NTV Telugu Site icon

Off The Record : టీడీపీని ఇప్పుడు కొత్తగా వెంటాడుతున్న భయం ఏంటి..?

Tbjp Otr

Tbjp Otr

తెలుగుదేశం పార్టీని ఇప్పుడు సరికొత్త భయం వెంటాడుతోందా? పొత్తులో భాగంగా ఇప్పటికే సీట్లు వదిలేసుకున్న సైకిల్‌ పార్టీకి తాజాగా మరో రూపంలో ముప్పు ముంచుకు వస్తోందా? ఆ ముప్పును వైసీపీ ఇంకాస్త ఎగదోస్తోందన్న వాదనలో నిజమెంత? అది ఎక్కడికి దారి తీస్తుందోనని పార్టీ పెద్దలు ఆందోళన పడుతున్నారన్నది నిజమేనా? అసలింతకీ ఏంటా ముప్పు? టీడీపీ అధిష్టానం ఆందోళనకు కారణాలేంటి? అభ్యర్థుల లిస్ట్‌ని పూర్తిగా ప్రకటించేసింది టీడీపీ. అన్ని రకాలుగా వడపోసి.. సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని.. రకరకాల లెక్కలుకట్టిమరీ.. తాము పోటీ చేస్తున్న 144 అసెంబ్లీ స్థానాలకు.. 17 ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించేసింది. ఈ క్రమంలో కొన్ని సెగ్మెంట్లల్లో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. పార్టీ ప్రకటించిన అభ్యర్థిత్వాలను వ్యతిరేకిస్తూ.. రెబెల్స్‌గా రంగంలోకి దిగేందుకు సిద్దపడుతున్నారు కొందరు నేతలు. అయితే.. పలకరింపులు, బుజ్జగింపుల తర్వాత ఫైనల్‌గా వీరిలో ఎంత మంది ఇండిపెండెంట్లుగా రంగంలో ఉంటారు..? వారి ప్రభావం ఏ మేరకు ఉంటుంది..? అన్న చర్చ జోరుగా జరుగుతోంది పార్టీలో. చీపురుపల్లి, అనపర్తి, నూజివీడు, ఉండి వంటి సెగ్మెంటల్లో ఇండిపెండెంట్ల బెడద తప్పేలా కన్పించడం లేదన్నది పార్టీ వర్గాల సమాచారం. చీపురుపల్లి నుంచి టిక్కెట్ ఆశించిన కిమిడి నాగార్జున రెబెల్‌గా రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం. ఆ స్థానం నుంచి కిమిడి కళా వెంకట్రావు పేరును ప్రకటించింది టీడీపీ. మంత్రి బొత్స సత్యనారాయణకు ప్రత్యర్థిగా కళా వెంకట్రావు అయితే బాగుంటుందనే భావనతో పార్టీ పెద్దలు ఆయన పేరును ఖరారు చేసినట్టు తెలిసింది. దీంతో ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశించిన కిమిడి నాగార్జున వర్గీయులు భగ్గమన్నారు. రాజీనామాల బాట పట్టారు.

ఈ క్రమంలో నాగార్జున స్వతంత్రంగా బరిలోకి దిగుతారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇక అనపర్తి సెగ్మెంట్ కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతోంది కేడర్‌. అనపర్తి సెగ్మెంట్ నుంచి టిక్కెట్ ఖరారు చేసినా.. పొత్తుల్లో భాగంగా ఆ స్థానం బీజేపీకి వెళ్లింది. దీంతో అక్కడి నుంచి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఒత్తిడి ఎక్కువగా వస్తోంది. పార్టీ అధిష్టానం నల్లమిల్లికి నచ్చచెప్పినా.. ఎంత వరకు ఈ వ్యవహరం సెట్ అవుతుందోనన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఇక నూజివీడు నుంచి టిక్కెట్ దక్కించుకోలేకపోయిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు.. క్షేత్ర స్థాయిలో చాప కింద నీరులా తన పని తాను చక్కబెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. ఉండి సెగ్మెంట్ నుంచి కలవపూడి శివ స్వతంత్రంగా పోటీ చేసే పరిస్థితి కన్పిస్తోంది. దీంతోపాటు గుంతకల్లు, అనంత అర్బన్ వంటి స్థానాల్లో కూడా రెబెల్స్ బెడద తప్పదన్న మాటలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో మారో అంశం గురించి కూడా చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీలో వీలైనంత ఎక్కువగా అసమ్మతిని ప్రోత్సహించి లబ్ది పొందేందుకు వైసీపీ కాచుకుని కూర్చుందని, ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవచ్చని అంటున్నారు. ఇప్పుడు రెబెల్స్‌గా ప్రచారంలో ఉన్నవారిలో ఎంత మంది వైసీపీ ట్రాప్‌లో పడతారో తెలియదుగానీ… మొత్తానికి అటువైపు నుంచి ప్రయత్నాలు మాత్రం గట్టిగానే జరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో రెబెల్స్ వ్యవహారాన్ని వీలైనంత త్వరగా సెట్‌ చేసుకోకుంటే…టీడీపీకి భారీ డ్యామేజ్‌ తప్పదన్న అంచనాలున్నాయి. మరి బతిమాలో బామాలో టీడీపీ అధిష్టానం దారికి తెచ్చుకుంటుందా లేక రెబెల్స్‌దే పైచేయి అవుతుందా అన్నది చూడాలి.