NTV Telugu Site icon

Off The Record : వైఎస్‌ జగన్‌ను విమర్శించడానికి మంత్రులు ఎందుకు వెనకాడుతున్నారు..?

Tdp Leaders

Tdp Leaders

వైసీపీ అధ్యక్షుడు జగన్‌ని విమర్శించడానికి ఏపీ మంత్రులు ఎక్కువ మంది వెనకాడుతున్నారా? ఆయన ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా… వీళ్ళు దీటుగా కౌంటర్స్‌ వేయలేకపోతున్నారా? ఇద్దరు ముగ్గురు మినహా మిగతా వాళ్ళంతా ఎందుకు స్పందించడం లేదు? వాళ్ళ వెనకడుగు వెనకున్న రీజనేంటి? ఆ విషయమై టీడీపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మెల్లిగా దూకుడు పెంచుతున్నారు. ప్రభుత్వం మీద విమర్శల వాడి పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అనంతపురం జిల్లాలో ఆయన చేసిన కామెంట్స్‌ మీద రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ హాట్‌ చర్చ జరుగుతోంది. ఇలాగే ఉంటే… పోలీసుల బట్టలూడదీస్తాం అంటూ జగన్‌ అన్న మాటలపై టీడీపీతో పాటు మరికొన్ని రాజకీయ పక్షాలు, పోలీస్‌ సంఘాలు రియాక్ట్‌ అవుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి మాటల్ని తప్పుపడుతున్నారు చాలా మంది. రాష్ట్ర మంత్రులు కూడా కొందరు రియాక్ట్‌ అవుతున్నారు. ఆ.. కొందరు… అన్న దగ్గరే అసలు తేడా కొడుతోందట. మామూలుగా అయితే…. ఇప్పుడున్న పరిస్థితుల్లో… ప్రతిపక్ష నేత అన్న మాటల మీద కేబినెట్‌ మొత్తం మూకుమ్మడిగా విరుచుకుపడాల్సిందని, అలా కాకుండా కొందరి దగ్గరే మేటర్‌ ఆగిందంటే… ఎక్కడో తేడా కొడుతున్నట్టేకదా… అని అంటున్నారు పరిశీలకులు. హోం మంత్రి, ఇంకో ఇద్దరు మాత్రమే రియాక్ట్‌ అయ్యారని, సీనియర్‌ మినిస్టర్స్‌ సైతం కామ్‌గా…..అసలది మన సబ్జెక్ట్‌ కాదన్నట్టుగా ఉండటాన్ని ప్రత్యేకంగానే చూడాలన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట ఎక్కువ మందిలో. ఈ మౌనం వెనక రకరకాల అర్ధాల్ని వెదకాల్సి ఉంటుందని కూడా అంటున్నారు పరిశీలకులు. సీనియర్స్‌ ఎవరికి వారు వ్యూహాత్మకంగా వ్యవహరించి కావాలనే కామైపోయి ఉంటారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్‌ వ్యాఖ్యలపై స్పందిస్తే…. భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉంటాయో, ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఎట్నుంచి ఎటు వెళ్తాయో… ఎందుకొచ్చిన గొడవ… చుట్టం చెడకుండా, బియ్యం చెడకుండా అన్నట్టుగా వ్యవహరిస్తే పోలా అనుకునే బాపతే ఎక్కువగా ఉన్నారట కేబినెట్‌లో. ప్రభుత్వాలు మారటం అన్నది రొటీన్‌ ప్రక్రియ కాబట్టి… ఇప్పుడు ఏదో మాట్లాడేద్దామనుకుని వోవర్‌గా రియాక్ట్‌ అయిపోయి నోరు పారేసుకుంటే… తర్వాత ఇతరత్రా అవకాశాలు వచ్చినప్పుడో, సమస్యలు ఎదురైనప్పుడో పశ్చాత్తాప పడాల్సి వస్తుందన్నది సీనియర్‌ మినిస్టర్స్‌ ఆలోచనగా ప్రచారం జరుగుతోంది. అందుకే పెద్దగా రియాక్ట్‌ అయి ఉండకపోవచ్చంటున్నారు. జనానికి కోపం వస్తే… ఏ పార్టీనైనా కూకటివేళ్ళతో సహా పెకిలించి పక్కన పడేయడానికి వెనుకాడరు. నిన్నటికి నిన్న వైసీపీనే అందుకు ఉదాహరణ. అధికారం శాశ్వతం కాదు అనేది రొటీన్ డైలాగే అయినా …. అది పచ్చి నిజం కూడా.

ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే… ఎవరి జాగ్రత్తల్లో వారు ఉంటూ తప్పించుకు తిరుగువాడు ధన్యుడన్న సుమతీ శతక పద్యాన్ని గుర్తు చేసుకుంటారన్నది ఏపీ పొలిటికల్‌ టాక్‌. ఇప్పుడు అనవసరంగా విమర్శలు చేస్తే రేపు లేనిపోని ఇబ్బందులు వస్తాయన్నదే వాళ్ళ ఆలోచనగా తెలుస్తోంది. కేవలం మంత్రులే కాదు…. పార్టీ సీనియర్‌ లీడర్స్‌ యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పత్తిపాటి పుల్లారావు, ధూళిపాళ్ళ నరేంద్ర లాంటి వాళ్ళు కూడా ముందుకువచ్చి జగన్‌ను ఏకిపారేయాలన్నంత కసిగా ఏం లేరట. వీళ్ళంతా అవకాశాల కోసం కాకున్నా…. టీడీపీ పరంగా తమకు దక్కుతున్న ప్రాధాన్యత, ఆశలు, అసంతృప్తుల వంటి రకరకాల కారణాలతో కామ్‌గా అయిపోయి ఉండవచ్చంటున్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంటి కాలి మీద లేచి నోరు చేసుకునేవాళ్ళు 30దాకా ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మీద మాట్లాడ్డానికి టీడీపీ నాయకులు వేళ్ళ మీద లెక్కపెట్టుకునే స్థాయిలోనే ఉన్నారట. వైసీపీకి మళ్ళీ అధికారం వస్తుందేమో…అదే జరిగితే అప్పుడు మనం టార్గెట్‌ అవుతామేమో…. ఎందుకొచ్చిన గొడవ? గమ్ముగా మనపని మనం చేసుకుంటే పోలా అన్నది ఎక్కువ మంది మంత్రులు, టీడీపీ లీడర్స్‌ వైఖరిగా తెలుస్తోంది. వైసీపీని గట్టిగా టార్గెట్‌ చేయడం లేదని సీఎం చంద్రబాబు ఒకటికి నాలుగు సార్లు చెబుతున్నా…మంత్రులు, పార్టీ లీడర్స్‌ తీరు మాత్రం మారడం లేదంటున్నారు.