NTV Telugu Site icon

Off The Record : తెలంగాణ పాలిటిక్స్ లో పవర్ హై వోల్టేజ్

Ntpc Otr

Ntpc Otr

తెలంగాణలో కరెంట్‌ రాజకీయం హై వోల్టేజ్‌లో నడుస్తోంది. కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌గా నడుస్తున్న పవర్‌ పర్చేజ్‌ వార్‌లోకి తాజాగా బీజేపీ ఎంటరైంది. అందరి మాటా జనహితమే అయినా.. అందులో ఎవరి రాజకీయం వారిది. ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తూ… బీజేపీ తెర మీదికి తెచ్చిన తాజా పాయింట్‌ ఏంటి? దాని ప్రకారం ముందుకు వెళితే తెలంగాణ ప్రజల నెత్తిన బండేనని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకు అంటోంది? కరెంట్‌ పేరుతో మొదలైన కొత్త రాజకీయం ఏంటి? తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కరెంట్‌ చుట్టూనే తిరుగుతున్నాయి. ఒక వైపు గత ప్రభుత్వ విద్యుత్ కొనుగోళ్ళలో అవకతవకలు జరిగాయని విచారణ కమిషన్‌ను నియమించింది రేవంత్‌ సర్కార్‌. దాని మీద సుప్రీంకోర్ట్‌కు వెళ్ళింది బీఆర్‌ఎస్‌. విచారణ జరిగి తీరుతుందని, కాకుంటే… కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చమని చెప్పింది కోర్ట్‌. ఆ ప్రకారం మార్పులు కూడా జరిగిపోయాయి. ఆ ఎపిసోడ్‌ అలా జరుగుతుండగానే… మరో అంశాన్ని తెర మీదకు తెచ్చింది బీజేపీ. ఎన్టీపీసీలో ఉత్పత్తి అయ్యే విద్యుత్ తెలంగాణకు అక్కర్లేదా? అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పవర్ పర్చేజ్‌ అగ్రిమెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంగా ఉందంటూ ఘాటుగా స్పందించారాయన. తెలంగాణలో విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని పెంచి.. రాష్ట్ర ప్రజలకు వీలైనంత ఎక్కువ విద్యుత్‌ను అందుబాటులో ఉంచాలనుకున్న కేంద్ర ప్రయత్నాలకు.. స్టేట్‌ గవర్నమెంట్‌ సహకరించడం లేదని విమర్శించారాయన. రామగుండంలో సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్లను ఏర్పాటుచేసి 4 వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసిందని గుర్తుచేశారు కిషన్‌రెడ్డి. అందులోని 1600 మెగావాట్ల ప్రాజెక్ట్ లో 85 శాతం కరెంట్‌ను తెలంగాణ అవసరాలకే వినియోగిస్తున్నారని, ఇక మిగిలి ఉన్న 2వేల400 మెగావాట్ల ప్రాజెక్టును కూడా వీలైనంత త్వరగా ప్రారంభించుకుని.. రాష్ట్రానికి విద్యుత్ భద్రత కల్పించాలన్నది కేంద్రం లక్ష్యం అని చెబుతున్నారు మంత్రి.

 

