NTV Telugu Site icon

Off The Record : పుట్టపర్తి వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు.?

Otr Ycp

Otr Ycp

పుట్టపర్తిలో కొత్తగా పొలిటికల్‌ ప్రకంపనలు రేగుతున్నాయా? లోకల్‌ వైసీపీ నాయకులు షేకవుతున్నారా? ఎప్పుడు ఏ అధికారి వచ్చి తలుపు తడతారోనని కంగారు పడుతున్నారా? ఎందుకంత కంగారు? పుట్టపర్తి మున్సిపాలిటీ కేంద్రంగా ఏం జరుగుతోంది? పాలకవర్గంపై ఉన్న గోల్‌మాల్‌ ఆరోపణలేంటి? శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి మున్సిపాలిటీలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు రాజకీయ నాయకులు , అధికారుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తిస్తున్నాయట. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. పనులు జరక్కుండానే బిల్లులు స్వాహా చేయడం, చివరికి చెత్త బుట్టలు పంపిణీ చేయకుండానే ఆ పేరుతో డబ్బు నొక్కేయడం, తిరక్కుండా ఆగిపోయిన చెత్త వాహనాలకు సైతం డీజిల్ బిల్లులు వసూలు చేసుకోవడం లాంటి చిన్నెలు చాలానే జరిగాయట. ఇలాంటి వివిధ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా… విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు మున్సిపల్‌ కౌన్సిల్ సభ్యులు కొందరు. ఈ ఫిర్యాదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అందినా… నాడు అధికార బలంతో ఫైల్‌ను తొక్కి పెట్టారన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, కూటమి సర్కార్‌ బాధ్యతలు చేపట్టడంతో… నాడు ఫిర్యాదు చేసిన కౌన్సిల్ సభ్యులు మరోసారి ఆ ఎపిసోడ్‌ని తెర మీదికి తెచ్చినట్టు తెలిసింది. మున్సిపాలిటీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వయిరీ చేయాలని కోరారట. దీంతో వాళ్ళు అలా అడగటం.. అందుకోసమే కదా మేం ఎదురు చూస్తోంది అన్నట్టుగా.. అధికారులు తనిఖీలు నిర్వహించడం చకాచకా మొదలయ్యాయి. గత ప్రభుత్వ హయంలో వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు కలిసి పెద్ద ఎత్తున నిధులు కొల్లగొట్టినట్టు ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయిల మున్సిపల్ నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం విజిలెన్స్ తనిఖీలతో పాలక వర్గంలో ఉన్న వారు బెంబేలెత్తిపోతున్నారట. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు రికార్డులను పరిశీలించి కీలకమైన వాటిని స్వాధీనం చేసుకున్నారు.

 

అయితే దీని వెనుక రాజకీయ కోణం ఉందా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. కానీ… విజిలెన్స్‌ అధికారులు మాత్రం వాటిని కొట్టి పారేస్తున్నారు. ఉన్న సమాచారం, ఉన్నతాధికారుల ఆదేశాలతోనే తనిఖీలు నిర్వహిస్తున్నామని అంటున్నారట.అసలు ఈ తనిఖీలు నిధుల స్వాహా వరకే ఉంటాయా అంటే.. ప్రస్తుతం పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదంటున్నారు పరిశీలకులు. పుట్టపర్తి జిల్లా కావడంతో ఇక్కడ భూముల విలువ భారీగా పెరిగింది. మున్సిపాల్టీ పరిధిలో సామాన్యుడు భూములు, ఇళ్లు కొనలేని పరిస్థితి. ఇలాంటి చోట ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు భారీగా ఇచ్చారని.. ఇందులో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని చెప్పుకుంటున్నారు. అంతే కాకుండా మున్సిపాల్టీకి సంబంధించిన స్థలాలు కబ్జా అయ్యాయని కూడా చాలా మంది చెబుతున్నారు. ఇలా రకరకాలుగా గత ఐదేళ్ల అక్రమాల గుట్టు రట్టు చేసేందుకు విజిలెన్స్ అధికారులు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పాలకవర్గం మొత్తం వైసీపీ చేతిలోనే ఉన్నా…తనిఖీల్లో పలు కీలకమ్తెన రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం…వీటి ఆధారంగా ప్రజాప్రతినిధులు, అధికారుల అక్రమాల గుట్టు విప్పేందుకు రంగం సిద్ధమైందన్నది లోకల్‌ వాయిస్‌. వ్తెసీపీ ప్రభుత్వం హయంలో విచ్చలవిడిగా స్థానిక ప్రజా ప్రతినిధులు భూ దందాలు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీంతో విజిలెన్స్‌ ఎంక్వయిరీ ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన వ్యక్తం అవుతోందట పుట్టపర్తి వైసీపీ నేతల్లో.