‌లో పిటిషన్లు దాఖలు చేశాయి. వైసీపీ పిటిషన్‌ను కూడా వాటితో కలిపి విచారించే అవకాశం ఉందంటున్నారు న్యాయ నిపుణులు. అయితే… పిటిషన్‌ విషయంలో ఇంత తాత్సారం ఎందుకు? నిజంగానే చిత్తశుద్ధి ఉంటే… ఆ పార్టీ ఇన్ని రోజులు ఎందుకు ఆగింది? ఇప్పుడు కేవలం డ్యామేజ్‌ కంట్రోల్‌ కోసమే వైసీపీ సుప్రీం కోర్ట్‌ మెట్లు ఎక్కిందా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. వక్ఫ్‌ చట్ట సవరణ బిల్లుని తాము పార్లమెంట్‌ ఉభయ సభల్లో వ్యతిరేకించామని వైసీపీ పెద్దలు చెబుతున్నా… వివిధ వర్గాల్లో అనుమానాలు మాత్రం తొలిగిపోలేదు. రాజ్యసభలో ఎంపీలకు విప్ జారీ చేయలేదని జరిగిన ప్రచారాన్ని ఖండిస్తూ విప్‌ను బయటపెట్టాక కూడా చాలామందికి నమ్మకం కలగకపోగా… బీజేపీకి అనుకూలంగానే వ్యవహరించి ఉంటారని జరుగుతున్న ప్రచారం ఫ్యాన్‌ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తోందట. తమ మీద అనుమానాలు పెరిగేలా కూటమి పార్టీలు వ్యవహరించిన తీరుతో రావాల్సినంత మైలేజ్‌ రాలేదన్న అభిప్రాయం ఉందట వైసీపీలో.

ముస్లిం మైనార్టీల్లో వైసీపీకి స్టాండర్డ్‌ ఓట్‌ బ్యాంక్‌ ఉంటుంది. ఆ కారణంతోనే…. తమ కూటమిలో చేరాలని బీజేపీ ఆహ్వానించినా…సున్నితంగానేతిరస్కరిస్తూ వచ్చిందని అంటారు పరిశీలకులు. అయినాసరే…. గత ఎన్నికల్లో మైనారిటీలకు కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో కూడా ఫ్యాన్‌ పార్టీకి భంగపాటు తప్పలేదు. అదే సమయంలో బీజేపీతో పొత్తులో ఉన్నాసరే… పలుచోట్ల టీడీపీ ముస్లిం మైనారిటీలను ఆకర్షంచగలిగిందనే లెక్కలు ఉన్నాయి. ఈ క్రమంలో…తాజాగా వక్ఫ్‌ బిల్లు విషయంలో తమ నిబద్ధత మీదే అనుమానాలు వచ్చాయని, వాటిని దూరం చేసి ముస్లింలను మరింత దగ్గర చేసుకునేందుకే కాస్త ఆలస్యంగానైనా వైసీపీ సుప్రీం కోర్ట్‌కు వెళ్ళి ఉండవచ్చంటున్నారు పరిశీలకులు. ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకంగా కేంద్రం ఈ చట్టాన్ని తెచ్చిందని వైసీపీ తన పిటిషన్ లో పేర్కొనడాన్ని బట్టి చూస్తే… ఇక బీజేపీ మీద డైరెక్ట్ ఫైట్‌కే సిద్ధమైనట్టు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదే సమయంలో ముస్లిం మైనార్టీ ఓటర్లను తిరిగి తనవైపునకు తిప్పుకునే ఎత్తుగడగా కూడా అంచనా వేస్తున్నారు మరి కొందరు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో… బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లే ఉద్దేశ్యం లేకున్నా సరే…. తప్పనిసరి రాజకీయ అవసరాలు వైసీపీని సుప్రీంకోర్ట్‌ మెట్లు ఎక్కించి ఉండవచ్చన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. మరోవైపు వైసీపీని వీడిన కీలక నేత విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఆయన చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించి తిరిగి తమ పార్టీలోకి తీసుకోవాలనుకోవడం వెనక బీజేపీ పెద్దల వ్యూహం ఉండి ఉండవచ్చని అనుమానిస్తోంది వైసీపీ అధిష్టానం. అందుకే బీజేపీ కోసం ఇంకా సైలెంట్ గా ఉంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయానికి వైసీపీ పెద్దలు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు. డ్యామేజ్ కంట్రోల్ భాగంగా కాస్త ఆలస్యంగానైనా మేల్కొని ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయవర్గాల్లో. తాము ఇక బీజేపీకి వ్యతిరేకమేనని కుండబద్దలు కొట్టడంతో పాటు ఓటు బ్యాంక్ ని కాపాడుకునే వ్యూహంలో భాగంగానే వక్ఫ్‌ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పిటిషన్‌ వేసి ఉంచవచ్చన్నది ఎక్కువగా వినిపిస్తున్న మాట. వైసీపీ యాక్షన్ కు బీజేపీ రియాక్షన్ ఎలా ఉండబోతోందన్న చూడాలంటున్నారు పొలిటికల్‌ పరిశీలకులు.