NTV Telugu Site icon

Off The Record : మాజీ ముఖ్యమంత్రుల మీద పోరాడిన వ్యక్తి ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు…?

Sathish Otr

Sathish Otr

ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల మీద టీడీపీ తరపున పోరాడారాయన. ఒక రకంగా చెప్పాలంటే… నియోజకవర్గంలో పార్టీకి కేరాఫ్‌. కానీ… ఎన్నికలకు ముందు టీడీపీని వదిలి వైసీపీ కండువా కప్పుకున్నారు. తీరా తాను మారిన పార్టీ ఓడిపోయి… పాత పార్టీ పవర్‌లోకి వచ్చేసరికి దాదాపు మైండ్‌ బ్లాక్‌ అయిందట. ఇప్పుడేం చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారిన ఆ నేత ఎవరు? ఆయన గురించి జరుగుతున్న చర్చ ఏంటి? ఏపీ పాలిటిక్స్‌లో పులివెందుల ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. పొలిటికల్‌గా వైఎస్‌ కుటుంబానికి పెట్టని కోట ఇది. రాజశేఖర్‌రెడ్డి, జగన్‌, ఇలా ఇద్దరు సీఎంలను అందించిన నియోజకవర్గం. అలాంటి చోట… టీడీపీకి ఆయువుపట్టుగా, ఆ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు రాజకీయ ప్రత్యర్థిగా నిలబడ్డ వ్యక్తి శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి. దాదాపు 30 ఏళ్ళపాటు పులివెందుల టీడీపీ నేతగా ఉండి నియోజకవర్గంలో వైఎస్ కుటుంబంతో తలపడ్డారాయన. పులివెందుల నియోజకవర్గంలో టిడిపి అంటే సతీష్ రెడ్డి,సతీష్ రెడ్డి అంటే టిడిపి అన్నంతగా పేరుంది. 1994 నుంచి 2009 వరకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి పులివెందులలో ప్రధాన ప్రత్యర్థి సతీష్ రెడ్డి. కొన్నిసార్లు టఫ్‌ ఫైట్‌ ఇచ్చిన సందర్భాలు సైతం ఉన్నాయి. అలాంటి సతీష్‌రెడ్డి తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీ పంచన చేరారు. 2019 ఎన్నికల తర్వాత ఐదేళ్ళపాటు టిడిపిలోనే సైలెంట్‌గా ఉన్నారాయన.

కీలకమైన నియోజకవర్గంలో పార్టీకి అండగా ఉంటున్నా… టీడీపీ అధిష్టానం సరిగా గుర్తించడం లేదన్న అసంతృప్తితో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు, కేడర్‌కు దూరం ఉన్నారు సతీష్‌రెడ్డి. ఆ క్రమంలోనే… ఎన్నికలకు ముందు తెలుగుదేశానికి బైబై చెప్పేసి.. ఫ్యాన్‌ కిందికి చేరిపోయారాయన. ఎన్నికల్లో యాక్టివ్‌గా తిరిగి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయానికి కృషి చేశారు. రాష్ట్రంలో వైసీపీ మళ్ళీ అధికారం చేపట్టి ఉంటే… సతీష్‌రెడ్డి పరిస్థితి ఎలా ఉండేదోగానీ… పార్టీ ఘోర పరాజయంతో… పులివెందులలో ఆయన కూడా సైలెంట్‌ అయిపోయారు. దీంతో అటు టీడీపీలో ఉన్నప్పుడూ కలిసి రాలేదని, ఇటు వైసీపీలోకి మారాక కూడా ఏం మార్పు లేదంటూ చర్చించుకుంటున్నారట ఆయన సన్నిహితులు. మాజీ సీఎం జగన్‌ ఆయనకు ఏ రకంగా న్యాయం చేస్తారు? సతీష్‌రెడ్డి మళ్ళీ క్రియాశీలకంగా మారతారా? లేక పొలిటికల్‌గా అలిసిపోయానంటూ పక్కకు తప్పుకుంటారా అన్న ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయట నియోజకవర్గంలో. ఇప్పుడు సతీష్‌రెడ్డి తీసుకునే స్టెప్‌ కోసం ఆసక్తిగా చూస్తున్నాయి పులివెందుల రాజకీయ వర్గాలు.