NTV Telugu Site icon

Off The Record : వైసీపీ హయాంలోని బిల్లులు చెల్లింపులు… మంత్రికే షాక్ ఇచ్చిన అధికారులు..?

Ycp Otr

Ycp Otr

ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉంది టీడీపీ ప్రభుత్వమా? లేక వైసీపీ సర్కారా? ఏంటా పిచ్చి ప్రశ్న, అసలు మీకా డౌట్‌ ఎందుకొచ్చిందని అంటారా? డౌట్‌ మాది కాదు. టీడీపీ సానుభూతిపరులైన కాంట్రాక్టర్స్‌ది. అప్పుడెప్పుడో 2014-19 మధ్య కాలంలో తాము చేసిన పనులకు బిల్లులు ఇంతవరకు రాలేదు. ఇప్పుడు వైసీపీ హయాంలో చేసిన పనులకు అందునా పులివెందుల కాంట్రాక్టర్స్‌కు వందల కోట్లు ఇచ్చేస్తే డౌట్‌ కాక ఇంకేం వస్తుందని అంటున్నారు వాళ్లు. ఏంటా చెల్లింపుల వ్యవహారం? దాని వెనక ఉన్నదెవరు? ఆర్ధిక మంత్రికి కూడా తెలియకుండా ఎలా జరిగింది? ఏపీలో గత ప్రభుత్వ సానుభూతి పరులుగా ఉన్న కాంట్రాక్టర్స్‌కు రహస్యంగా బిల్లుల చెల్లింపు వ్యవహారం ప్రకంపనలు రేపుతోందట. మరీ ముఖ్యంగా ఆ ఎపిసోడ్‌ తర్వాత ఆర్ధిక శాఖ షేకవుతోందంటున్నారు. 2014-19 మధ్య టీడీపీ హయాంలో పనిచేసిన వారికి ఉన్న పెండింగ్ బిల్లుల్ని ఇప్పటికీ చెల్లించలేదు. కానీ… ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వమే ఉన్నా… ఆర్డర్‌ ప్రకారం చూసుకున్నా… వాళ్ళకే ఇవ్వాల్సిందిపోయి వైసీపీ హయాంలో జరిగిన పనులకు ఇవ్వడం ఏంటి? కనీసం మంత్రికి కూడా తెలియకుండా ఇలాంటి సాహసం ఎవరు చేశారన్న చర్చ జరుగుతోంది ప్రభుత్వ వర్గాల్లో. విషయం తెలిసిన వెంటనే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీరియస్‌ అయి ఆరా తీయగా…. ఆయన విస్తుపోయే వాస్తవాలు బయటికి వచ్చాయట. అసలు ఆయనకు ఏ మాత్రం సంబంధం లేకుండానే, అర్ధిక శాఖ అధికారులే చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసినట్టు తెలిసి షాకవడం మంత్రి వంతయిందని అంటున్నారు. పయ్యావుల సొంత జిల్లా పర్యటనలో ఉన్న సమయంలో ఈ చెల్లింపుల ప్రక్రియను చకచకా చేసేశారన్నది ఆర్థిక శాఖ వర్గాల సమాచారం. నేరుగా చెల్లింపులు జరిపితే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశ్యంతో కొందరు అధికారులు తెలివిగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. కేంద్రానికి సమర్పించాల్సిన యుటిలైజేషన్‌ సర్టిఫికెట్ల కోసం బిల్లులు ఇవ్వాల్సి వచ్చిందన్న సాకును చూపి తామనుకున్న పనిని కామ్‌గా వేగంగా చేసేశారన్న సంగతి వెలుగుచూసిందట. కేంద్రానికి సమర్పించాల్సిన యూసీల విషయంలో, కేంద్ర స్కీంలకు రాష్ట్ర వాటాలను చెల్లించే విషయంలో కచ్చితంగా ఉంటూ జాప్యం చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. ఇలా చేస్తే.. కేంద్రం నుంచి రావాల్సిన మరిన్ని నిధులు త్వరగా వస్తాయి కాబట్టి.. యూసీలు.. స్టేట్‌ కాంపోనెంట్‌ వంటి వాటి విషయాల్లో రాజీ పడొద్దని ప్రభుత్వ పెద్దలే చెప్పారు.

దీన్ని అడ్డం పెట్టుకుని అధికారులు తాము చేయాలనుకున్న పనిని చేసేసినట్టు తేలిందట. ఈ విధంగా యూసీలను అడ్డం పెట్టుకుని చెల్లింపులు జరిపేయడం ఆశ్చర్యకరమైన అంశమైతే.. అస్సలు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల దృష్టికి తీసుకురాకుండా అధికారులే మొత్తం వ్యవహారాన్ని నడిపించేయడం మరింత విస్మయాన్ని కలిగిస్తోందంటున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆరా తీయడం.. అన్ని కోణాలు ఆలోచించి సూచనలు చేయడం.. ఇకపై ఎలాంటి బిల్లులనైనా ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకురాకుండా చెల్లింపులు జరపవద్దని ఆదేశించడం జరిగిపోయింది. ఇదంతా ఓ ఎత్తు అయితే.. అసలు ఈ వ్యవహారం బయటకు వచ్చిన తీరు మరింత విస్తుగొలిపే విధంగా ఉందట. అధికారులు రహస్యంగా చెల్లించిన బిల్లులు.. కడప జిల్లావి.. అందునా.. సొమ్ము చేరినవాళ్ళు పులివెందులకు చెందిన వైసీపీ నేతలు. సదరు నేతలంతా… తమకు రావాల్సిన 100 కోట్ల రూపాయల బిల్స్‌ క్లియర్‌ అవగానే…. పులివెందుల టీడీపీ ఇన్చార్జ్‌ బీ-టెక్ రవి ఇంటి ముందుకెళ్లి ఇవిగో చెక్కులు.. మా బిల్లులు క్లియర్‌ అయ్యాయంటూ మీసం మెలేశారట. దీంతో బీ-టెక్ రవికి సుర్రుమన్నట్టు సమాచారం. పులివెందుల లాంటి నియోజకవర్గంలో తాము కిందా మీదా పడి రాజకీయం చేస్తుంటే.. కొందరు అధికారులు ఈ విధంగా ఎలా చేస్తారంటూ ఆయన సీరియస్ అయినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహరం రచ్చ రంబోలా అయిందంటున్నారు. పులివెందులతోపాటు విజయనగరం జిల్లాలోని బొత్స అనుచరులు కొందరి బిల్లులు కూడా క్లియర్ అయినట్టు సమాచారం. దీంతో ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అధికారులకు కచ్చితమైన ఆదేశాలు వెళ్లాయట.ఇదే సందర్భంలో మరో చర్చా జరుగుతోంది. కొందరు అధికారులు ఏమైనా అమ్యామ్యాలకు అలవాటు పడి బిల్లులను చెల్లించేశారా..? అనే టాక్ కూడా నడుస్తోంది. కారణం ఏదైనా ఇది మాత్రం పెద్ద ప్రసహసనంగా మారిందట అధికార పార్టీలో.