NTV Telugu Site icon

Off The Record : నల్గొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కి వాస్తు దోషం ఉందా.. ?

Nalgonda

Nalgonda

అమ్మో ఆఫీస్‌ అంటున్నారు అక్కడ గెలిచిన ప్రజా ప్రతినిధులు. ముందు గెలిచినాయన అసలు అందులోకి అడుగే పెట్టకపోతే… ప్లేస్‌ మారితే ఫేట్‌ మారుతుందనుకుంటూ… ఏకంగా ఆఫీస్‌నే మార్చేస్తున్నారు తర్వాత గెలిచిన మంత్రివర్యులు. వాస్తు రాజకీయ నాయకులకేనా? మాకు ఉండదా అన్నది ఆఫీసర్స్‌ క్వశ్చన్‌. ఇంతకీ ఏంటా వాస్తు వ్యవహారం? ఆ ఆఫీస్‌ అంటే ఎందుకంత భయం? నల్గొండ ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీస్‌ కట్టిన ఐదేళ్ళ తర్వాత వినియోగంలోకి రాబోతోంది. అయితే… క్యాంప్‌ ఆఫీస్‌గా మాత్రం కాదు. జస్ట్‌ ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌ హౌస్‌గా మాత్రమే. అలా ఎందుకయ్యా అంటే… దాని వెనకో బీభత్సమైన వాస్తు కథ ఉందట. అందుకే ఇన్నాళ్లు నిరుపయోగంగా ఉండి ఇప్పుడు రూపాంతరం చెందుతోందన్నది లోకల్‌ టాక్‌. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోసం క్యాంప్‌ ఆఫీస్‌ని నిర్మించింది గత ప్రభుత్వం. కానీ… నాటి ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వాస్తు దోషం పేరుతో ఈ ఆఫీస్‌ని ఉపయోగించలేదు. ఎదురుగా నిర్మించిన కొత్త జడ్పీ ఆఫీస్‌ కారణంగా క్యాంప్‌ ఆఫీస్‌కి వీధి పోటు వచ్చేసిందని, దాంతోపాటు పలు వాస్తు దోషాలు ఉన్నాయని ఎవరో నాటి ఎమ్మెల్యే చెవిలో ఊదేశారట. వాస్తు దోషం ఉన్న క్యాంప్‌ ఆఫీస్‌ నుంచి విధులు నిర్వహిస్తే… పదవీ గండం తప్పదంటూ ఆ ఆఫీస్‌లోకి అడుగు కూడా పెట్టలేదట ఆయన. అడుగు పెట్టకున్నా… తాజా అసెంబ్లీ ఎన్నికల్లో సార్‌ ఎమ్మెల్యేగిరీ పోయింది అది వేరే స్టోరీ.

ఈ ఆఫీస్‌ని కొద్ది మంది బీఆర్‌ఎస్‌ నేతలు తమ వ్యక్తిగత పనులకు వాడుకున్న పరిస్థితి. తాజాగా ప్రభుత్వం మారింది. ఎమ్మెల్యే కూడా మారడంతో ఇప్పుడు మళ్లీ దీని గురించిన చర్చ మొదలైంది. నల్గొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఈ క్యాంప్‌ ఆఫీస్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించడానికి ఆసక్తి చూపలేదు. మంత్రి హోదాలో తనకు సరిపోదు అనుకున్నారో… లేక మాజీ ఎమ్మెల్యే లాగానే వాస్తు దోషంపై నమ్మకం ఉందోగానీ…దీన్ని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంగా మార్చాలని డిసైడ్ అయ్యారు. పట్టణం నడిబొడ్డున ఉన్న ఆర్‌ అండ్‌ బీ గెస్ట్‌హౌస్‌ని ఇప్పటికే కూల్చివేసి కొత్త బిల్డింగ్‌ కడుతున్నారు. దీంతో ఆ కొత్త భవనాన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంగా మార్చేసి ఇప్పటికే అందుబాటులో ఉన్న ఆఫీస్‌ని గెస్ట్‌హౌస్‌గా మార్చమని అధికారులను ఆదేశించారట. అందుకు అనుగుణంగానే కొత్త బిల్డింగ్‌ డిజైన్స్‌ కూడా మారినట్టు తెలిసింది. కార్యకర్తల రాకపోకలు, ప్రెస్ మీట్‌ల నిర్వహణ, జిల్లా స్దాయి సమీక్షా సమావేశాలకు అనుగుణంగా, కొత్త క్యాంపు కార్యాలయాన్ని నిర్మించాలని అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. నల్గొండలోని వివిధ ప్రభుత్వం కార్యాలయాల మధ్యలో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ ఉండటం, భారీ సంఖ్యలో వాహనాలు వస్తుండడంతో… ఆయా కార్యాలయాల ఉద్యోగులతో పాటు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, అందుకే క్యాంప్‌ ఆఫీస్‌ మార్పు నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు ఆఫీసర్స్‌. కానీ… వాస్తు భయాలు కూడా ఉన్నాయేమోనన్న డౌట్స్‌ మాత్రం అలాగే ఉన్నాయి. దాన్నే కోట్‌ చేస్తూ…వాస్తు దోషాలు ప్రజా ప్రతినిధులకే వర్తిస్తాయా? మనకు వర్తించవా? అని ఆర్‌ అండ్‌ బీ సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారట. అటు బీఆర్‌ఎస్‌ నేతలు కూడా జీవిత కాలం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రిగా ఉంటారా అంటూ సెటైర్స్‌ వేస్తున్నట్టు తెలిసింది. పలు నిరసన కార్యక్రమాలకు వేదికగా ఉండే క్లాక్ టవర్ సెంటర్‌లో ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ నిర్మిస్తుండటం… కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా కూడా ఉన్నందున ముందు ముందు అనవసర సమస్యలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోందట కొందరిలో. క్యాంపు ఆఫీస్‌ వద్ద భద్రత కూడా పోలీసులకు సవాల్ గా మారే అవకాశం ఉందని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. మొత్తంగా వాస్తు ఎఫెక్ట్‌తో ఆఫీసులే మారిపోతున్నాయి. ఇదెక్కడి గదొడవరా బాబూ… అన్నది పొలిటికల్‌ పండిట్స్‌ మాట