గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఏదో… కేసు పెట్టామంటే పెట్టామన్నట్టుగా కాకుండా… రెడ్ బుక్ రేంజ్‌లో ఆయన్ని బుక్ చేసే వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? ఆయన ముఖ్య అనుచరుల మీద తాజా కేసులు, కొన్ని అరెస్ట్‌లే అందుకు సంకేతాలా? నియోజకవర్గానికి దూరంగా ఇప్పుడు వంశీ ఏం చేస్తున్నారు? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగించటానికి రంగం సిద్ధమవుతోందట. ఓ పద్ధతి ప్రకారం తప్పుల్ని ఎస్టాబ్లిష్ చేసే కార్యక్రమం జరుగుతోందని అంటున్నారు. టీడీపీ తరపున రెండు సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ… మూడోసారి వైసీపీ బీఫాం మీద పోటీ చేసి ఓడిపోయారు. రెండోసారి…. అంటే 2019లో టీడీపీ బీ ఫామ్ మీదే గెలిచి తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి జైకొట్టారాయన. ఆ తర్వాత ఐదేళ్ళ పాటు చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర స్థాయి విమర్శలు చేశారు వంశీ. ఒక దశలో అవి శృతిమించి… అవతలి వాళ్ళు భరించలేనంత వ్యక్తిగత వ్యవహారాల దాకా వెళ్ళాయి. నోటికి అదుపు లేకుండా పోయి… మాటలు మరీ దిగజారిన క్రమంలో టీడీపీ హిట్ లిస్ట్‌లో చేరారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే. దీంతో ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే…. టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున విజయవాడలో ఉన్న వంశీ ఇంటికి వెళ్ళి దాడికి ప్రయత్నించారు. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిందా ఘటన. ఆ తర్వాత నుంచి గన్నవరం నియోజకవర్గానికి దూరమయ్యారట వల్లభనేని. అప్పట్నుంచి లోకల్‌గా ఎక్కడా కనిపించలేదని అంటున్నారు ఆయన సన్నిహితులు సైతం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత వంశీపై కేసు బుక్ చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో నిందితుడిగా ఆయన పేరును చేర్చడంతోపాటు…. మరి కొందరు అనుచరుల్ని కూడా బుక్ చేశారు.
ఇక తాజాగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలో తొలిసారి అధికారులతో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించారు. అందులో కూడా వంశీ అనుచరులపై భారీగా ఫిర్యాదులు అందాయట. మట్టి తవ్వకాల్లో అక్రమాలు, ఎస్సీల భూముల ఆక్రమణ, నకిలీ పత్రాలతో ఇతరుల భూములు రిజిస్ట్రేన్స్ చేయించుకోడం లాంటి రకరకాల ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు వాటన్నిటినీ… పరిశీలించి కేసులు నమోదు చేయటానికి అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇకపై వంశీతోపాటు ఆయన అనుచరులపై కూడా వరుస కేసులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. తన ఇంటి మీద దాడి ప్రయత్నం జరిగినప్పటి నుంచి అందుబాటులో లేరు మాజీ ఎమ్మెల్యే. నియోజకవర్గానికి దూరంగా ఉంటూనే… తన అనుచరులపై వరుసగా కేసులు నమోదవటం, కొందరు అరెస్ట్ అవడం లాంటి పరిణామాలను తెలుసుకుంటున్నారట. అలాగే తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరితో తరచూ మాట్లాడుతూ… స్థానిక పరిస్థితుల మీద అవగాహనకు వస్తున్నట్టు తెలుస్తోంది. నెల రోజుల్లో తాను తిరిగి గన్నవరం వస్తానని, ఆందోళన చెందవద్దని క్యాడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ… ఆ మాటలు వారిలో ధైర్యం నింపలేకపోతున్నట్టు సమాచారం. తమ నాయకుడు ఎంత చెబుతున్నా…వాళ్ళు మాత్రం డీలా పడుతున్నారన్నది లోకల్ టాక్. ఎప్పుడు ఏ కేసు పెడతారా అన్న ఆందోళన పెరుగుతోందట గన్నవరంలోని వంశీ అనుచరుల్లో. అదే సమయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, పక్కా సాక్ష్యాధారాలతో నేరుగా వంశీ చుట్టూనే ఉచ్చు బిగిస్తోందన్న వార్తలు వాళ్ళని ఇంకా కలవరపెడుతున్నాయట. దీంతో రాబోయే రోజుల్లో గన్నవరం రాజకీయం యమ ఘాటుగా మారే అవకాశం గట్టిగానే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.