NTV Telugu Site icon

Off The Record : ఆ TDP సీనియర్ నేత కెరీర్ కు ఇక ఎండ్ కార్డు పడినట్టేనా?

Yanamala Ramakrishnudu

Yanamala Ramakrishnudu

ఆ టీడీపీ సీనియర్‌ పొలిటికల్‌ కెరీర్‌కు ఇక ఎండ్‌ కార్డ్‌ పడ్డట్టేనా? ఇష్టం లేకుండానే పార్టీ ఆయనకు వీఆర్‌ఎస్‌ ఇచ్చేసిందా? ఒకప్పుడు నంబర్‌ టూ అనుకున్న నేతకు అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకే ఒక్క ఛాన్స్‌… లాస్ట్‌ ఛాన్స్‌… ప్లీజ్‌… అని ఆయన అంటున్నా… కనీసం పరిగణనలోకి ఎందుకు తీసుకోవడం లేదు? బలవంతపు రిటైర్‌మెంట్‌ తీసుకోవాల్సి వచ్చిన ఆ సూపర్‌ సీనియర్‌ ఎవరు? ఇప్పటికీ ఆయన కుటుంబంలో ఎన్ని పదవులు ఉన్నాయి?

యనమల రామకృష్ణుడు… టిడిపి సీనియర్ లీడర్‌.. పార్టీ ఆవిర్భావం నుంచి అందులోనే ఉన్నారాయన. ఆరు సార్లు తుని నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో తొలిసారి ఓటమి తర్వాత తాను ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, అసెంబ్లీ స్పీకర్ గా కీలక పదవులు నిర్వర్తించారు యనమల. ప్రత్యక్ష ఎన్నికలకు దూరమయ్యాక ఎమ్మెల్సీగా, మండలిలో ప్రతిపక్ష నేతగా అవకాశం ఇచ్చింది పార్టీ. అయితే.. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చాక తొలిసారి యనమల లేకుండా రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటైంది. ఆ ఒక్కసారి ఛాన్స్‌ ఇవ్వనందుకే… పార్టీకి వీర విధేయుడుగా ఉంటున్న రామకృష్ణుడికి, అధిష్టానానికి గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరుగుతోంది.యువత రాజకీయాల్లోకి రావాలని, కొత్త రక్తానికి అవకాశం ఇవ్వాలని గత ఎన్నికలకు ముందు ప్రకటించారు రామకృష్ణుడు. దానికి అనుగుణంగానే తుని నుంచి ఆయన పెద్ద కూతురు దివ్యకు సీటు ఇచ్చింది టిడిపి అధిష్టానం. ఆమె గెలిచాక విప్ గా బాధ్యతలు అప్పగించింది. చిన్నల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. వియ్యంకుడు సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యే. ఇలా టిడిపిలో చంద్రబాబు ఫ్యామిలీ తర్వాత అన్ని పదవులు ఉన్నది యనమల కుటుంబానికే.

ప్రస్తుతం ఆయనకున్న ఎమ్మెల్సీ పదవీకాలం వచ్చే నెల 27తో ముగిస్తుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఆయనకు మరొకసారి ఎమ్మెల్సీ పదవి ఇచ్చే ఉద్దేశం పార్టీకి లేదనట్లు క్లారిటీగా తెలిసిపోతోంది. కనీసం ఆయన పేరుని కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదట పార్టీ పెద్దలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తూ లేఖలు రాయడం మొదలుపెట్టారు యనమల. సీఎంని డైరెక్ట్ గా వెళ్లి కలిసి చెప్పే అవకాశం ఉన్నప్పటికీ బహిరంగంగా వర్తమానాలు పంపించడం ఏంటన్న చర్చ జరుగుతోంది టీడీపీలో. గతంలో ఎప్పుడూ లేనివిధంగా బీసీ రైతులకు అన్యాయం జరుగుతోందంటూ.. తొలిసారి క్యాస్ట్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడారాయన. ఒకప్పుడు కులానికి, తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించే రామకృష్ణుడు కొత్త పల్లవి అందుకోవడంతో… ఏదో తేడా కొడుతోందన్న టాక్‌ అప్పటి నుంచే మొదలైంది. ఆ తర్వాతి నుంచి పార్టీ ముఖ్య నేతల అపాయింట్మెంట్ కూడా యనమలకు దొరకడం లేదట. తాను ఒక్కసారైనా రాజ్యసభకు వెళ్లాలని గతంలోనే ప్రకటించారు ఈ మాజీ స్పీకర్‌. కానీ ఇక ఆ అవకాశం కూడా లేదన్నది పార్టీ నేతల అభిప్రాయం.. ఇక ఎన్ని దశాబ్దాలు రాజకీయాలు చేస్తారు? పరిస్థితులకు తగ్గట్లుగా మనం కూడా మారాలని, మీ కుటుంబంలో తర్వాత తరానికి పార్టీలో సముచిత స్థానం ఇచ్చినప్పుడు మీరు ఇప్పటికీ పల్లకిలోనే కూర్చుంటామంటే ఎలాగని యనమలను ప్రశ్నిస్తున్నారట టీడీపీ నాయకులు. తుని మున్సిపాలిటీలో తన పట్టు నిలుపుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి ఆఖరికి సక్సెస్ అయ్యారు రామకృష్ణుడు. తాను పాత తరం నాయకుడిని అయినప్పటికీ ఇప్పటి రాజకీయాలు ఎలా చేయాలో తెలుసునని పార్టీకి చెప్పే ప్రయత్నం చేశారు. అయినా అధిష్టానం మాత్రం ఈ వ్యవహారంలో ఒక నిర్ణయానికి వచ్చేసిందట. పదవుల పరంగా ఇక యనమల ఏమీ ఆశించకూడదని, అలాగే మాకు ఇచ్చే ఆలోచన లేదని క్లియర్ కట్ గా చెప్పేసినట్టు తెలిసింది. ఏదన్నా ఉంటే… తుని వరకే పరిమితం అవ్వడం తప్ప అంతకుమించి వ్యవహారాలలోకి ఇన్వాల్వ్ అవ్వొద్దని, ఒకవేళ మీరు అవుదామని అనుకున్నా… సలహాలు తీసుకునే ఉద్దేశం మాకు లేదని అంటున్నారట టీడీపీ ముఖ్యులు. ఈ పరిణామాలతో మొత్తానికి రామకృష్ణుడు పొలిటికల్ కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడ్డట్టేనన్న చర్చ జరుగుతోంది. ఇష్టం ఉన్నా… లేకున్నా…. మీరు మాత్రం వీఆర్ఎస్‌ తీసేసుకోవాల్సిందేనని క్లారిటీ ఇచ్చేసింది పార్టీ. భవిష్యత్తులో కూడా ఏ పదవులలో కనీసం పరిగణనలోకి తీసుకునే ఉద్దేశ్యం లేదని తేలిపోవడంతో…ఇక సైలెంట్‌గా సైడైపోవడం మినహా ఈ సీనియర్‌ లీడర్‌కి మరో గత్యంతరం లేదన్నది టీడీపీ ఇన్నర్‌ వాయిస్‌.