కానీ… అసలు సమస్య అక్కడే ఉందన్నది రాష్ట్ర ప్రభుత్వం వెర్షన్‌గా తెలుస్తోంది. రెండో దశ తెలంగాణ సూపర్ థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి కొనుగోలు ఒప్పందం చేసుకుంటే…భవిష్యత్తులో అది రాష్ట్రానికి పెనుభారంగా మారే ప్రమాదముందని అంటున్నారు. ఆ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 5 నుంచి 8 ఏళ్ల సమయం పడుతుందని, అప్పటికి అందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ధర యూనిట్‌కు 8 నుంచి 9 రూపాయలకు పెరుగుతుందన్నది తెలంగాణ ఇంధన శాఖ అంచనా. బహిరంగ మార్కెట్లో అంతకన్నా తక్కువ ధరకే కరెంట్‌ దొరుకుతున్నప్పుడు కేంద్ర సంస్థ నుంచి అంత ఎక్కువ మొత్తం పెట్టి, అదీకూడా పాతికేళ్ళ పాటు కొనుగోలు ఒప్పందం చేసుకుంటే… తెలంగాణ ప్రజల మీద అనవసరంగా వేల కోట్ల రూపాయల భారం మోపినట్టు కాదా అన్నది రాష్ట్ర ప్రభుత్వ వర్గాల ప్రశ్న. అందుకే… ఎన్టీపీసీ రెండో దశ విద్యుత్ కేంద్రం నుంచి కొనుగోలు ఒప్పందం చేసుకోకూడదని నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణ వెంటనే ఒప్పందం చేసుకోకుంటే వేరే రాష్ట్రాలతో అగ్రిమెంట్‌ కుదుర్చుకుని అక్కడ నిర్మిస్తామంటూ.. ఎన్టీపీసీ ఇటీవల రాష్ట్రానికి అల్టిమేటం జారీ చేసింది. ఆ క్రమంలోనే స్టేట్‌ గవర్నమెంట్‌ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అసలు విషయం అదైతే… బీజేపీ నేతలు మాత్రం వాస్తవాలు దాచేసి కేంద్రం ఉదారంగా ఇస్తామంటే మేమేదో వద్దంటున్నట్టు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు కాంగ్రెస్‌ ముఖ్యులు.

తెలంగాణలో విద్యుత్ కొరతను తీర్చడానికి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని పునర్విభజన చట్టంలో కేంద్రం హామీ ఇచ్చింది. అందులో తొలి దశ కింద 16 వందల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణం ఇటీవలే పూర్తయింది. రెండో దశ కింద 2వేల 400 మెగావాట్ల ప్లాంట్ నిర్మించాల్సి ఉంది. తొలి దశ ప్లాంట్ నుంచి యూనిట్‌కు 5 రూపాయల 90పైసల చొప్పున కొనేందుకు ఒప్పందం చేసుకున్న కారణంగా… ఇప్పుడు కొనక తప్పని పరిస్థితి ఉన్నట్లు సమాచారం. రెండో దశ కోసం కూడా అప్పుడే ఒప్పందం చేసుకుని ఉంటే… తక్కువ ధరకు కరెంట్‌ వచ్చేదని, పదేళ్ల పాటు బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కాలయాపన చేయడం వల్ల ప్లాంట్‌ నిర్మాణం మొదలవక, ఇప్పుడు రేటు పెరిగి రాష్ట్ర ప్రజల మీద అదనపు భారం పడుతుందన్నది కాంగ్రెస్‌ సర్కార్‌ వెర్షన్‌. దామరచర్లలో తెలంగాణ జెన్కో నిర్మిస్తున్న 4వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నాలుగేళ్ల కిందే అందుబాటులోకి రావాల్సి ఉండగా… ఇంకా పనులు కొనసాగుతున్నాయి. ఈ జాప్యంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం మెగావాట్‌కు 6 నుంచి 10 కోట్లకు పెరిగింది. అలాగే.. కాలంచెల్లిన సబ్-క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన భద్రాద్రి విద్యుత్ కేంద్రం వ్యయం సైతం భారీగా పెరగడంతో దాని విద్యుత్ ధరలు కూడా పెరిగాయి. యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్మాణంలో తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో కాంగ్రెస్ సర్కారు న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో మళ్లీ కొత్త థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జోలికి వెళ్లొద్దని ఓ నిర్ణయానికి వచ్చిందట రాష్ట్ర ప్రభుత్వం. ప్రత్యామ్నాయంగా మార్కెట్లో యూనిట్‌కు 2 నుంచి 4 రూపాయలకు దొరుకుతున్న పునరుద్పాదక విద్యుత్‌తో రాష్ట్ర విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతం ఎన్టీపీసీ విద్యుత్ పై రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి లేదని, దాని బదులు బహిరంగ మార్కెట్‌లో చవగ్గా దొరికే కరెంట్‌ని కొనుక్కోవడమే బెటరని భావిస్తున్నారట. దీంతో ఎన్టీపీసీ సెకండ్‌ ప్లాంట్‌పై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.