NTV Telugu Site icon

Off The Record : ఎంవీవీ సత్యనారాయణ పొలిటికల్ రిటైర్డ్ హర్ట్ అవుతున్నారా ? రాజకీయాలకు దూరం అవుతున్నారా ?

Otr Over Mvv

Otr Over Mvv

అంతన్నాడింతన్నాడు…. గెలుపు నాదే… ఈసారి అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వండి.. చూపిస్తా నా తడాఖా అంటూ గొప్ప గొప్ప డైలాగ్‌లు చెప్పేశాడు. వీర లెవల్లో ఉన్న ఆ కాన్ఫిడెన్స్‌ చూసి.. అమ్మో… ఈయనతో జాగ్రత్తగా ఉండాల్సిందేనని ప్రత్యర్థులు సైతం ఆలోచనలో పడ్డారట. కానీ… ఒక్కటంటే ఒక్క షాక్‌తో సీన్ మొత్తం మారిపోయింది. ఓస్‌… ఇంతేనా అంటూ తేలిపోయిన ఆ పొలిటీషియన్‌ ఎవరు? ఏంటాయన రివర్స్‌ గేర్‌ స్టోరీ? విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. అంతకు మించి అసలాయన పవర్‌ పాలిటిక్స్‌కు దూరంగా జరుగుతున్నారన్నది విశాఖ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతున్న తాజా చర్చ. వైసీపీ ఓటమికంటే ఎక్కువగా ఎంవీవీ నిష్క్రమణ గురించే ఈ మధ్య ఎక్కువగా చర్చ జరుగుతోందట. 2017లో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు MVV. అది కూడా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కళా వెంకట్రావు కుటుంబంతో పెట్టుకున్న కయ్యమే అందుకు కారణం. విశాఖలో బిల్డర్ గా….30 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సత్యనారాయణ ఎంపీ అయ్యాక కూడా వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2019-24 మధ్య విశాఖ ఎంపీగా ఆయన చేసిన అభివృద్ధి పనుల కంటే చుట్టూ వచ్చిన వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యారు. CBCNC, హయగ్రీవ వంటి ప్రాజెక్టులపై చెలరేగిన వివాదాలు కోర్టు కేసుల దాకా ఆయన ఊహించని వ్యవహారం. ఆ వ్యవహారాల్లో ఎంవీవీని తెలుగుదేశం కంటే జనసేనే ఎక్కువ టార్గెట్ చేసింది. ఈ క్రమంలో…2024 ఎన్నికలు ఈ మాజీ ఎంపీ కెరీర్లో అతిపెద్ద షాక్. బిజినెస్ లోను, పాలిటిక్స్‌లోను సక్సెస్ మాత్రమే తెలిసిన సత్యనారాయణను విశాఖ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయించింది వైసీపీ అధిష్టానం. తూర్పులో పట్టు సాధించగలిగితే… పదేళ్లపాటు వైసిపి వేసిన వ్యూహాలు ఫలించినట్లు అయ్యేది. దానికోసం సర్వ శక్తులు ఒడ్డారు ఎంవీవీ. ప్రతిష్ట కోసం పోయి ఎన్నికల ఖర్చును 100 కోట్ల మార్కు దాటించేశారన్నది ప్రచారం. ఇంత చేసినా.. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడిని ఇంచ్ కూడా కదిలించలేకపోయారన్నది లోకల్‌ టాక్‌. ఇక ఫలితాల తర్వాత గతంలో ఉన్న వివాదాలు మాజీ ఎంపీని చుట్టుముట్టాయి.

ఆయన ప్రాజెక్టులపై విచారణ మొదలైంది. గతంలో వచ్చిన ఫిర్యాదులపై దృష్టి సారించారు అధికారులు. దీంతో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన జాగ్రత్తలు ఇప్పటికే తీసుకున్నారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. అది నిజమేనా అన్నట్టు ఇటీవల MVV వ్యవహార శైలి ఉంటుందనేది మరో చర్చ. వైసీపీకి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలు వేటికీ సత్యనారాయణ హాజరవడం లేదు. కావాలనే ఆయన దూరంగా ఉండే ప్రయత్నం చేస్తున్నారనేది రాజకీయ వర్గాల విశ్లేషణ. ఓటమి తర్వాత పార్టీ సంస్థాగత మార్పులను కీలకంగా భావిస్తోంది వైసీపీ. జిల్లా అధ్యక్షులు, అనుబంధ సంఘాలను ప్రకటించేందుకు అధినాయకత్వం సమావేశాలు నిర్వహించింది. అలాగే తిరుమల లడ్డు వివాదంలో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించేందుకు ఆలయాల్లో పూజలు చేసింది. నియోజకవర్గ సమన్వయకర్తగా,మాజీ ఎంపీగా ఎంవివి కచ్చితంగా హాజరు కావలసిన కార్యక్రమాలు ఇవి రెండూ. కానీ… ఆయన మాత్రం డుమ్మా కొట్టేశారు. దీంతో పార్టీ కేడర్‌లోనే అనుమానాలు పెరుగుతున్నాయట. అదే సమయంలో ఎంవివి తన దృష్టిని పూర్తిస్థాయిలో వ్యాపారాల మీదకు మళ్ళించడంతో… ఇక ఆయన యాక్టివ్‌ పాలిటిక్స్‌కు దూరం అయినట్టేనా అన్న చర్చ జరుగుతోంది.ఈ విషయాన్ని ఇప్పటికే హైకమాండ్‌కు చెప్పేసి ప్రస్తుత రాజకీయాలకు తన వ్యక్తిత్వం సూట్ అవ్వదని తేల్చేసినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో విశాఖ తూర్పులో పార్టీ నాయకత్వ మార్పు తప్పదంటున్నాయి వైసీపీ శ్రేణులు. సంఖ్యాపరంగా బీసీల ఆధిపత్యం ఉన్న నియోజకవర్గ కావడంతో ఆ సామాజిక వర్గానికే ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్‌ అనుకుంటున్నట్టు తెలిసింది. ఇలా మొత్తంగా మాజీ ఎంపీ పొలిటికల్ గ్రాఫ్‌ తక్కువ టైంలోనే… నేల చూపులు చూడటం ఆయన అస్సలు ఊహించని పరిణామం అంటున్నారు పొలిటికల్‌ పండిట్స్‌. అదే సమయంలో పాలిటిక్స్‌లోకి వచ్చినప్పుడు ఇరగదీసేస్తా… పొడిచేస్తానంటూ పెద్ద పెద్ద స్టేట్‌మెంట్స్‌ ఇచ్చారని, చివరికి బేలగా నేల చూపులు చూశారంటూ… అంతన్నాడింతన్నాడే గంగరాజు అంటూ సెటైర్స్‌ సైతం పడుతున్నాయి విశాఖ తూర్పులో.