NTV Telugu Site icon

Off The Record : ఏ హోదాలో సచివాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ సమీక్షలు..?

Natarajan Meenakshi Otr

Natarajan Meenakshi Otr

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్ఛార్జ్‌ రాజ్యాంగేతర శక్తిగా మారుతున్నారా? సాక్షాత్తు సెక్రటేరియెట్‌ సాక్షిగా అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారా? ఆమె చర్యల్ని సొంత పార్టీ నేతలే కొందరు తప్పుపడుతున్నారా? భలే దొరికారంటూ… విపక్షాలు కత్తులు నూరుతున్నాయా? రాష్ట్ర పరిపాలనా సౌధంలో అసలేం జరుగుతోంది? ఏ విషయంలో మీనాక్షి నటరాజన్‌ వ్యవహారం వివాదాస్పదమవుతోంది? రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు గుండెకాయ సచివాలయం. మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్షా సమావేశాలు, కీలక నిర్ణయాలకు వేదిక. ఇక్కడ రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు మాత్రమే నిర్ణయాధికారం ఉంటుంది. మిగతా వాళ్ళంతా విజిటర్సే. కానీ ఇటీవల రెండు రోజుల పాటు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ సెక్రటేరియెట్‌కు రాకపోకలు సాగించారు. ఆమె కూడా విజిటర్‌లా వెళితే ఇబ్బంది లేదు. కానీ… సచివాలయంలో మంత్రులతో సమావేశం అయ్యారు మీనాక్షి. శనివారంనాడు సుమారు నాలుగు గంటల పాటు హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ భూముల వ్యవహారంపై చర్చించినట్టు సమాచారం. తిరిగి సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంత్రులు, ప్రజా సంఘాలు, పర్యావరణ ప్రేమికులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి, మంత్రులు ఒకవైపు కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారం పై సమీక్షలు నిర్వహిస్తుంటే… మరోవైపు సమాంతరంగా మీనాక్షి కూడా అదే పని చేశారు. ఇక్కడే అసలు అభ్యంతరం వ్యక్తం అవుతోందట. ఆమె కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్‌ కాబట్టి గాంధీభవన్‌లో మీటింగ్‌లు పెట్టుకుంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ….ఏ అధికారిక హోదా ఉందని సచివాలంయంలో సమీక్షలు చేశారు?…. మీటింగ్‌లు పెట్టారు? ఒక పార్టీ నాయకురాలిగా రాష్ట్ర పరిపాలనా కేంద్రంలో వీరలెవల్లో మీటింగ్స్‌ పెట్టేయడం ఏంటంటూ నిలదీస్తున్నాయి ప్రతిపక్షాలు. అసలామె ఏ హోదాలో సెక్రటేరియెట్‌లో మంత్రులతో సమీక్ష నిర్వహించారని కూడా ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. మీనాక్షి నటరాజన్ తెలంగాణలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారంటూ ఘాటుగా రియాక్ట్‌ అవుతున్నారు.ఈ చర్యల్ని కేవలం ప్రతిపక్ష నాయకులేగాక….కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్స్‌ కూడా తప్పుబడుతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కాదని…. ఒక పార్టీ పరిశీలకురాలు అధికారిక కార్యక్రమాల్లో… అదీ రాష్ట్ర సచివాలయంలో పాల్గొనడం ఏంటన్న ప్రశ్నకు ప్రస్తుతానికి కాంగ్రెస్‌ పార్టీలో కూడా సమాధానం లేదట. ఇది సమస్యలకు దారి తీయవచ్చని అంటున్నాయి సెక్రటేరియట్ వర్గాలు. గాంధేయవాదిగా, రాహుల్ గాంధీకి సన్నిహితురాలిగా మీనాక్షికి పేరుంది. గత ఫిబ్రవరిలో ఆమె రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్‌గా వచ్చినప్పుడు రోల్‌ మోడల్‌లా చూశారు పార్టీ లీడర్స్‌. సాధారణ ప్రయాణికురాలిలా రైల్లో రావడం, బొకేలు, ఫ్లెక్సీలు వద్దని వారించడం లాంటివి చేయడంతో… రాష్ట్ర పార్టీలో కూడా మార్పు కనిపిస్తుందని భావించారు అంతా. కానీ…. ఇప్పుడు అదే వ్యక్తి వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం ఏంటో అర్ధం కావడం లేదంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. ఎలాంటి అధికారిక హోదా లేని ఒక పార్టీ నాయకురాలు సచివాలయంలో మీటింగ్‌లు పెట్టడం అంటే… సరిహద్దుల్ని చెరిపేయడమేనన్న విమర్శలు పెరుగుతున్నాయి.

ఇప్పుడిక సెక్రటేరియెట్‌కు, గాంధీ భవన్‌కు తేడా ఏంటన్నది తెలంగాణ ప్రతిపక్షాల క్వశ్చన్‌. సీఎం రేవంత్ రెడ్డి రబ్బర్ స్టాంప్‌గా మారారని, రాష్ట్ర వ్యవహారాలను ఢిల్లీ హైకమాండ్ నడుపుతోందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఆమె సచివాలయంలో సమీక్షలు నిర్వహించడం అంటే… ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యమేనంటూ కొందరు నాయకులు ఢిల్లీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట. వాస్తవానికి సెక్రటేరియట్ లో సందర్శకులకు, అతిధులకు, ఉద్యోగులకు వేరు వేరు ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. మీనాక్షికి మాత్రం వివిఐపీ ప్రోటోకాల్ కల్పిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌లోకి వచ్చే గేట్ నుంచే మీనాక్షి రాగా… సచివాలయంలో ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్, డిజిపి స్థాయి అధికారుల హాల్టింగ్ పాయింట్ లోనే ఆమె హాల్ట్‌ అవుతున్నారు. వాస్తవానికి సెక్రటేరియట్ లోని ఆ వివిఐపీ జోన్‌లోకి ఏ ఇతర వాహనాలను పోలీసులు అనుమతించరు. కానీ ఓ సాధారణ కార్లో సెక్రటేరియట్ వివిఐపీ హాల్టింగ్ జోన్‌లోకి మీనాక్షి ఎంటరవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ ఇలానే ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థాయిలో రచ్చ అవుతుందని కాంగ్రెస్‌ నేతలే మాట్లాడుకుంటున్నారు. ఇది ఇక్కడితో ఆగుతుందా? లేదా అన్నది చూడాలి.