సాధారణంగా సౌమ్యంగా ఉండే ఆ శాసనసభ్యురాలికి ఉన్నట్టుండి కోపం కట్టలు తెంచుకుంది. అది కూడా అలా ఇలా కాదు….. ప్రత్యర్థుల మీద బూతుల సునామీ విరుచుకుపడింది. అన్నీ డ్యాష్…. డ్యాష్… బూతులేనట. ఎందుకంత శివాలెత్తిపోయారా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే? నియోజకవర్గ పరిణామాల ప్రభావమా ? లేక మరో కారణమా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా బూతు పురాణపు కహానీ? కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు ఎక్కడ లేని ఎప్పుడూ లేనంత కోపం వచ్చేసిందట. బీఆర్ఎస్ తరపున గెలిచిన కోవాలక్ష్మి సాధారణంగా సౌమ్యంగానే ఉంటారనే పేరుంది. కానీ… ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేని కావడంతో ప్రోటోకాల్ సమస్యలు వస్తున్నట్టు తెలిసింది. ఇటీవల తన నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటనకు వచ్చారు. రెబ్బన,ఆసిఫాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి మంత్రి. రెబ్బెనలో నిర్వహించిన స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానం అందడంతో అదెలాగంటూ అక్కడికి వెల్లారట కోవాలక్ష్మి. స్కూల్ దగ్గర కాంగ్రెస్ జెండాలు, ఫ్లెక్సీలు చూసి ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేక పార్టీ ప్రోగ్రామా అంటూ అక్కడున్న వారిని నిలదీయడంతో పాటు అధికారుల మీద ఫైరైపోయి మంత్రి కార్యక్రమానికి దూరంగా ఉన్నారట. ఆదివాసీ ఎమ్మెల్యేను అన్న చులకన భావంతో ఆసిఫాబాద్ కాంగ్రెస్ లీడర్లు ఎమ్మెల్యే అయిన తనకు తగిన గౌరవం ఇవ్వనీయకుండా, అధికారులు ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచారంటూ మండిపడుతున్నారట ఆమె. అంతటితో ఆగలేదు వ్యవహారం. మంత్రి సీతక్క కార్యక్రమంలో జై తెలంగాణ నినాదాలు చేశారు బీఆర్‌ఎస్ కార్యకర్తలు. దానికి ప్రతిగా కాంగ్రెస్ శ్రేణులు కూడా నినదించారు.
అక్కడ కాంగ్రెస్ కేడర్, తమ కార్యకర్తల్ని బూతులు తిట్టారంటూ…మరుసటి రోజు కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు కోవా లక్ష్మి. అక్కడ కాంగ్రెస్ నేతలను గట్టిగానే తిట్టిపోయడమేగాక తాను సైతం బూతులతో బాగానే కడిగేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే కాంగ్రెస్ నేతల మాట మరోలా ఉంది. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం చేయాల్సింది చేశారు. కానీ…ఎమ్మెల్యే అతిగా ఉహించుకొని తాము అనని బూతులు అన్నట్టుగా భావించి రివర్స్‌లో తిట్టారనేది అధికార పార్టీ వెర్షన్. ఆదివాసీ అయితే మాత్రం అంతం బూతులు తిడతారా? ఎమ్మెల్యేని అన్న సంగతి మర్చిపోయి నోరు పారేసుకుంటే ఎలాగన్నది కాంగ్రెస్ పార్టీ మహిళా నేతల క్వశ్చన్. కోవాలక్ష్మి తాను తిట్టిన కాంగ్రెస్ నేతలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడమే కాకుండా ఏకంగా దిష్టి బొమ్మను తగలబెట్టారు కాంగ్రెస్ నాయకులు. ఇదంతా ఒక ఎత్తయితే… అసలు కోవా లక్ష్మికి అంత కోపం ఎందుకు వచ్చిందన్న చర్చ గట్టిగా జరుగుతోంది. నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యేని అయినా… నామ మాత్రంగా మిగిలిపోతున్నానని, నిధుల విడుదల, ఇతర పనులన్నీ కాంగ్రెస్ నేతలు చెప్పినట్టే జరుగుతుండటంతో ఆమెలో అసహనం కట్టలు తెంచుకుంటున్నట్టు చెబుతున్నారు. అయితే అలాగని బూతులు తిట్టి ఏదో సాధిద్దామనుకుంటే ఎలాగన్నది కాంగ్రెస్ నేతల క్వశ్చన్. రాష్ట్రంలో జంపింగ్ సీజన్ నడుస్తున్నందున ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కూడా ఆ రూట్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇది కూడా స్థానిక కాంగ్రెస్ నేతలే చేస్తున్నారన్న కోపం కూడా ఉందట ఆమెకు. దీంతో అన్నీ కలగలిపి బూతుల పర్వానికి తెరలేపారన్నది లోకల్ వాయిస్. మూడు రోజులుగా కొమురం భీం జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ప్రోటోకాల్ రగడ సాగుతుండగా…రోజు రోజుకు నేతల ఆరోపణలు ప్రత్యారోపణలతో రాజకీయం వేడెక్కుతోంది. చివరికి ఈ పరిణామాలు ఎవరికి ప్లస్ అవుతాయి? ఎవరికి మైనస్ అవుతాయన్న చర్చ జరుగుతోంది జిల్లాలో.