ఆ లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ ప్రయోగం పూర్తిగా వికటించిందా? అదీ… అలా ఇలా కాకుండా… ఇప్పుడసలు ఏకంగా పార్టీకి నాయకుడే లేకుండా పోయాడా? రండి బాబూ… రండని ఆఫర్స్ మీద ఆఫర్స్ ఇస్తున్నా, ఖాళీ కుర్చీని చూపిస్తున్నా… అందులో కూర్చునే వాళ్ళు కరవయ్యారా? ఎక్కడ…. అంత సెల్ఫ్‌గోల్ వేసుకుంది వైసీపీ? కులాల ఈక్వేషన్స్ ఎలా దెబ్బతీశాయి? రాజకీయంగా జాతీయ స్థాయిలో కూడా చర్చ జరిగిన లోక్‌సభ నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం. 2019ఎన్నికల్లో ఈ సీటును తన ఖాతాలో వేసుకున్న వైసీపీ 2024ఎన్నికల్లో మాత్రం ఘోరంగా ఓడింది. అనవసర ప్రయోగాలు చేయడమే అందుకు కారణమని, ఈ ఓటమిని ముందుగానే ఊహించామని చెప్పుకుంటుంటారు ఇక్కడి వైసీపీ నాయకులు. ఇప్పుడున్న స్థితిలో నరసాపురం లోక్‌సభ సీటు బాధ్యతను భుజానికెత్తుకోవడానికి ఏ ఒక్క నాయకుడు ముందుకు రాకపోవడమే అసలు విషాదం అంటున్నారు. దీంతో ఇక్కడ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది. 2019లో క్షత్రియ సామాజికవర్గానికి అవకాశమిచ్చిన వైసీపీ… 2024కు వచ్చేసరికి శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన మహిళ గూడూరి ఉమాబాలకు ఛాన్స్ ఇచ్చింది. అప్పటి వరకు కేవలం భీమవరం మున్సిపల్ కౌన్సిలర్‌గా లోకల్ పాలిటిక్స్‌కే పరిమితమైన ఉమాబాలకు ఏకంగా ఎంపీ సీటు ఇవ్వడం నాడున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలకే మింగుడు పడలేదట. అసలే కాపు, క్షత్రియ కులాల డామినేషన్ ఉండే నియోజకవర్గం, అందులోను ఆర్ధికంగా పెద్దగా బలంలేని అభ్యర్దిని బరిలో దించితే మొదటికే మోసం వస్తుందని ముందే ఊహించామని, కానీ… అధినేత తీసుకున్న నిర్ణయం కాబట్టి ఎవరం ఎదురు చెప్పలేకపోయామని అంటున్నారు నరసాపురం వైసీపీ నాయకులు. అలాంటి పరిస్థితుల్లో…. ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయామని, అందుకు అధిష్టానం తీసుకున్న నిర్ణయమే అసలు కారణం అన్నది స్థానిక నేతల మాట. పైగా ఈ ఎంపీ సీటు పరిధిలో కూటమి పార్టీలు మూడూ బలంగానే ఉన్నాయి.
అందుకే నరసాపురం ఎంపీ సీటును బీజేపీ సునాయాసంగా గెలవగలిగిందని చెప్పుకుంటున్నారు. మూడు బలమైన పార్టీలు ఒక్కటిగా వస్తున్న సమయంలో ఆచితూచి అడుగేయాల్సిన వైసీపీ పెద్దలు అనవసర ప్రయోగాలతో భారీ మూల్యం చెల్లించుకున్నారన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. గత ఎన్నికల్లో ఎదురైన ఓటమి ఒక ఎత్తయితే…. ఇపుడసలు నరసాపురం పార్లమెంటు బాధ్యతలు భుజానికెత్తుకోడానికి నాయకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో… ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉందట పార్టీ కేడర్. ఊహించని విధంగా ఎంపీ సీటు తెచ్చుకుని ఓడిపోయిన గూడూరి ఉమాబాల ఎన్నికల తర్వాత యాక్టివ్‌గా లేరు. ఆమెకు బదులు ఇంకెరన్న విషయంలో క్లారిటీ లేదు. సీటు ఖాళీగా కనిపిస్తోందిగానీ… అందులో కూర్చునే వాళ్ళు కరవయ్యారు. జరిగింది తప్పా ఒప్పా అన్న సంగతి పక్కనబెడితే….పగ్గాలు చేపట్టబోయే వ్యక్తి కోసం స్థానిక నాయకులు సైతం ఎదురుచూస్తున్నారు. కూటమి తరపున బలమైన నేతలున్న ప్రాంతంలో వారిని ధీటుగా ఎదుర్కొంటూ… ఆర్ధికంగా తట్టుకోగలిగిన వారు, ముఖ్యంగా కాపు లేదా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికే అవకాశం ఇవ్వాలని కోరుతోందట లోకల్ వైసీపీ కేడర్. కానీ… ఎంత వెదికినా ఆ ఈక్వేషన్స్‌లో సరైన లీడర్ దొరకడం లేదని చెప్పుకుంటున్నారు. కొందరు కనిపిస్తున్నా… బాధ్యత మోసేందుకు ముందుకు రావడం లేదట. ఇప్పటికే భీమవరం, ఆచంట, ఉండి నియోజక వర్గాల్లోని సీనియర్ నాయకులు కామ్ అయిపోవడం, మిగతా చోట్ల కూడా అంత యాక్టివ్‌గా కనిపించకపోవడం, ఇప్పుడా బాధ్యత తీసుకున్నా…. తలనొప్పులు తప్ప ఒరిగేదేంలేదన్న అభిప్రాయం పెరిగిపోవడం… ఇలా రకరకాల సమస్యలు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెత్తనాలు చెలాయించిన వాళ్ళలో ఏ ఒక్కరూ ముందుకు రాకపోవడంతో నరసాపురం వైసీపీ బలహీన పడుతోందన్న ప్రచారం మొదలైంది. దీంతో… కాస్త లేటైనా… లేటెస్ట్‌గా సమర్ధుడిని వెదికి ఇన్ఛార్జ్‌గా పెడతారా? లేక ఎవరో ఒకరులే అనుకువని మరోసారి వైసీపీ పెద్దలు ప్రయోగాలు చేస్తారా? అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.