Site icon NTV Telugu

Off The Record : కేర్ ఆఫ్ కాంట్రవర్సీ లిస్ట్ లో చేరుతున్న ఆ ఎమ్మెల్యే ఎవరు..?

Samua

Samua

ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్నా లొల్లే, రాజధానికి వచ్చినా లొల్లేనా? గాలికి పోయే కంపను గుడ్డకు తగిలించుకోనిదే ఆయనకు నిద్ర పట్టదా? ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని నెత్తినేసుకుని తిరిగితే తప్ప ఆయనకు రాజకీయం చేసినట్టు ఉండదా? కేరాఫ్‌ కాంట్రవర్శీ లిస్ట్‌లో చేరుతున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఆయన కదిపిన తాజా తుట్టె ఏంటి? ఓపెన్‌గా ఉండాలి. బోళాగా మాట్లాడాలని అనుకుంటూ ఉంటారు కొందరు రాజకీయ నాయకులు. ఆ తత్వం వాళ్ళని ఒక్కోసారి సమస్యల నుంచి బయటపడేస్తే… ఇరుకున పెట్టే సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ప్రామాణికానికి సరిగ్గా సరితూగే నేత తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌. రాజకీయాలు ఆయనకు కొత్త కాదు. ఆయన మీద పెద్ద పెద్ద అవినీతి ఆరోపణలు కూడా లేవు. కానీ.. ప్రతిసారి ఆయన నాలుక మాత్రం చిక్కుల్లోకి నెడుతూ ఉంటుంది. అందుకు నియోజక వర్గంలోని గ్రూపులు ఆజ్యం పోస్తుంటాయి. గాలికిపోయే కంపను గుడ్డకు తగిలించుకున్నట్టుగా ఆయన వ్యవహారం ఉంటుందని, అనవసర రచ్చ కొని తెచ్చుకుంటూ ఉంటారని చెప్పుకుంటారు సామేల్‌ని దగ్గరగా గమనిస్తున్నవారు. తుంగతుర్తి నియోజకవర్గం మీద కాంగ్రెస్‌ సీనియర్స్‌..దామోదర్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధిపత్యం ఎక్కువ. అందుకే… అందర్నీ కలుపుకుని పోవడం సాధ్యమయ్యే పని కాదన్నది అక్కడి నేతల అభిప్రాయం. ఇంత సంక్లిష్టమైన రాజకీయ వాతావరణం ఉన్న చోట బ్యాలెన్స్‌గా ఉండాల్సింది పోయి… ఎమ్మెల్యే మందుల సామేల్‌ తాజాగా మరో వివాదాన్ని నెత్తిమీదికి తెచ్చుకున్నారట.

 

మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలంటూ… సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కోరారు ఆ సామాజిక వర్గం నేతలు. ఇక మీడియాతో మంత్రి వర్గ విస్తరణపై మాట్లాడవద్దు, మాకు మంత్రి పదవులు ఇవ్వాలని అడగొద్దంటూ సీఎల్పీ సమావేశంలో కూడా స్పష్టం చేశారు సీఎం. కానీ ఆ సామాజిక వర్గం నేతలంతా మీటింగ్‌ పెట్టుకుని మాట్లాడుకున్నారు. ఇంతవరకు కూడా బాగానే ఉన్నా… ఆ తర్వాతే అసలు సమస్య మొదలైందట. మాదిగలకు క్యాబినెట్ విస్తరణలో అవకాశం ఇవ్వాలని అంటూనే… మంత్రి దామోదర రాజనర్సింహ నికార్సైన మాదిగ కాదని తుట్టెను కదిపారు. అక్కడితో ఆగారా అంటే…. అదీ లేదు. ఓవైపు నికార్సయిన మాదిగ కాదని మంత్రిని విమర్శిస్తూ… మరోవైపు ఆయన సీనియర్ కాంగ్రెస్ నేత అంటూ పొగడ్తలు కురిపించారు. అనవసరంగా… దామోదర రాజనర్సింహ వ్యవహారాన్ని ప్రస్తావించి ఎమ్మెల్యే కొత్త సమస్యల్లో ఇరుక్కున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. రాజనర్సింహతోపాటు కడియం శ్రీహరి ప్రస్తావన కూడా తీసుకు రావడం వివాదాస్పదం అవుతోంది. అనవసర మైన అంశాలను కోట్‌ చేస్తూ..తుంగతుర్తి ఎమ్మెల్యే పార్టీని కొత్త సమస్యలోకి నెట్టారన్న ఫీలింగ్‌ ఉందట కాంగ్రెస్‌ వర్గాల్లో. సొంత పార్టీ నేతల మీద కామెంట్స్ చేయడం, ఆ సామాజిక వర్గంపై ఇప్పటికే రచ్చ నడుస్తున్న క్రమంలో…. దానికి ఆజ్యం పోసినట్టు సామేల్‌ మాట్లాడటం కొత్త తలనొప్పి తప్ప వీసమెత్తు ప్రయోజనం ఉందా అన్న చర్చ జరుగుతోందట గాంధీభవన్‌లో. కాంగ్రెస్ నాయకత్వం కూడా పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదో…లేదంటే పార్టీ పట్టించుకోవడం మానేసిందో కానీ…. నేతల నోటికి మాత్రం అడ్డుకట్ట లేకుండా పోతోందని మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్‌ వర్గాలు. స్వేచ్ఛకు బదులు స్వేచ్ఛన్నర ఉంటే రిజల్ట్‌ ఇదేనంటున్నారు రాజకీయ పరిశీలకులు.

 

Exit mobile version