NTV Telugu Site icon

Off The Record : తెలంగాణ బీజేపీకి ఇప్పట్లో కొత్త అధ్యక్షుడు లేనట్టేనా.?

Tbjp

Tbjp

తెలంగాణ బీజేపీకి ఇప్పట్లో కొత్త అధ్యక్షుడు లేనట్టేనా? ఇక మేటర్‌ మొత్తం సంస్థాగత ఎన్నికల తర్వాతే సెటిల్‌ అవుతుందా? తాము ఎంపిక చేసే బదులు కొత్త అధ్యక్షుడిని కేడరే ఎన్నుకుంటే బెటరని పార్టీ పెద్దలు భావిస్తున్నారా? కొత్త అధ్యక్ష పదవి కేంద్రంగా పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? నేతల అభిప్రాయం ఎలా ఉంది? జాతీయ స్థాయిలో సభ్యత్వ నమోదుకు సమాయత్తం అవుతోంది బీజేపీ. ఈ నెల 17న ఢిల్లీలో సభ్యత్వ నమోదు పై వర్క్‌షాప్‌ జరగనుంది. ఆ మీటింగ్‌కు పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు హాజరవుతారు. ఆ తర్వాత 22 నుంచి తెలంగాణలో కూడా మెంబర్షిప్ పై వర్క్ షాప్ ఉండవచ్చంటున్నారు. దాని తర్వాత జిల్లాల వారీగా కూడా…ఆ పరంపర కొనసాగుతుంది. మొత్తం కార్యక్రమాన్ని ఎప్పటి వరకు చేయాలి, ఎలా చేయాలన్న విషయమై ఢిల్లీ వర్క్‌షాప్‌లో క్లారిటీ ఇస్తుంది పార్టీ అధిష్టానం. తెలంగాణలో 50 లక్షల సభ్యత్వం టార్గెట్‌గా పెట్టుకుంది పార్టీ. ప్రతి పోలింగ్ బూత్‌ పరిధిలో కనీసం వంద కొత్త సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిసింది. అలా వంద సభ్యత్వాలు చేయించిన వారికి క్రియాశీలక సభుత్వం ఇస్తారట. అలా సభ్యత్వ నమోదు పూర్తవగానే… సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి. బూత్ అధ్యక్షుడి నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడి వరకు ఎన్నిక ఉంటుంది. కాబట్టి సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినట్టే.

ఈ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోందట.ఈ క్రమంలో ఇప్పటికిప్పుడు రాష్ర్ట అధ్యక్ష పదవిలో మార్పు ఉండక పోవచ్చంటున్నారు. ఎలాగు రెండు మూడు నెలల్లో కొత్త అధ్యక్ష ఎన్నిక ఉంటుంది… అలాంటప్పుడు ఇంతలోనే మునిగిపోయింది ఏముంది?… తాత్కాలిక నియామకం ఎందుకన్న చర్చ జరుగుతోందట పార్టీలో. కేంద్ర పార్టీ ఎంపిక చేయడం కాకుండా… సంస్థాగత ఎన్నికల ద్వారా ఎలక్ట్ అయ్యి రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు వస్తారని బీజేపీ లోని క్రియాశీలక వర్గాలు అంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి రాష్ర్ట అధ్యక్ష మార్పుపై చర్చ జరుగుతూనే ఉంది. రేపో మాపోనన్న ప్రచారం నడుస్తూనే ఉంది… అలా సుమారు గా రెండున్నర నెలలు కంప్లీట్ అయింది… ఇక ఇప్పుడు ఆర్గనైజేషనల్ ఎన్నికలకి సమాయత్తం అవుతోంది పార్టీ. ఇక సంస్థాగత ఎన్నికలతోనే కొత్త అధ్యక్షుడు వస్తారని దాదాపుగా ఫిక్స్‌ అయ్యాయట తెలంగాణ బీజేపీ శ్రేణులు. పార్టీలో ప్రస్తుతం కొత్త పాత పంచాయతీ నడుస్తోంది. దీంతో కొత్త అధ్యక్షుడిని ఢిల్లీ నుంచి ఎంపిక చేసే బదులు లోకల్‌గా పార్టీ కేడరే ఎన్నుకుంటే బెటరని అధిష్టానం కూడా భావిస్తున్నట్టు తెలిసింది.