NTV Telugu Site icon

Off The Record : జస్ట్‌.. అలా వెళ్లి.. ఇలా ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారు..

Vijayashanti Otr

Vijayashanti Otr

మాటల్లేవ్‌…. మాట్లాడుకోవడాల్లేవ్‌….. ముందస్తు చర్చలు అసలే లేవ్‌….. జస్ట్‌…అలా వెళ్ళారు… ఇలా ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారు. టోటల్‌గా… ఒక్క రోజు, ఒకే ఒక్క రోజులో విజయశాంతి అభ్యర్థిత్వం ఖరారైపోయింది. ఆఖరి నిమిషం వరకు సీఎం, పీసీసీ చీఫ్‌ సహా… తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవ్వరికీ ఈ విషయం తెలియదు. ఇంతకీ ఏం మ్యాజిక్‌ చేశారామె? ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఎట్నుంచి నరుక్కొచ్చారు? తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏం జరిగిందో రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. మిగతా వాళ్ళందరి సంగతి ఒక ఎత్తయితే… విజయశాంతి విషయంలో మాత్రం ఏం జరిగిందో ఎవ్వరికీ అర్థంగాక జుట్టు పీక్కుంటున్నారట. ఆమె మొదట్నుంచి రేస్‌లో లేరు. ఆశావహుల లిస్ట్‌లో ప్రచారం జరగలేదు. కానీ… అనూహ్యంగా తెర మీదికి వచ్చారు. ఇదెలా? ఎవరి కోటాలో… ఎవరి ద్వారా… విజయశాంతి ఎమ్మెల్సీగా నామినేషన్‌ వేశారంటూ తెల ఆరాలు తీసేస్తున్నారట కాంగ్రెస్‌ నాయకులు. ఇంకాస్త లోతుల్లోకి వెళ్ళిన వారికి మాత్రం కొత్త కొత్త విషయాలు తెలుస్తూ… ఔరా అని ముక్కున వేలేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల కసరత్తు మొదలవ్వగానే… హస్తినకు వెళ్ళారట విజయశాంతి. నేరుగా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేని కలిసి మనసులో మాటల చెప్పినట్టు తెలిసింది. అలాగే వెంటనే రాహుల్ గాంధీ అప్పాయింట్ మెంట్ కూడా దొరికేసిందట. ఇదంతా…. కేవలం ఒకే ఒక్క రోజులో జరిగిపోయినట్టు చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. ఈ విషయం తెలిసిన ఓ సీనియర్ మంత్రి సైతం…. రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్‌ ఏంటి….? గంటలో దొరకడం ఏంటంటూ… నోరెళ్ళబెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా విజయశాంతి…ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు వెనక… ఏఐసీసీ నేతలు ఉన్నట్టు సమాచారం. ఆమె పార్టీలో చేరినప్పుడు తెలంగాణ ఇన్చార్జిగా థాక్రే ఉన్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని అప్పట్లోనే ఆయన హామీ ఇచ్చారట. నాడు తానిచ్చిన మాట ప్రకారం ఇప్పుడు విజయశాంతికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాల్సిందేనని థాక్రే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే మీద ఒత్తిడి పెంచారట. ఆమెకు రాహుల్‌ అపాయింట్మెంట్ కూడా ఖర్గే నుంచే ఖరారైందన్నది పార్టీలో ఇన్‌సైడ్‌ టాక్.

అలా….. ఎవ్వరూ ఊహించని విధంగా విజయశాంతికి ఏఐసీసీ కోటాలో ఎమ్మెల్సీ సీటు దక్కినట్టు చెప్పుకుంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి నుంచి అభిప్రాయ సేకరణ సందర్భంగా అసలు విజయశాంతి పేరే ప్రస్తావనలో లేదట. కానీ… అభ్యర్ధుల జాబితా ఫైనల్ అయ్యే సమయంలో ఖర్గే నివాసంలో కేసి వేణుగోపాల్ ఉన్నారని, ఆ సమావేశం నుంచే… పీసీసీ అధ్యక్షుడికి, సిఎంకి సమాచారం ఇచ్చారట. ఇది హైకమాండ్ నిర్ణయం అని చెప్పడంతో…ఇద్దరు నాయకులు కూడా చేసేదేంలేక ఓకే అనేసినట్టు తెలిసింది. ఐతే ఇదే సమయంలో ఇంకో చర్చ జరుగుతోంది కాంగ్రెస్‌ వర్గాల్లో. పార్టీలో చాలా కాలంగా పని చేస్తున్న వారికి, పాత వారికి ప్రాధాన్యత ఇస్తామంటూ… పిసిసి చీఫ్ మహేష్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ చెప్పిన మాటలు నీటి మూటలేనా అన్నది ఇప్పుడు పార్టీలో ఎక్కువ మంది ప్రశ్న. అసంతృప్తులు ఈ విషయాన్ని బహిరంగంగానే అడుగుతున్నారట. ఇక అంతా అయిపోయింది. చేసేదేం లేకపోవడంతో… బీసీ కోటా, మహిళా కోటా అంటూ సర్దిచెప్పుకుని సంతృప్తి పడటం తెలంగాణ కాంగ్రెస్‌ నేతల వంతవుతోందట. ఈ పరిణామ క్రమంలో… తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ కోసం సిఎం రేవంత్, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్..మంత్రులు అంతా సీఎల్పీకి చేరుకున్నాక విజయశాంతి తన ఇంటి నుండి బయలుదేరారు. దాంతో అందరూ అరగంటకు పైగా ఆమె కోసం ఎదురు చూడాల్సి వచ్చిందట. నామినేషన్ కోసం సీఎల్పీ నుంచి బయటకు వచ్చాకా..చివర్లో జాయిన్‌ అయ్యారామె. ఏదైనా విజయశాంతి ఇచ్చిన షాక్ నుండి తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చంటున్నారు పరిశీలకులు.