Site icon NTV Telugu

AP News : దేవాదాయశాఖ ఉద్యోగుల బదిలీలు కూటమిలో కుంపట్లు పెట్టాయా..?

Ap

Ap

దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీలు అక్కడ కూటమిలో కుంపట్లు పెట్టాయా? మా మాటకు విలువే లేకుండా పోయిందని జనసేన, బీజేపీ శాసనసభ్యులు రగిలిపోతున్నారా? కేవలం టీడీపీ అనుకూలురకే మేళ్ళు జరిగాయన్నది నిజమేనా? లక్షలకు లక్షలు చేతులు మారాయన్న ఆరోపణలు ఎందుకు వచ్చాయి? అసలా బదిలీల బాగోతం ఏంటి? ఎక్కడ జరిగింది? ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీలు… కూటమిలో చిచ్చు రేపుతున్నాయట. తమ సిఫారసు లేఖలను అస్సలు పట్టించుకోవండ లేదంటూ…. జిల్లాకు చెందిన జనసేన ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఏం…. మేం ప్రజాప్రతినిధులం కాదా? మా లెటర్స్‌కు విలువే లేదా అంటూ… చాలా ఫీలైపోతున్నారట గ్లాస్‌ పార్టీ శాసనసభ్యులు. అటు బీజేపీ సిఫారసుల పరిస్థితి కూడా అలాదే ఉంటడంతో… రెండు వైపులా మండుతున్నట్టు తెలుస్తోంది. అలా ఎందుకు జరుగుతోంది… చివరికి మిత్రపక్షాల ఎమ్మెల్యేల లెటర్స్‌కే విలువలేకుండా పోతోంది ఎందుకని అంటే….. అంతా…. మనీ మాయ అన్నది కొందరి సమాధానం. దేవాదాయ శాఖ ఉద్యోగుల బదిలీల్లో భారీగా ముడుపులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదాయం వచ్చే దేవాదాయాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో… అక్కడ పోస్టింగ్స్‌ కోసం భారీగా ముడుపులు ముట్టజెపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గోదావరి పుష్కరాలు రాబోతున్నందున ప్రాధాన్యత కలిగిన దేవాలయాల మీద ఎక్కువగా ఫోకస్‌ పెట్టారట ఉద్యోగులు. అక్కడికి బదిలీల కోసం లక్షల్లో ముడుపులు ముట్టజెప్పారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి జిల్లాలో.

డబ్బు పెట్టినోళ్ళకి పెట్టినంత పోస్ట్‌ అంటూ… చివరికి దేవాదాయ శాఖ ఉద్యోగులే మాట్లాడుకుంటున్నారట. ఈ క్రమంలోనే…. టీడీపీ ఎమ్మెల్యేలు తప్ప… మిత్రపక్షాల ప్రజాప్రతినిధులు ఇచ్చిన సిఫార్సు లేఖలకు విలువ లేకుండా పోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే….కోరుకున్న చోట పోస్టింగ్స్‌ ఇచ్చారంటూ బాహాటంగానే చెప్పుకుంటున్నారట. అర్హత లేనివారికి కూడా ప్రాంతాలు, ప్రాధాన్యతలు అంటూ…పెద్ద ఆలయాల్లో పోస్టింగ్ ఇచ్చినట్టు ప్రచారం ఉంది. కొన్ని దేవాలయాల్లో అర్హత లేని వారిని ఇన్ఛార్జ్‌ హోదాలో నియమించి ఒక్కొక్కరికి పది నుంచి 15 ఆలయాలు అప్పగించినట్టు ఈవో స్థాయి అధికారులే ఆరోపిస్తున్నారు. పైరవీలు చేసుకున్నవాళ్ళకి మంచి పోస్ట్‌లు ఇచ్చి… లేని వాళ్ళకు అర్హతలున్నా… ప్రాధాన్యత లేని చోట పడేశారన్న ఆవేదన వ్యక్తం అవుతోందట శాఖలో. కోనసీమకు చెందిన ఒక ఈఓ ఈ బదిలీల్లో చక్రం తిప్పినట్టు సమాచారం. ఇక కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది విషయంలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందంటున్నారు.

ఒకే బిల్డింగ్‌లో కింది ఫ్లోర్‌లో పనిచేస్తున్న వారిని పై ఫ్లోర్ కి, పై ఫ్లోర్లో పని చేస్తున్న వారిని కిందికి బదిలీ చేసిన లీలలు చాలానే ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఏళ్ల తరబడి వారు ఒకే కార్యాలయంలో పనిచేస్తున్నా… కదల్చలేకపోతున్నారన్నది డిపార్ట్‌మెంట్‌ టాక్‌. ఐదేళ్లు ఒకేచోట పని చేసిన వారిని కచ్చితంగా బదిలీ చేయాలన్న నిబంధన ఉంది. కానీ ఏసీ, డీసీ, ఆర్‌జేసీ కార్యాలయాలలో పనిచేసే సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్ల బదిలీల్లో భారీగా ముడుపులు తీసుకుని నిబంధనలు పక్కన పెట్టేశారని సిబ్బందే ఆరోపిస్తున్నారు. ఏళ్ళ తరబడి ఒకే ఆఫీస్‌లో పాతుకుపోయిన వాళ్ళ ద్వారా ముడుపులు వస్తాయన్న ఆశతో ఉన్నతాధికారులు కూడా వారిపై కనికరం చూపినట్టు టాక్‌ నడుస్తోంది. రాజమండ్రిలో ఓ దేవాలయానికి ఎనిమిది నెలలు మాత్రమే పనిచేసిన ఈవోను తాజాగా బదిలీ చేశారు. తనకు ఎలాంటి సిఫార్సులు లేకపోవడంవల్లే ఇలా జరిగిందంటూ వాపోతున్నారట ఆయన. మొత్తం మీద దేవాదాయ శాఖ బదిలీలు చిత్ర విచిత్రంగా జరిగాయని అధికారులు అందరూ అంగీకరిస్తున్నారటే ముడుపులు ఏ స్థాయిలో చేతులు మారాయో అర్ధం చేసుకోవచ్చంటున్నారు డిపార్ట్‌మెంట్‌లోని కొందరు ఉద్యోగులు.

Exit mobile version